– మేధా పాట్కర్ ను అడిగితే అమరావతి ఎవరి రాజధానో తెలుస్తుంది
– అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పింది బాబు కాదా?
– బాబు ల్యాండ్ పూలింగ్ ను గతంలో ప్రొఫెసర్ హరగోపాల్ వ్యతిరేకించారు
– అమరావతి రాజధాని శంఖుస్థాపనకు ప్రధాని మోడీ వస్తే.. దళిత వర్గానికి చెందిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ను ఆహ్వానించలేదు
– అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే జగన్ గారి ఆకాంక్ష.. ఒక్క అమరావతే ఉండాలన్నది బాబు కాంక్ష
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ సూటి ప్రశ్న
ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
వాస్తవాలు తెలుసుకుని వస్తే బాగుండేది..
అమరావతి రైతుల ముసుగులో కొంతమంది చంద్రబాబు బినామీలు చేస్తున్న దీక్షలు 900 రోజులు పూర్తయిన సందర్భంగా.. ప్రొఫెసర్లు కోదండరామ్ , హరగోపాల్ , మరికొంతమంది నాయకులు ఇవాళ వచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన ల్యాండ్ పూలింగ్ను ఇదే హరగోపాల్ వ్యతిరేకించారు. వీళ్లంతా పిలవగానే పేరంటానికి వచ్చినట్లు వచ్చేశారు. మనం ఎందుకోసం వెళతున్నాం, ఎవరి హక్కులు రక్షించడానికి వెళుతున్నాం? వెళ్లాల్సిన అవసరం ఎంత.. అన్నది ఆలోచించకుండానే, అమరావతి రైతుల పేరుతో వీళ్లని ఆహ్వానించగానే వాస్తవాలు తెలుసుకోకుండా వచ్చినట్టు ఉన్నారు.
అమరావతి పేరుతో జరుగున్న బినామీల ఉద్యమం 900 రోజుల కార్యక్రమానికి వచ్చినవాళ్లు పేరంటానికి వచ్చినట్లు వచ్చి వాయినం తీసుకుని వెళ్లిపోయినట్లు ఉంది. ఇక్కడ జరుగుతున్న అమరావతి కార్యక్రమంలో పాల్గొని, వీళ్ళు చంద్రబాబు నాయుడు బినామీ భూముల రాజధానికి మద్దతు పలికినట్లు ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇక్కడ రైతుల కు నష్టం జరిగిందని చెబుతున్నారు. రైతులకు ఎక్కడా నష్టం జరగలేదు. నష్టం జరిగింది రైతులకు కాదు… చంద్రబాబుకు, ఆయన బినామీలకు మాత్రమే నష్టం జరిగింది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు అనుయాయులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు దోచుకుతినడానికి చేసిన ప్రయత్నాలకు కట్టడి పడింది.
అందులో భాగమే తప్ప ఇక్కడ అమరావతి రైతులను ఇబ్బంది పెట్టింది కానీ, ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందనేది ఏమీలేదు. వాస్తవానికి చంద్రబాబు వల్లే అమరావతి రైతులకు నష్టం జరిగింది. మూడు పంటలు పండే పచ్చని పొలాలను అమరావతి పేరుతో చంద్రబాబు సర్వ నాశనం చేశాడు. అమరావతి రైతులకు న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు.
పేదలకు డబ్బులిస్తే సోమరులు అవుతారన్న బాబుకు మీ మద్దతా..?
అమరావతి కార్యక్రమానికి వచ్చినవారి మాటలు విచిత్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి న్యాయం చేయాలనే ధృడ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగన్‌గారు కనిపిస్తూ ఉన్నారు. బడుగు, బలహీన, పేద వర్గాల లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే డీబీటీ ద్వారా నగదు జమ చేస్తూ ఉంటే.. పేదలకు డబ్బులు ఇస్తే, వాళ్లంతా సోమరులు అవుతారని మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడుకు మేధావులు మద్దతిస్తారా..? గత మూడేళ్ళలో జగన్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు 1 లక్షా 41 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో, ఒక్క రూపాయి అవినీతి లేకుండా జమ చేశారు. ఇది తప్పా అని ఆ మేధావులను కూడా ప్రశ్నిస్తున్నాం.
మా దళిత, బీసీ వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం ఇష్టంలేని చంద్రబాబు నాయుడు జరిపే అమరావతి కార్యక్రమాలకు వీళ్లంతా ఆహ్వానితులు ఎలా అయ్యారు…? రాజధాని అంటే అమరావతి ఒక్కటే అనుకునే చంద్రబాబు, ఈ ప్రాంతంలో బడుగు, బలహీన, బీసీ వర్గాలకు 53వేల ఇళ్ల ప్లాట్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ గారు నిర్ణయిస్తే… అలా ఇస్తే ఈ ప్రాంతంలో డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని కోర్టుల్లో కేసులు వేయించింది మీకు గుర్తుకు రాలేదా.. ? . అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే, అక్కడ సామాజిక విలువపడిపోయి, మురికికూపంగా మారిపోతుందని వీళ్లంతా న్యాయస్థానాలను ఆశ్రయించింది మీకు తెలియదా..? చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏం చేశారు? వారికి ఏమి అభివృద్ధి చేశారు. అమరావతిలో మా వర్గాల వాటా ఎక్కడ.. ?, అంటే మేం మనుషులం కాదా..?
మేధా పాట్కర్ ని అడిగితే బాబు దోపిడీ తెలుస్తుంది
2015లోనే అమరావతిని డిక్లేర్ చేసిన చంద్రబాబు పట్టుమని నాలుగు బిల్డింగ్లు కట్టి, వర్షానికి కారిపోయే తాత్కాలిక అసెంబ్లీ, సెక్రటేరియేట్ ని కట్టి … ప్రపంచ రాజధానిని కడుతున్నాడంటూ ఇంకా మభ్యపెట్టే విధానం చూస్తుంటే సిగ్గనిపిస్తోంది. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు బినామీ భూములకు రాజధాని అని అందరికీ తెలుసు. టీడీపీ హయాంలో అమరావతి ప్రాంతంలో రైతులకు జరిగిన అవమానాలు, ఇబ్బందులు, బాధలు అందరికీ తెలియలంటే హరగోపాల్ అయినా, కోదండరామ్ అయినా ఢిల్లీ వెళ్లి, అప్పట్లో చంద్రబాబు దోపిడీని ప్రశ్నించిన సామాజిక ఉద్యమ కారిణి మేధా పాట్కర్‌ను అడిగితే చెబుతారు. అప్పట్లో చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలపై మీడియాతో మేధా పాట్కర్ మాట్లాడారు. చంద్రబాబు ఎలాంటి రాజధానిని కడుతున్నాడు? ఎవరి కోసం రాజధానిని చేయాలనుకున్నాడు అనేదానిపై వీళ్లంతా ఒకసారి పరిశీలిస్తే మంచిది. తన సామాజిక వర్గానికో, తన పార్టీ నాయకులకో లాభపడేవిధంగా అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబు చేయాలనుకున్నారు.
అమరావతి ప్రాంతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల భూములను బలవంతంగా లాక్కుని, అసైన్డ్ భూముల విషయంలో బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు నాయుడు ఎన్ని దుర్మార్గాలు చేశారనేది మేధా పాట్కర్‌ను అడిగితే చెబుతారు. చంద్రబాబు ఏ రాజధానికి కావాలని కోరుకున్నారో ఆమెను అడిగితే చెబుతారు. వీళ్లంతా మరి అప్పుడేమయ్యారు?
అమరావతిని అభివృద్ధి చేయమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా చెప్పలేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. మా ప్రభుత్వ, మా పార్టీ విధానం అది. నాడు చంద్రబాబు నాయుడుకు ఏవైతే హక్కులున్నాయో, నేడు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి కూడా అవే హక్కులు ఉంటాయి. చంద్రబాబు ఒక చోటే, అది కూడా 29 గ్రామాలకు చెందిన ఒకే ప్రాంతం, అమరావతిలోనే ఉండాలని కోరుకున్నారు. అదే జగన్ రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని మూడు రాజధానుల విధానాన్ని ప్రకటించారు. ఏది బెటర్, ఏది మంచి ఆలోచనో మేధావులంతా గమనించాలి.
అది బాబు బినామీలు, బిజినెస్ మెన్ ల ఉద్యమం
అమరావతిలో 53వేల ఎకరాల భూములను రైతుల దగ్గర నుంచి తీసుకుని, చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అమరావతి రైతుల ముసుగులో బినామీలు, బిల్డర్లు, బిజినెస్మెస్లు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. చంద్రబాబు అనుకునే రాజధాని ప్రాంతంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల వాటా ఎంత? మాకేమిచ్చారు? చంద్రబాబు తన హయాంలో మమ్మల్ని ఎక్కడ గుర్తుపెట్టుకున్నారు? మా ఆర్తనాదాలు ఏరోజైనా విన్నారా?
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా జరుగుతోంది. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని, అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అయితే గతంలో మాదిరిగా, మళ్ళీ ఇబ్బంది అవుతుందని భావించారు. మనకు ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పరిపాలనా రాజధానిగా విశాఖను ఎంచుకుంటే ఖర్చు, అన్ని వేల కోట్లు రాజధాని మీద పెట్టే అవసరం ఉండదని భావించారు. అంతేకానీ అమరావతి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడమో, ఈ ప్రాంత అభివృద్ధిని చేయమని మేము ఎక్కడా చెప్ప లేదు కదా?
పేదలకు అన్యాయం జరిగితే వామపక్ష పార్టీలు అండగా నిలబడేవని గతంలో చెప్పుకునేవాళ్లు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. చంద్రబాబుకు ఏ ఇబ్బంది రాకుండా అండగా ఉండేందుకు ఈరోజు వీళ్లంతా సిద్ధపడ్డారు. వీళ్లంతా ప్రజలకు ఏం చెప్పదలచుకున్నారు? చంద్రబాబు ఊహించినట్టుగా, తన బినామీల రాజధానిని మీరు కోరుకుంటున్నారా? లేక ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నారా?
చంద్రబాబుకు ఒక్క అమరావతి ప్రాంతమే ముఖ్యమా? మిగతా ప్రాంతాల అభివృద్ధి పట్టదా? రానున్న రోజుల్లో ఆవిధంగానే ప్రజలను ఓట్లు అడుగుతారా? అమరావతి ఉద్యమం అంటూ టెంట్లో జరిగే తంతు చూస్తే 200 రోజులు, 300 రోజులు, 400రోజులు, 500 రోజులు అంటూ నలుగురిని కూర్చోపెట్టి దానికి ఫ్లెక్సీలు కట్టి మీడియా కెమెరాల కార్యక్రమాలు చేస్తున్నారు.
అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని వాళ్లు చేసే కుయుక్తులు చూస్తుంటే.. ఇక్కడ తమ ఆస్తులు నష్టపోకూడదు. మరింతగా లాభాలు రావాలి. ఒక రూపాయి భూమి వంద రూపాయిలుగా పెరిగిపోవాలన్నదే వీరి ఆశ. మా ప్రభుత్వంలో అమరావతి రైతులకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అనేదానిపై మాట్లాడండి. అంతేకానీ వంద రూపాయలు వచ్చినా, కోటిరూపాయిలు వచ్చినా అది మేమొక్కళ్ళమే తినాలి అనే చంద్రబాబు మాటలనే మీరు కూడా చెప్పదలచుకున్నారా?
చంద్రబాబుకు ప్రజలు ఓట్లు వేయరు, ఆయనను తిరిగి గెలిపించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, తన బదులు వివిధ రూపాల్లో కొంతమందిని ప్రజల ముందుకు పంపిస్తున్నాడు. వారు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాం.
దళిత ఎమ్మెల్యేకు అమరావతి వేదికమీద బాబు చోటే ఇవ్వలేదు
ఈ ప్రాంతంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అత్యధికంగా ఉన్నాం. మా గురించి చంద్రబాబు ఎన్నడూ మాట్లాడింది లేదు. రాజధాని శంకుస్థాపన సందర్భంగా, అప్పటి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో దళితులను రానివ్వకుండా బారికేడ్లు కట్టిసి, మమ్మల్ని ఎవరినీ లోనికి రానివ్వకుండా బయట నిలబెట్టి, చంద్రబాబు తన సామాజిక వర్గానికి మాత్రం పట్టుబట్టలు పెట్టి, బొట్టు పెట్టి పిలిపించాడు. మమ్మల్ని కనీసం పలకరించినవాళ్లు కూడా లేరు. ఊళ్లో డప్పు వేయించి మీ భూములు పూలింగ్‌కు ఇవ్వాలని చెప్పించారు. అదే మిగతావాళ్ల భూముల కోసం అప్పటి మంత్రులుగా ఉన్నవారు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలు… పట్టువస్త్రాలు తీసుకువెళ్లి, బొట్టు పెట్టి మీ భూముల మాకివ్వాలంటూ బతిమిలాడి, మభ్యపెట్టి, భయపెట్టి తీసుకున్నారు. ఇదే విషయాన్ని కోదండరామ్ మాట్లాడుతూ… రైతులు తమ భూములను ఇష్టపడి ఇచ్చారో, కష్టపడి ఇచ్చారో తరువాత సంగతి అన్నారు. రైతులు తమ భూములను ఇష్టపడి ఇవ్వలేదనేది కోదండరామ్‌కు అర్థమైంది కదా?. ఇచ్చిన రైతులను ఎలా పిలిచారు? అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన రైతులను ఎలా పిలిచారు? అసలు పిలిచారా? మేమంటే ఎందుకంత కడుపుమంట? ఇవన్నీ మీకు గుర్తుకురాలేదా?
అంతెందుకు, అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి .. టీడీపీకి చెందిన స్థానిక దళిత ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్‌ను ఆ వేదిక మీదకే ఆహ్వానించలేదు. రాజధాని నిర్ణయానికి వేసిన కమిటీలో మురళీమోహన్, ప్రతిపాటి పుల్లారావు, నారాయణ లాంటి వ్యాపారస్తులే ఉన్నారు తప్ప, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పేరు కూడా ఆ జాబితాలో లేదు.
ఇదంతా చంద్రబాబు నాయుడు, తన బినామీల కోసం నలుగురైదుగురు రైతులను అడ్డం పెట్టుకుని ఆడుతున్న గేమ్ తప్ప మరొకటి లేదు. అమరావతి ప్రాంతాన్ని, రైతులను ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. మూడు ప్రాంతాల అభివృద్ధి జరిగితే రాష్ట్రం అంతా బాగుటుందని హరగోపాల్, కోదండరామ్ లతో పాటు వాళ్లతో పాటు వచ్చిన సహచరులు గమనిస్తే మంచిది. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఉన్నపళంగా జగన్ మోహన్ రెడ్డి ని సీఎం పదవి నుంచి దించేసి, చంద్రబాబు నాయుడును అధికారంలో కూర్చోబెట్టే వరకూ ఇలాంటి బినామీ ఉద్యమాలు చేయిస్తూనే ఉంటాడు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి.
అమరావతిని నాశనం చేసి, మూడు పంటలు పండే పచ్చని పొలాల ఉసురు పోసుకున్నందుకే చంద్రబాబుకు ఈ ఖర్మ పట్టింది. అందుకే గత ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్లు కూడా గల్లంతు అయ్యాయి. భవిష్యత్‌లో అంతకంటే దీనమైన పరిస్థితి చంద్రబాబుకు వస్తుంది.