Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు అరెస్టును నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను

ప్రజల కోసం బతికే నాయకున్ని అక్రమంగా జైల్లో నిర్భందించారు.
రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు చంద్రబాబు నిద్రలేని రాత్రులు గడిపారు.
చంద్రబాబు అరెస్టుతో మనోవేదనతో బిడ్డల్లాంటి కార్యకర్తలు ప్రాణాలు వదిలారు
కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలనే నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టా
ప్రజాసమస్యలు చర్చించే అసెంబ్లీలో నన్ను అనరాని మాటలన్నారు
నాన్న ఇచ్చిన ధైర్యంతోనే అవమానాన్ని తట్టుకోగలిగా
సంక్షేమ పథకాల మాటున వైసీపీ పేదల పొట్టకొట్టి జేబులు నింపుకుంది.
నెల రోజుల్లో కురుక్షేత్ర యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నాం…ఇందులో ఓటే మన ఆయుధం
మూడు పార్టీల జెండాలు వేరైనా….ప్రజా ప్రభుత్వ స్థాపనే అజెండా
చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి ఉద్వేగపూరిత ప్రసంగం

తిరువూరు : చంద్రబాబుకు నా కృతజ్ఞతలు…నిజం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహించాలనే నాకు బాధ్యతను అప్పగించారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిలోనిది 2023 సెప్టెంబర్ 9వ తేదీ. చంద్రబాబు నంద్యాలలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో అర్ధరాత్రి పోలీసులు వెళ్లి అరెస్టు చేశారు. సెప్టెంబర్ 10న మా పెళ్లిరోజు…అంతక ముందరోజు తెల్లవారుజామున 3 గంటలకు లోకేష్ ఫోన్ చేసి నాన్నను అరెస్టు చేశారని నాకు నిమిషం పాటు ఏమీ అర్థం కాలేదు.

చంద్రబాబు అరెస్టుతో కుటుంబంలోని నలుగురం నాలుగు దిక్కులకు వెళ్లిపోయాం. అరెస్టు చేశాక 53రోజులు ఎలా గడిపామో మాకే తెలియదు. నా భర్తను కోర్టు కలిసేందుకు వద్దకు వెళ్లినప్పుడు చోటు చేసుకున్న ఘటనను నేను ఇప్పటికీ మర్చిపోలేను. నా భర్త ప్రజల కోసం బతికారు…యావత్ దేశంలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. మచ్చలేని చంద్రుడిని పోలీసులు అదుపులోకి చుట్టూ ఆరుగురు పోలీసులు కాపలా ఉండడాన్ని చూసి నేను తట్టుకోలేకపోయాను.

ఆయన అరెస్టుతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించాలని చెప్పారు. ఇచ్చిన బాధ్యతను ఎలా నిర్వర్తించాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఏనాడూ ప్రజల్లోకి రాలేదు…ప్రజల మధ్య ఎక్కడా మాట్లాడలేదు.ఇలాంటి పరిస్థితుల్లో నా కోడలు నాకు ఓ కూతురులా బాసటగా నిలిచింది. అరెస్టు సమయంలో మేము రాజమండ్రి వెళ్లిన సమయంలో అక్కడి ప్రజలు, కార్యకర్తలు అండగా నిలిచిన తీరు నేను ఎప్పూడు మర్చిపోలేను.

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి లక్షలాది యువతకు ఉద్యోగాలు కల్పిస్తే ఈ ప్రభుత్వం దాన్ని అక్రమం అంటూ అరెస్టు చేయించింది. స్కిల్ కేసులో నేటికీ చంద్రబాబు తప్పు చేశారని నిరూపించలేకపోయారు…చంద్రబాబు నిజాయితీ ఇక్కడే అర్థమవుతోంది. చంద్రబాబు, ఆయన కుటుంబం ఏనాడూ తప్పు చేయలేదు…చేయదు. మీ బిడ్డలు రేపు ఆయన్ను చూస్తారో లేదో నాకు తెలియదు కానీ…తను చేసిన అభివృద్ధి పనులు చూస్తే ఆయన గుర్తు రావాలి అని చంద్రబాబు అంటారు.

పోలవరం శాశ్వతం, అమరావతి శాశ్వతం, రాయలసీమకు నీళ్లు శాశ్వతం, పట్టిసీమ, కియామోటర్, హైటెక్ సిటీ, జినోమ్ వ్యాలీ లాంటి సంస్థలు శాశ్వతం అని చెప్తుంటారు. అరెస్టు అయిన సమయంలో ఏపీ, తెలంగాణ ప్రజలు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా రోడ్డు ఎక్కారు. దీనికి కారణం చంద్రబాబు చేసిన అభివృద్ధి వల్ల వారు పొందిన లబ్ధి…ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.

ఎప్పుడూ గడప దాటని మహిళలు..చంద్రబాబు అరెస్టు సమయంలో రోడ్డు మీదకు వచ్చి పోరాడారు. దీనికి గల కారణం చంద్రబాబు వల్ల భావితరాలకు కలిగే ప్రయోజనం. అరెస్టును నిరసిస్తూ మహిళలు అనేక కార్యక్రమాలు నిర్వహించారు..మహిళలనూ పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎన్టీఆర్ పౌరుషం, పట్టుదల, ధైర్యం నాలో ఉన్నాయి… నేడు మేము ఇలా ముందుకు వెళుతున్నామంటే ఎన్టీఆర్ లోని క్రమశిక్షణే దానికి కారణం.

లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తానని చెప్పిన సమయంలో నేను చాలా ఆందోళన చెందాను…కానీ లోకేష్ నాకు ధైర్యం చెప్పాడు..ఆ సమయంలో నాకు దేశ సైనికులు గుర్తుకొచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు స్ఫూర్తితో నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేశారు. 226రోజులు, 3,132 కిలోమీటర్లు నారా లోకేష్ నడిచాడు…రాష్ట్ర ప్రజల కోసం లోకేష్ పాదయాత్ర చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీని తెలుగువారి ఆత్మగౌరవం, పేదవారి కోసం స్థాపించారు.

ఎన్టీఆర్ సిద్ధాంతాలకు అనుగుణంగా చంద్రబాబు కూడా పార్టీని ముందుకు నడిపారు. ఎన్టీఆర్ ఆశయాల్లో భాగంగా 306అన్నా క్యాంటీన్లు పెట్టారు. రోజుకు 2.25లక్షలు మంది భోజనం చేశారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాక అందులో 7.5కోట్ల మంది భోజనం చేశారు. ఇలాంటి అన్న క్యాంటీన్లను వైసీపీ రాక్షసులు మూసేసి పేదవారి పొట్ట కొట్టారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు.

నిజం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహించిన సమయంలో అనేక వర్గాల ప్రజలను నేను కలిశాను. ఆ సమయంలో ఆయా వర్గాల ప్రజలు చంద్రబాబు చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాల గురించి చెప్తుంటే నేను చాలా ఆశ్చర్యపోయేదాన్ని. చంద్రబాబు అమలు చేసిన పథకాల జాబితాను నేను తీసుకుని చూసిన సమయంలో నేను మీలో ఒక మహిళగా ఎంతో ఆనందం వ్యక్తం చేశాను. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని, ముందు చూపుతో అమలు చేసిన పథకాలు గతంలో ఎవరూ అమలు చేయలేదు.

వైసీపీ నాయకులు 2019లో ఓట్లు కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు…ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. సంక్షేమ పథకాల చాటున వైసీపీ నేతలు పేదవారి పొట్టకొట్టి వారి జేబులు నింపుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజన్ 2020ను తెచ్చారు. కానీ నేడు ఆ 2020 విజన్ అనేక మందికి ఉద్యోగాలు కల్పించింది. విజన్ 2020 ద్వారా వచ్చిన కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో రోడ్డు మీదకు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ విషయంలో నేను చాలా గర్వపడ్డాను.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీని కట్టుబట్టలతో రోడ్డమీద పడేస్తే…ఆ పరిస్థితుల్లో చంద్రబాబు బస్సులో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. హుద్ హుద్ తుఫాను వచ్చిన సమయంలో చంద్రబాబు రాత్రింబవళ్లు పనిచేసి విశాఖకు సుందరమైన రూపాన్ని తీసుకొచ్చారు. ప్రపంచంలో ఏ నాయకుడికీ దక్కని గౌరవాన్ని అమరావతి రైతులు ఇచ్చారు. చంద్రబాబును నమ్మి 33వేల ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారు. రాజధానికి భూములిచ్చిన రైతులును ఉద్యమంలో పాల్గొన్నందుకు వైసీపీ నాయకులు ఇబ్బందులు పెట్టారు.

అమరావతి ఉద్యమంలో పాల్గొన్న ఓ గర్భిణిని పోలీసు బూటు కాలితో తన్నడం వల్ల ఆ గర్భిణి కడుపులోని బిడ్డ చనిపోయింది.అమరావతి మహిళలపై అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. వైసీపీ ప్రభుత్వానికి…వైసీపీ నాయకులకు మహిళలను గౌరవించడం తెలియదు. వైసీపీ పరిపాలన కూల్చివేతలతో మొదలైంది…ప్రజావేదికను కూల్చడంతో వైసీపీ ప్రభుత్వం తన పాలనను ప్రారంభించింది.

వైసీపీ నాయకులు దేన్నీ వదలకుండా ధ్వంసం చేస్తున్నారు.పోలవరాన్ని చంద్రబాబు 72శాతం పూర్తిచేస్తే…దాన్ని వైసీపీ పాలనలో ధ్వంసం చేస్తున్నారు. నేటికీ ఒక్కశాతం పని కూడా వైసీపీ ప్రభుత్వం నిర్వహించలేదు. 2019లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టేందుకు నిద్రలేని రాత్రులను చంద్రబాబు ఎన్నో గడిపారు. చంద్రబాబు ఏనాడూ కుటుంబం గురించి ఆలోచించలేదు…కేవలం ప్రజలు, రాష్ట్రం గురించే ఆలోచించారు.

వైసీపీ రాక్షస ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టారు. నందం సుబ్బయ్య, మాచర్ల చంద్రయ్య వంటి టీడీపీ కార్యకర్తలను దుర్మార్గంగా నడిరోడ్డుమీద నరికి చంపేశారు. బంగారుపాళ్యంలో హంసవేణి అనే మహిళా మంచినీళ్లు రావడం లేదని అడిగినందుకు వైసీపీ రాక్షసులు కళ్లు పీకేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను కూడా వదలకుండా వేధించి చంపుతున్నారు. నంద్యాలలో అబ్ధుల్ సలాం కుటుంబాన్ని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.

మిస్బా అనే పదో తరగతి విద్యార్థినిని వైసీపీ నేతలు వేధించడం వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇటీవల నందికొట్కూరు నియోజకవర్గంలో ఓ ముస్లిం మహిళను వైసీపీ నాయకుడు అడ్డగించి బుర్కా తీసి వేధించాడు. నాకు తెలియని అనేక సంఘటనల్లో రాష్ట్ర ప్రజలు ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. తాజాగా విశాఖలో ఓ మహిళపై పెట్రోల్ పోసి వైసీపీ నేతలు చంపేశారు.

అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడే అంశాలు మాట్లాడాల్సిన వైసీపీ ప్రజాప్రతినిధులు…నన్ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను…అసెంబ్లీ గౌరవ ప్రతిష్టలను దిగజారుస్తున్నారని నేను ఆ సమయంలో బాధపడ్డాను. నా తండ్రి నాకు నేర్పిన క్రమశిక్షణ, ధైర్యం, పట్టుదలతో నేను నా కుటుంబాన్ని సమర్థవంతంగా ముందకు నడుపుతున్నాను. నా తల్లి నాకు నేర్పిన మంచిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళుతున్నాను.

వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలకు గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం, ఇసుక మాఫియా ఎలా చేసి డబ్బులు సంపాదించాలో నేర్పుతున్నారు…రాష్ట్రం పరువు తీస్తున్నారు..రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలు వైసీపీ పాలనలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు..మానసిక వేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో 30,196మంది మహిళలు ఈ ఐదేళ్లలో అదృశ్యం అయ్యారు..వారి గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

కల్తీ మద్యాన్ని వైసీపీ ప్రభుత్వం అలవాటు చేసింది…దీనివల్ల అమాయకులు అనారోగ్యంపాలవుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్టుకు నేను మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాను…ఈ ట్రస్టు విషయంలోనూ చంద్రబాబు పేదవారి గురించే ఆలోచిస్తున్నారు. చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 6,449మంది కార్యకర్తల బిడ్డలు ఉచితంగా చదువుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల జెండాలు వేరైనా….అజెండా ఒక్కటే….ఆ అజెండా ప్రజల ప్రభుత్వాన్ని స్థాపించడమే. రాష్ట్ర ప్రజలంతా చేయి చేయి కలిపి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించాలి…రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి.

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేసి…చించేసి…చించేసి…ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలి. కుటుంబానికి తండ్రి ఎంత అవసరమో…ఈ రాష్ట్రానికి నాయకుడు అంత అవసరం…ఆ నాయకుడు చంద్రబాబునాయుడు. చంద్రబాబు చివరి నిమిషం వరకు మీకోసమే బ్రతుకుతారు. స్వాతంత్ర్య ఉద్యమంలో యావత్ భారతదేశం మహాత్మాగాంధీకి చేయూతనిచ్చారు కాబట్టి మనకు స్వాతంత్ర్యం వచ్చింది…అలాగే మన ప్రజా ప్రభుత్వం రావాలంటే మనమంతా చంద్రబాబుకు చేయి చేయి కలిపి అందించాలి.

టీడీపీని స్థాపించింది ఎన్టీఆర్..ఎన్టీఆర్ రాజకీయ వారసులు పార్టీ కార్యకర్తలు. పార్టీని నడిపించేది చంద్రబాబు. టీడీపీని ముందుకు తీసుకెళ్లేందుకు లక్షలాది పసుపు సైనికులు ఉన్నారు. మరో నెలలో మనం ఓ కురుక్షేత్రాన్ని ఎదుర్కోబోతున్నాం…ఈ కురుక్షేత్రంలో మన ఆయుధం ఓటు. మన ఓటు హక్కుతో దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించాలి…ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలి.

ఈ కురుక్షేత్ర యుద్ధంలో మన సైకిల్ స్పీడు పెంచుదాం…అడ్డొచ్చిన వైసీపీ దుర్మార్గులను తొక్కుకుంటూ ముందుకు వెళదాం…పసుపు జెండాను ఎగరేద్దాం. ఎక్కడా వెనక్కి తిరిగి చూడొద్దు. తెలుగు పౌరుషం అంటే ఏంటో రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో రుచి చూపించాలని నేను కోరుతున్నాను.

 

LEAVE A RESPONSE