Suryaa.co.in

Andhra Pradesh

తాడేపల్లిలోని జగన్ రెడ్డి దంపతుల ఓట్లు పులివెందులలో ఎలా ఉంటాయి?

– వాలంటీర్లు గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి, వారిని అగౌరవ పరిచిన మంత్రి ధర్మాన పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి
– వాట్సాప్ దుర్వినియోగం చేసిన నాగార్జున యూనివర్సిటీ సూపరెంటెండెంట్ వెంకటప్ప రెడ్డిని సస్పెండ్ చేసిన ఎన్నికల అధికారి ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలి
– తెదేపా సీనియర్ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా, కె.ఎస్.జవహర్

వాలంటీర్లను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రి ధర్మాన, ముఖ్యమంత్రి కోసం విద్యార్ధులతో ఎన్నికల సర్వేలు చేయిస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డిపై, ఎన్నికల నియమావళి, విధులుపై కనీసం అవగాహన లేని విజయవాడ అధికారులపై చర్యలు తీసుకోండని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, మాజీ మంత్రులు దేవినేని ఉమా, కె.ఎస్.జవహర్ లు ఫిర్యాదు చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెదేపా నేతలు పాల్గొన్నారు.

వాలంటీర్లను అగౌరవ పరిచిన మంత్రి ధర్మానపై చర్యలు తీసుకోవాలి: వర్ల రామయ్య
“మంత్రి ధర్మాన ప్రసాద్ వాలంటీర్లకు మేమెంతో చేశాం, నెత్తి మీద కిరీటం పెట్టామని, కానీ ఇప్పుడు వాలంటీర్లు మా మాట వినడం లేదని మా పై బురద జల్లుతున్నారని కాబట్టి ఇదే పరిస్థితి కనబరిస్తే వాళ్ళని పీకేయండి అని వాలంటీర్లను అగౌరవ పరిచారు. చెప్పిన మాట వినని వాలంటీర్లను పీకేయండి అని బెదిరిస్తున్నారు. వాళ్ళనే రాజీనామా చేయమనండి లేదంటే మనమే తీసేద్దామని నోటికి వచ్చినట్లు మంత్రి ధర్మాన మాట్లడుతున్నాడు.

వైసీపీ నాయకుల మనసులో వాలంటీర్ల స్థానం ఏంటో మంత్రి ధర్మాన వ్యాఖ్యల్లో అర్ధమవుతోంది. జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీ కి సేవ చేయడం కోసం మాత్రమే వాలంటీర్లను పెట్టుకున్నారని వాలంటీర్లు అర్థం చేసుకోవాలి. ఇలా వాలంటీర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న మంత్రి ధర్మాన ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి. మంత్రి ధర్మాన మాట్లాడిన వ్యాఖ్యలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మంత్రి ధర్మానపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు

జగన్ రెడ్డి మన్ననల కోసం ఆంధ్రా యూనివర్సిటీ వీసీ తాపత్రయం…
“వాట్సాప్ లో జగన్ జిందాబాద్ అంటూ పోస్టులు ఫార్వార్డ్ చేసిన నాగార్జున యూనివర్సిటీ లో పనిచేస్తున్న వెంకటప్ప రెడ్డి అనే సూపరెంటెండెంట్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. కానీ జగన్ జిందాబాద్ అంటున్న ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డిపై చర్యలేవి? చట్టానికి విరుద్ధంగా కేవలం జగన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడానికి విద్యార్ధులతో ఎన్నికల సర్వేలు చేయిస్తునాడు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ వీసీప్రసాద్ రెడ్డిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలి” అని వర్ల డిమాండ్ చేశారు.

ఎన్నికలపై కనీసం అవగాహన లేని అధికారులు బెజవాడలో ఉన్నారు….
“విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మా పార్టీ తరఫున పోటీ చేస్తున్న బొండా ఉమామహేశ్వరరావుకు సింగ్‌నగర్ లో, తూర్పు నియోజకవర్గంలో కూడా ఇళ్లు ఉన్నాయి. రాత్రులు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఇంట్లో కాకుండా పక్క నియోజకవర్గంలో రాత్రులు నిద్రిస్తున్నాడని, అతని కుటుంబసభ్యుల ఓట్లను తొలగించాలని కొంతమంది తెలివి తక్కువ ఎన్నికల అధికారులు ప్రశ్నిస్తున్నారు.

సొంత నియోజకవర్గంలో కాకుండా వేరే నియోజకవర్గంలో నిద్రిస్తే ఓట్లు తొలగించాలంటే ఐదేళ్లుగా పులివెందుల వదిలేసి తాడేపల్లిలో పగలు, రాత్రులు నిద్రిస్తున్న జగన్ రెడ్డి, అతని శ్రీమతి భారతీ రెడ్డి ఓట్లు ఎక్కడ ఉండాలి? తెలివి తక్కువ వాళ్ళు అన్న మాట ప్రకారం జగన్ రెడ్డి ఓట్లు కూడా పులివెందులలో తొలిగించాలి కదా? పులివెందుల నుంచి మంగళగిరి ఓటరుగా జగన్ రెడ్డి మారి మా లోకేష్ బాబుకు ఓటు వేయమని చెప్పండి. కొంచెం కూడా అవగాహన లేని అధికారులను పెట్టుకొని ఎన్నికలు ఎలా జరుగుతాయోనన్న ఆందోళన మాలో ఉంది. ఖచ్చితంగా ఇటువంటి ఎన్నికల నిబంధనలపై కనీసం అవగాహన లేని అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలి “ అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

బడా అధికారులపై చర్యలు శూన్యం: దేవినేని ఉమా
“పొన్నూరు నియోజకవర్గంలో వైకాపా తరపున పోటీ చేస్తున్న అభ్యర్ధి చేస్తున్న అక్రమాలపై ఎప్పటికప్పుడు మా అభ్యర్ధి ధూళిపాళ్ళ నరేంద్ర ఎన్నికల అధికారులకు తెలియపరుస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కూడా వైకాపా అభ్యర్దే పంపిణీ చేస్తోంది. ఇదేమిటని అడిగితే ప్రభుత్వ చెక్కులు కాదు. మా సొంత డబ్బులు పంచుతున్నామని తెలివి తక్కువ సమాధానాలు చెబుతున్నారు.
పదుల సంఖ్యలో ఎన్నో ఫిర్యాదులు నేటికి ఇచ్చాం, కాని వాటిపై ఇంతవరకు చర్యలు తీసుకున్నారో లేదో మాకు తెలియడం లేదు. చిన్న చిన్న అధికారుల చర్యలు తీసుకున్న విషయాలు తప్ప పై అధికారులపై ఏమి చర్యలు తీసుకునారో మాకు సమాచారం అందడం లేదు. వీటన్నిటిపై మా అభ్యర్ధనలను ఎన్నికల కమిషన్ కు తెలియపరిచం. వాటిపై వివరణ కోరాం” అని దేవినేని ఉమా తెలిపారు.

ఎన్నికల కోడ్ వచ్చినా ఇంకా జగన్ రెడ్డి పరిధిలోనే పనిచేస్తున్న పోలీసు యంత్రాంగం: కె.ఎస్. జవహర్
“జగన్ రెడ్డి దళితులకు చేసిన అన్యాయం, ఆపిన పథకాల గురించి ప్రెస్ క్లబ్ లో దళితులు సమావేశం అయితే దానిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినా పోలీసులు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నారో లేక ఇంకా జగన్ రెడ్డి పరిధిలో ఉన్నారో మాకు అర్ధం కావడం లేదు. అధికారం మారబోతుంది. ఇప్పటికైనా పోలీసులు మారి ప్రజా సేవ చేయాలని పోలీసు శాఖను కోరుతున్నాం. కాదు మేము ఇలానే ఉంటాం..దళితులను అడ్డుకుంటామని పోలీసులు వ్యవహరిస్తే సహించేది లేదు” అని జవహర్ హెచ్చరించారు.

వీరితో పాటు ఎన్నికల కమిషన్ ను కలిసిన వారిలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE