Suryaa.co.in

Andhra Pradesh

పిన్నెల్లికి బెయిల్

జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు
ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ

అమరావతి: మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్‌ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటనను ఈసీ సీరియస్గా తీసుకోవటంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు 8 ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

బుధవారం హైదరాబాద్‌లో పిన్నెల్లి కారును గుర్తించిన ఏపీ పోలీసులు ఆయన డ్రైవర్‌, గన్‌మెన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు జూన్ 6 వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా పిన్నెల్లి సహా పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్‌పైనా ఆదేశాలిచ్చింది.

LEAVE A RESPONSE