– రైల్వేస్టేషన్ ఆవరణల్లో నిఘా పెంచాలి
– రేపల్లె రైల్వేస్టేషన్ ఘటనపై ‘మహిళా కమిషన్’ సీరియస్
– భద్రత, రక్షణ చర్యల నివేదికకు ‘వాసిరెడ్డి పద్మ’ ఆదేశాలు
అమరావతి: రేపల్లె రైల్వేస్టేషన్ లో వలసకూలి దంపతులపై దాడి, అత్యాచారం ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఆదివారం ఉదయం ఘటన సమాచారం తెలియగానే మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు.
బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు. ముగ్గురు బిడ్డలు, భర్తతో పాటు రైల్వేస్టేషన్ ఆవరణలో నిద్రిస్తున్న గర్భిణీ పై పాశవిక దాడికి పాల్పడిన మృగాళ్లను తక్షణమే అరెస్టు చేయాలన్నారు. కేసు దర్యాప్తును శరవేగంగా పూర్తిచేసి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని వాసిరెడ్డి పద్మ కోరారు. రైల్వేస్టేషన్ లలో మహిళల భద్రత, రక్షణ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రైల్వేశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రభుత్వరంగ వ్యవస్థల ఆవరణల్లో ఇలాంటి దుర్మార్గాలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు.
అత్యాచార బాధితురాలిని మహిళా కమిషన్ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. బాధితురాలి ఆరోగ్య చికిత్సకు సంబంధించి స్థానిక ఒన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి సూచనలిచ్చారు. ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారని.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.