కొత్త జిల్లాలపై అభ్యంతరాలు స్వీకరిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. అదేం పెద్దగా వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. ఏప్రిల్ 2ని అపాయింటెడ్ డే గా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, ఇప్పటికే ఉద్యోగుల విభజనకు సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.
దాదాపుగా నోటిఫికేషన్లో విడుదల చేసిన సరిహద్దులే తుది జాబితాలో ఉంటాయి, ఆనం, ఆదాల, రోజా, బాలకృష్ణ.. ఇలా ఎవరెవరు ఎక్కడెక్కడ దీక్షలు చేసినా, ఎన్ని విన్నపాలు చేసినా అవేవీ కుదిరేలా లేవనే విషయం స్పష్టమైపోయింది.
మా నియోజకవర్గాన్ని ఫలానా జిల్లాలో కలపండి, ఆ రెండు మండలాల్ని, ఇటువైపు వేయండి, ఈ రెండిట్నీ అటు వేయండి అంటూ.. ఇటీవల కాలంలో జిల్లాల విభజనపై అధికార పార్టీ నేతలే రాద్ధాంతం చేస్తున్నారు.
కొన్నిచోట్ల రాజకీయ ప్రయోజనాలున్నాయి, మరికొన్ని చోట్ల జిల్లా కేంద్రం దూరమైపోతోందనే బాధ స్థానికుల్లో కూడా ఉంది. కానీ లోక్ సభ నియోజకవర్గాలనే బౌండరీ పెట్టుకున్నట్టు ప్రతి విషయంలో రాజీ పడుతూ పోతుంటే దానికి అంతం ఉండదు. అందుకే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. జిల్లాల విభజన విషయంలో, సరిహద్దుల నిర్ణయంలో వెనక్కి తగ్గేదే లేదంటోంది.
ఉద్యోగులకు ఆప్షన్ ఫామ్ లు..
కొత్త జిల్లాల్లో ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే చాలామందికి ఆప్షన్ ఫామ్ లు జారీ అయ్యాయి. వారి స్థానికత, ప్రస్తుతం వారు చేస్తున్న డివిజన్ల ప్రకారం ఈ ఆప్షన్లు ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఏప్రిల్ 2 నుంచి కొత్తగా ఏర్పడుతున్న కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లలో పని పూర్తి స్థాయిలో మొదలు కావాలనేది ప్రభుత్వం ఆలోచన.
ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు..
ఏపీలో పోలీస్ డిపార్ట్ మెంట్ మినహా మిగతా ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు కొత్త జిల్లాలు, డివిజన్లకు అనుగుణంగా తాత్కాలిక బదిలీలు ఉంటాయి. మార్చి 11నాటికి ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల జాబితా సిద్ధమవుతుంది.
తుది జాబితాకు అనుగుణంగా ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు జారీ చేస్తుంది ప్రభుత్వం. ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత బదిలీలపై నిషేధాన్ని సడలిస్తారు. పాలనకు అనుగుణంగా ఉద్యోగుల్ని బదిలీ చేస్తారు.
తాత్కాలిక కేటాయింపుల్లో ప్రాంతీయ, జోనల్, మడంల, గ్రామ స్థాయి కార్యాలయాలు, పోస్ట్ ల విభజన, కేటాయింపు ఉండదు. జిల్లా, డివిజన్ స్థాయిలో మాత్రమే కేటాయింపులు ఉంటాయి.
జిల్లాల విభజనకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. అభ్యంతరాలన్నిటికీ కలెక్టర్ స్థాయిలోనే వడపోత ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ స్థానికంగానే ఆ సమస్యలు సమసిపోతాయి. సో.. కొత్త జిల్లాలకు ఏప్రిల్ 2 అనే మహూర్తం… పక్కాగా మారిపోయింది.