-ముఖ్యమంత్రి తమ వాడు కాకపోతే చాలు..
-పచ్చి అబద్ధాలు రాయొచ్చా? ఇదేనా జర్నలిజమ్?
-సూటిగా ప్రశ్నించిన డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
విశాఖపట్నం: ప్రెస్మీట్లో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంకా ఏం మాట్లాడారంటే..:
ప్రజలంతా ఆలోచించాలి:
సామాజిక పింఛన్ల పంపిణీకి సంబంధించి ఈరోజు వచ్చిన వార్తను చూస్తే… ముఖ్యమంత్రి తమవాడు కాకపోతే ఏది పడితే అది… పచ్చి అబద్ధాలు రాయవచ్చా అన్నది రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఇందుకు సంబంధించిన నిజాలను ప్రజల ముందు ఉంచుతున్నాం.
పెన్షన్లు–మౌలిక వాస్తవాలు:
2014–19 మధ్య, చివరి రెండు నెలలూ మినహాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం నెలకు ఇచ్చిన సామాజిక పింఛన్ రూ.1000 మాత్రమే. అంతే కాకుండా ఆ అయిదేళ్ళ పాలనలో మొత్తంగా ఇచ్చిన పింఛన్లు 39 లక్షలు మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ల మీద నెలకు వ్యయం కేవలం రూ.400 కోట్లు మాత్రమే.
ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఇస్తున్న సామాజిక పింఛన్లు ఏకంగా 62 లక్షలు. అంటే 39 లక్షల నుంచి 62 లక్షలకు… ఏకంగా 23 లక్షలు పెరిగాయి. ఆ పెన్షన్ల కోసం చేస్తున్న ఖర్చు నెలకు రూ.400 కోట్ల నుంచి ఏకంగా రూ.1570 కోట్లకు పెరిగింది. అంటే నెలకు రూ.1170 కోట్లు. అంటే ఏడాదికి రూ.14,040 కోట్లు. టీడీపీ కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నందుకు చంద్రబాబుకు బాధగా ఉందా? లేక రామోజీరావుకు కడుపుమంటగా ఉందా?
ఇదే మీడియా అప్పుడు ఎందుకు చెప్పలేదు?:
ఉన్నది జన్మభూమి దోపిడీ వ్యవస్థే కదా? ఆ రోజుల్లో ఏం జరిగిందో ఇదే ఎల్లో మీడియా ఎందుకు చెప్పలేదు? పెన్షన్ కావాలంటే మూడు నెలల లంచం తీసుకున్నారని ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఎందుకు చెప్పలేదు? అప్పట్లో ప్రతి దానికీ లంచం అని ఎందుకు చెప్పలేదు? చంద్రబాబు హయాంలో నెలనెలా ఇచ్చిన పింఛన్ల శాతం ఎంత? నెల రోజుల్లో పోస్ట్ ఆఫీస్ ముందు మండుటెండలో పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు క్యూలు కట్టేవారని ఎందుకు చెప్పలేదు? వారిలో కొందరు అదే ఎండలో, అదే చలిలో, అదే వానలో అక్కడే… అదే క్యూలో చనిపోయిన విషయాన్ని ఇదే ఎల్లో మీడియా ఎందుకు చెప్పలేదు?
ఇంతా చేసి అప్పట్లో నెల రోజులు ఇచ్చినా, మొత్తం పెన్షనర్లలో ఇచ్చినది ఎంత శాతం మందికి? కేవలం 89 శాతం మాత్రమే కదా? మరి ఇప్పుడు.. మొదటి అయిదు రోజుల్లోనే ఇప్పుడు ఇస్తున్న పింఛన్ ఏకంగా 98 శాతం.
పదేపదే తిప్పించుకుని పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం ఎవరిది? ఇంటికి వెళ్ళి, గుడ్మాణింగ్ చెప్పి… నెలలో మొదటి రోజే, సూర్యోదయానికి ముందే పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం ఎవరిది?
గత ప్రభుత్వం దిగిపోవడానికి రెండు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ కేవలం రూ.1,000 అయితే, మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత మొదట ఇచ్చిన పెన్షన్ రూ.2,250. కాగా ఇప్పుడు ఇస్తున్నది రూ.2,500. దీన్ని రూ.3 వేల వరకు తీసుకు వెళతాం అన్న మాటను మన సీఎం అక్షరాలా అమలు చేస్తున్నారు.
మనందరి ప్రభుత్వం ఈ 35 నెలల పాలనలో, ఇంతటి కరోనా కష్ట కాలంలో కూడా, ఇలా పెన్షన్ల రూపంలో, ఒక సామాజిక బాధ్యతగా మీ ఇంటింటికీ వచ్చి ఇచ్చిన డబ్బు దాదాపు రూ.50 వేల కోట్లు.
అర్హతే ప్రామాణికం:
ఈ పెన్షన్లకు కోటాలు లేవు, కోతలు లేవు. ఎంత ఎక్కువమందికి ఎలా ఎగ్గొట్టాలా అన్న కుతంత్రాలు లేవు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలా అందించాలా అన్న బాధ్యతే ఇందులో ఉంది. కాబట్టే కులం చూడటం లేదు. మతం చూడటం లేదు. వర్గం చూడటం లేదు. ఆఖరికి రాజకీయ పార్టీ ఏదన్నది కూడా చూడటం లేదు. అర్హులందరికీ పింఛన్ ఇస్తున్నాం. అలాగే, లంచాలకు తావులేదు, వివక్షకు తావులేదు. మధ్య దళారీలకు, బ్రోకర్లకు చోటు లేదు. అయిన వారు, కానివారు అంటూ పక్షపాతం చూపిన జన్మభూమి కమిటీలు అసలే లేవు. అలాంటి కమిటీల ముందు అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు ఆత్మాభిమానాన్ని చంపుకుని మోకరిల్లాల్సిన పరిస్థితి అంత కంటే లేనే లేదు.
గుడ్ మార్నింగ్ చెప్పి మరీ:
ప్రతి నెలా కచ్చితంగా 1వ తేదీన, ఆరోజు ఆదివారం అయినా సరే, చాలా చోట్ల సూర్యోదయానికి ముందే… వలంటీర్లు ఇంటి తలుపు తట్టి, గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ అందజేస్తున్నారు.
ఎక్కడైనా పెన్షనర్లు అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే, వలంటీర్లు స్వయంగా అక్కడికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్నారు. దాదాపు 2.66 లక్షల గ్రామ, వార్డు వలంటీర్లు పెన్షన్ పంపిణీ యజ్ఞంలో పని చేస్తూ, ప్రతి నెలా 1వ తేదీనే 95 శాతం పెన్షన్లు అందజేస్తున్నారు.
దీన్ని జర్నలిజమ్ అంటారా?:
నిజాలు తెలుసుకుని తెలుగుదేశం పార్టీ మాట్లాడాలి. నిజాలు తెలుసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 మాట్లాడాలి. మీవాడు అధికారంలో లేడు కదా అని కడుపు మంటతో.. చివరికి సామాజిక పింఛన్లను కూడా వక్రీకరించి వార్తలు రాయటం అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం ఉంటుందా? ఇలాంటి రాతలు రాయటాన్ని జర్నలిజం అంటారా?
అందుకేనా కడుపు మంట?:
ఏకంగా రూ.1.5 లక్షల కోట్లు నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రజలకు చేరింది. ఏడుపంతా ఇదే కదా? ప్రజలకు నేరుగా అందుతోందన్న బాధే వీరందరిలో కనిపిస్తోంది. ఓటు వేయరన్న బాధ, తమ వాడు గెలవడన్న బాధ కనిపిస్తోంది తప్ప ఇందులో నిజాలు, జర్నలిజం ఏ కోశాన అయినా ఉన్నాయా? వాలంటీర్లకు సన్మానాలు చేస్తున్నందుకు, వారందరూ ప్రజలకు– ప్రభుత్వానికి వారధులుగా ఉన్నందుకు కడుపు మంటగా ఉందా అన్నదీ చెప్పాలి.
మరో విషయం కూడా..:
మొన్నటికి మెన్న అమ్మ ఒడి స్కీమ్‌లో అర్హతలు మార్చేశారని రాశారు. ఈ రోజు, మత్స్యకార భరోసా స్కీమ్‌లో అర్హతలు మార్చేశారని రాశారు. ఏ ఒక్క అర్హతలూ మార్చలేదు. పైగా, మొదట, నెలకు 200 యూనిట్ల లోపు వాడుకునే వారికే అమ్మ ఒడిని వర్తింప జేస్తే.. ఆ తర్వాత దాన్ని 300 యూనిట్లు చేసిన ప్రభుత్వం మనది. అది ఒక్కటే కాదు.. అనేక మినహాయింపులు ఇచ్చాం.
300 యూనిట్ల లోపు వాడుకునే వారికి అమ్మ ఒడి వర్తింపజేయటం అంటే దాని అర్థం.. రాష్ట్రంలో 300 యూనిట్ల లోపు వాడుకునే కుంటంబాలు మొత్తం కుటుంబాల్లో 95 శాతం. ఇంతమందికి అమ్మ ఒడి అర్హత లభించింది. అయినా దాన్ని కూడా వక్రీకరించి రాశారు.
అలాగే, మత్స్యకారుల కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా వివాహం చేసుకుని వేరే కాపురం పెడితే… వారికి కూడా ఈ స్కీములన్నీ వర్తిస్తాయి. వేరే రేషన్ కార్డు వస్తుంది… వారి కుటుంబానికి కూడా పథకాలన్నీ వర్తిస్తాయి.
మత్య్సకారులకు, బీసీలకు ఏనాడూ ఏమీ చేయని చంద్రబాబును సమర్థించి.. ఇలాంటి మంచి స్కీముల్ని విమర్శించటం అంటే దీన్ని జర్నలిజం అంటారా? లేక అధికార పిచ్చి, కుల పిచ్చి అంటారా?.. దీన్ని ప్రజలంతా ఆలోచించాలని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు విజ్ఞప్తి చేశారు.