– శ్రీవారి సేవ టీమ్ లీడర్లకు టీటీడీ పిఆర్వో డాక్టర్ రవి పిలుపు
వెంకటపాలెం లో జూన్ 4 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భక్తి, శ్రద్ధ, ఓపికతో సేవలు అందించాలని టీటీడీ ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి రవి శ్రీవారి సేవకులకు పిలుపునిచ్చారు.
విజయవాడలోని టీటీడీ కళ్యాణ మండపంలో శనివారం విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం, మంగళగిరి, చీరాల, వెంకటాపురం పరిసర ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవ బృందాల సమన్వయ కర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ, జూన్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. 9వ తేదీ వేలాది మంది భక్తులు తరలి వస్తారని ఆయన తెలిపారు. వీరందరికీ ఇబ్బంది కలగకుండా తాగునీరు, ఆహారం అందించడం, క్యూ లైన్ల నిర్వహణ లాంటి సేవలు అందించాల్సి ఉంటుందని చెప్పారు.
డిప్యూటీ ఈవో శ్రీ గుణ భూషణ్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులు సాక్షాత్తూ స్వామివారికి సేవ చేసినట్లేనన్నారు. అనంతరం వీరు శ్రీవారి ఆలయంలో క్యూల నిర్వహణ, ప్రవచన వేదిక, అన్న ప్రసాదాల పంపిణీ కౌంటర్లు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ అర్చకులు, టీటీడీ ఓఎస్డీ లు శ్రీధర్, శ్రీ నగేష్, కళ్యాణ మండపం మేనేజర్ శోభారాణి పాల్గొన్నారు.