-ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యుడు సామినేని ఉదయ భాను
వెలగపూడి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల ద్వారా కరోనా సమయంలో లక్షలాది మంది ప్రజలకు ఉపాధి లభించిందని, ఆకలితో అలమటించకుండా ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లాయని ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట సామినేని ఉదయ భాను అన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ పనుల్లో భాగంగా గత ప్రభుత్వం గ్రామీణ ప్రాతాల్లో డ్రైనేజీలు నిర్మిస్తామని చెప్పి ఇచ్చిన హామీని విస్మరిస్తే ఈ ప్రభుత్వ హయాంలో వాటిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉపాధి హామీ పనుల ద్వారా పూర్తి చేయడం జరిగిందన్నారు. అయితే ఈ పనులకు సంబంధించిన బిల్లులకు ఇచ్చిన ఎఫ్‌టీవో నంబర్లు ప్రస్తుతం కనిపించడం లేదని, ఏప్రిల్‌లో బిల్లులు విడుదల చేస్తే ఈ ఎఫ్‌టీవో నంబర్లు లేకపోతే ఇబ్బందులెదురవుతాయని తెలిపారు.
ఈ క్రమంలో ఇప్పటినుండే కార్యాచరణతో ముందుకు సాగకపోతే బిల్లులు చెల్లించే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురై పనులు చేసిన వారు ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. దీనిపై సంబంధిత మంత్రి వెంటనే స్పందించి ఎఫ్‌టీవో నంబర్లు ఎందుకు కనిపించడంలేదో, అందుకు గల కారణాలును తెలుసుకుని వెంటనే వాటిని పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాచేయడం ద్వారా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నేతృత్వంలో మరిన్ని ఉపాధి పనులు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.