– భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
గవర్నర్ ప్రసంగం రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రభుత్వ పథకాల చిట్టాను ఏకరువు పెట్టడం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. ఆ సంక్షేమ పథకాలపై కూడా ఏదో ఒకపేరుతో కోత పెడుతున్నారు. పైగా ఆ పేరుతో ప్రజలపై అదనపు భారాలు మోపడంపై వివరణ లేదు. రాష్ట్రానికి కేంద్రం చేసిన విద్రోహం అన్యాయం గురించి మాట మాత్రం ప్రస్తావించకపోవడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ గర్హిస్తున్నది.
ప్రసంగం ఆసాంతం వాస్తవాలను గుర్తించకుండా స్వోత్కర్షలతో నిండిపోయిందని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ అభిప్రాయపడుతోంది.గవర్నర్ ప్రసంగం నిస్సారంగా ఉంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వ వైఖరి ఏమిటో విశదీకరించలేదు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు తదితర విషయాలన్నిటిలోనూ ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం గురించి ఒక్క మాట కూడా లేకపోవడం శోచనీయం.
కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్నా, ఫెడరలిజాన్ని దెబ్బగొడుతున్నా గవర్నర్ ప్రసంగం మౌనం వహించడం దారుణం. వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధర కాదు సరికదా మద్దతు ధరయినా దక్కడంలేదు. అయినా ఆర్‌బికెలే సర్వస్వం అన్నట్టు ప్రభుత్వం పొగుడుకుంటోంది. బ్యాంకుల్లో వ్యవసాయానికి పరపతి అందక, ఇ`క్రాప్‌లో పంట నమోదు కాక వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతులు ఎన్నో ఇక్కట్లు పడుతుంటే వారిని ఎలా ఆదుకుంటారో గవర్నర్ ప్రసంగం ప్రస్తావించకపోవడం అన్యాయం.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, లోటు భర్తీకి నిధుల మంజూరులో తీవ్ర వివక్షతో వ్యవహరిస్తున్న కేంద్రాన్ని ఏమీ అనలేదు. నిర్వాసితుల గురించి ప్రస్తావించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆందోళన చేసినా అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను విడుదల చేయకుండా మొన్నటివరకూ తొక్కిపట్టి ఆ సిఫార్సులకన్నా చాలా తక్కువ ప్రయోజనాలను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు పదకొండవ వేతన సవరణను అమలు చేశామని చెప్పడం హాస్యాస్పదం.
అంగన్‌వాడీ, ఆశా తదితర స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఏమీ చెప్పలేదు. ముఖ్యమంత్రి ఎన్నికల హామీ సిపిఎస్ రద్దుపై సర్కారు విధానమేమిటో వెల్లడిరచకపోవడం మాటతప్పడమే.రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రకారం అమరావతిని రాజధానిగా అభివృద్ది చేస్తామని కూడా చెప్పలేదు. ఎన్‌ఇపి గురించి గవర్నర్ గొప్పగా చెప్పారేకాని, పేద పిల్లలు ముఖ్యంగా బాలికల్లో డ్రాపవుట్స్ పెరుగుతాయన్న సత్యాన్ని మరుగుపర్చారు.
పి.జి. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంటు ఇవ్వడం లేదు. జగనన్న గృహాల గురించి అంకెల గొప్పేతప్ప సర్కారు నిధులివ్వని మాట గవర్నర్ మరిచినట్టుంది. టిడ్కో ఇళ్లు అప్పగించకుండా మరోవైపు ఒటిఎస్ పేరిట సాగిస్తున్న ప్రహసనం ప్రసంగంలో ఎక్కడా చోటు చేసుకోలేదు.
ప్రభుత్వ జి.వో.లు వెబ్‌సైట్‌లలో పెట్టకుండా, అశుతోష్‌మిశ్రా నివేదికను సకాలంలో విడుదల చేయకుండా పారదర్శకత గురించి మాట్లాడటం హాస్యాస్పదం.శాసనసభ, మండలిలో వివిధ ప్రజా సమస్యలపై చర్చ జరిపి, ఆయా అంశాలపై ప్రభుత్వ వైఖరిని వెల్లడిరచి, ఆ మేరకు గవర్నర్ ప్రసంగాన్ని సవరించాలని సిపిఐ(ఎం) ఆంధ్రప్రదేశ కమిటీ డిమాండ్ చేస్తోంది.