– కరెంటు వైర్లను ఉడతలు కొరికేశాయష..
– అందుకే అంతమంది సజీవదహనమయ్యారష..
( మార్తి సుబ్రహ్మణ్యం)
గిరీశం చచ్చి ఎక్కడున్నాడో గానీ.. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అన్నది నిజమేనండోయ్. ఎప్పుడో దశాబ్దాల క్రితం గిరీశం బాబాయ్ చెప్పిన కాలజ్ఞానం, ఇప్పుడు జగనన్నాయ్ కాలంలో నిజమవుతోంది. బ్లాక్ అండ్ వైట్ కాలంలో బ్రహ్మం గారొక్కరే కాలజ్ఞానం చెబితే, ఈస్ట్‌మన్ కలర్ కాలంలో గిరీశం కాలజ్ఞానం చెప్పారంతే! కాకపోతే కాస్త అటు, ఇటూగా. అంటే బెమ్మంగారు కడప జిల్లా ఆయనయితే, గిరీశం గోదావరాయన. అంతే తేడా!! మిగిలినదంతా షేమ్ టు షేమ్!!!
అవును మరి…
ఎంత కలికాలం… వర్షాకాలం.. ఎండలకాలం.. చలికాలం కాకపోతే…
మద్యం నిల్వల్లో తేడాలొచ్చాయి. ఎందుకంటే వాటిని ఎలుకలు తాగేశాయట.
నెల్లూరు కోర్టులో ఐరన్ కొట్టేద్దామనుకున్న దొంగలను కుక్కలు మొరిగి, తరిమితే.. దొంగలకు మంత్రి కాకాణి గారి ఫైల్స్ మాత్రమే దొరికాయట దాని దుంప తెగ!
లేటెస్టుగా ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లిలో…హైటెన్షన్ వైరును ఉడత కొరకడంతో అది, తెగి ఆటోలో కూర్చున్న ఐదుగురు సజీవదహనమయిపోయారు.
యెహ.. నవ్వమాకండసె. ఇదంతా నిజంగా నిఝం. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో గత మూడేళ్లుగా విజయవంతంగా జరుగుతున్న అపురూప, అనన్యసామాన్యం, అనితర సాధ్యమైన అద్భుతాలివి. యస్. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ జగనన్నాయ్ జమానాలో జోరుగా జరిగిపోతున్నాయ్. బెమ్మం గారు అప్పుడెప్పుడో మఠంలో కూర్చుని చెప్పినవన్నీ ఠప ఠప జరుగుతున్నాయంటే… నువ్వు ఉన్నావు సామీ. ఉన్నావ్!
నిజమే…
అంతర్వేదిలో తేనెతీగలు రథం తగులపెట్టగా లేనిది..
పెపంచకంలోనే ఏపీ నాణ్యమైన మందును మాయదారి ఎలుకలు లీటర్లకు లీటర్లు తాగంగా లేనిది..
ఐరన్ కోసం కోర్టుకు కన్నం వేసిన దొంగలు, దానికోసం వెళితే కుక్కలు తరిమితే మంత్రి కాకాణి గారి కేసు ఫైల్స్ ఎత్తుకెళ్లినప్పుడు..
ఏపీఎస్పీడీసీఎల్ ఎండీ హరనాధ్జీ చెప్పినట్లు.. హైటెన్షన్ వైర్లను ఉడతలు కొరికేయడంలో తప్పేంటీ…
అహ తప్పేంటంట? కాదు… లేదు. ముద్దుముద్దగా మాట్లాడే మంచులక్ష్మి అక్కాయ్ మాటల్లో చెప్పాలంటే .. ఎన్నో.. ఎన్నెన్నో.. మరెన్నో… వింతలు, విడ్డూరాలకు కేంద్రమైన ఆంధ్రాలో ఇవి ఇలా జరిగిపోతుండటం మామూలే. ఇవన్నీ బయట రాష్ట్రాల వారికే విచిత్రంగా కనిపించినందునపొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు గానీ, ఆంధ్రావాళ్లకు చాలా కామనేనట. కాబట్టి ఎక్కువగా నోరు తెరవమాకండి. దోమలు, ఈగలూ గట్రాలు పోతాయ్. ఆయ్.
అయితే..
హైటెన్షన్ వైర్ 11 లేదా 33 కెవి ఉంటుంది. అసలు హైటెన్షన్ వైర్లకు 2 సెంటీమీటర్ల దూరంలో ఉంటేనే మాడిమసయిపోతారు. పైగా అది మెటల్‌తో ఉంటుంది. కాబట్టి అది కండక్టర్‌ను కొరకలేదు. బహుశా క్రాసారాన్ని షార్టు చేసి ఉండాలట. నిజానికి ఆ వైర్లు తెగిపోయిన స్టాండ్సు ముందే దెబ్బతిని ఉండవచ్చట. దాన్ని చూడకపోవడం కరెంటోళ్ల తప్పట. ఆ క్రాసారాన్ని ఉడత తెంపడం వల్ల షార్టు చేసి ఉండవచ్చన్నది ఎలక్ట్రికల్ ఇంజనీర్ల అంచనా. ఇవన్నీ… ఒకవేళ నిజంగా ఉడతే తెంపడం వల్లయితేనే సుమా?! అసలు.. ఆ హైటెన్షన్ వైర్ ముందే బలహీనంగా ఉందన్నది మరో వాదన. వాటిని లైన్మెన్లు, లైన్ ఇనస్పెక్టరు, ఏఈ, చివరాఖరకు ఏడీఈ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలట.
ఏమోలెండి.. ఆఫ్టరాల్ ఒక ఉడత మీద ఇన్ని యక్షప్రశ్నలు, రంద్రాన్వేషణలూ, ఎదవ ఇన్‌వెస్టిగేషను మనకెందుకు? టైమ్వేస్టు. ఎనర్జీ బొక్క. ఆల్రెడీ ఎండీ హరినాధన్న, ఉడతల వల్లే వాళ్లంతా చనిపోయారని చెప్పారు కాబట్టి.. అంతలావు పెద్దాయన చెప్పిన తర్వాత కూడా, ఇంకా డౌటనుమానాలెందుకు చెప్పండి. ఈ ఘటన తెలిసిన తర్వాత ఎక్కడో ఫ్రాన్సులో ఉన్న జగనన్నాయ్ కలత చెంది, మనిషికి పది లచ్చల రూపాయల నష్టపరిహారం ప్రకటించినందుకు సంతోషించాలి. అంతేగా… అంతేగా!