Suryaa.co.in

Andhra Pradesh

మంగళగిరి చరిత్ర తిరగరాస్తా!

-మార్పు కోసమే వచ్చా…
-అభివృద్ధి చేసి మంగళగిరి ప్రజల మనసులను గెలుస్తా
-పసుపు జెండా ఎగరేసి అభివృద్ధికి చిరునామాగా మారుస్తా
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్

మంగళగిరి: మార్పుకోసమే మంగళగిరికి వచ్చా… 1985 తర్వాత ఇక్కడ టిడిపి గెలవలేదు, ఈసారి పసుపుజెండా ఎగరేసి చరిత్ర సృష్టిస్తా, మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మార్చి ప్రజల మనసుల్లో స్థానం సంపాదిస్తానని యువనేత నారా లోకేష్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సమృద్ధి అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయినా నా సొంతం అనుకుని నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సేవలందిస్తున్నా. సొంతడబ్బుతో 29 అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలిచా. శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక పేదరికం లేని మంగళగిరిగా తీర్చిదిద్ది, మంగళగిరి మోడల్ ను దేశానికి పరిచయం చేస్తా. ప్రజలు కోరకపోయినా మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్ ఏర్పాటుచేసి పన్నుల భారం పెంచారు. మౌలిక సదుపాయాలను మాత్రం విస్మరించారు. పంచాయతీలుగానే కొనసాగించాలని అనేక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కార్పోరేషన్ అంశం కోర్టు పరిధిలో ఉంది. ప్రజాభీష్టం మేరకు రెండింటినీ మున్సిపాలిటీగా మార్చి పన్నులభారం తగ్గిస్తాం. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతో పాటు కుళాయి ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తాం.

బ్లాక్ డెవలప్ మెంట్ మోడల్ తో అభివృద్ధి
బ్లాక్ డెవలప్ మెంట్ విధానంలో రోడ్లు, పార్క్ లు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేస్తాం. 25 ఏళ్లుగా రెండు కుటుంబాలను ఆదరించారు. వారు ఒక్క పరిశ్రమగానీ, ఉద్యోగం గానీ తీసుకురాలేకపోయారు. స్వర్ణకారులు అధికంగా ఉన్నందున మంగళగిరిలో గోల్డ్ సెజ్ ఏర్పాటుచేసి, 30వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ప్రోత్సహకాలు అందించి నియోజకవర్గానికి అనేక ఐటీ పరిశ్రమలు తీసుకువస్తే.. జగన్ వచ్చాక అవన్నీ తరలిపోయాయి. మంగళగిరికి పరిశ్రమలుతెచ్చి యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మంగళగిరి ప్రాంతంలో ఆహ్లాదకరమైన కొండలు ఉన్నాయి, హైకింగ్ ట్రయల్స్ ఏర్పాటుచేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఈ ఎన్నికల్లో 53,500 ఓట్ల భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తే చంద్రబాబు, పవన్ తో దెబ్బలాడి నిధులు తీసుకువస్తానని లోకేష్ చెప్పారు.

లోకేష్ దృష్టికి అపార్ట్ మెంట్ వాసుల సమస్యలు
తాడేపల్లి సమృద్ధి అపార్ట్ మెంట్ వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు కల్పించాలి. ఇందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయాలి. అమరావతిలో స్థలాలు కొంటే పట్టాలు ఇవ్వలేదు. యానిమేషన్ రంగాన్ని ప్రోత్సహించాలి. పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించి, ఇతర ప్రాంతాలకు వలసవెళ్లకుండా చూడాలి.

రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా రెవిన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. యువనేత లోకేష్ స్పందిస్తూ… మంగళగిరి నియోజకవర్గంలో పసుపు, మిర్చి వంటి స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసి రైతులకు లాభసాటి చేస్తాం. సాంప్రదాయ కోర్సులతోపాటు విద్యతోపాటు ఉపాధి కల్పించే ప్రొఫెషనల్ కోర్సులు ప్రవేశపెడతామని, కెజి నుంచి పిజి వరకు సిలబస్ లో మార్పు తెస్తామని లోకేష్ చెప్పారు.

LEAVE A RESPONSE