అమరావతి,: నల్ల బెల్లంతో నిబంధనలకు విరుద్ధంగా నాటు సారా తయారు చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. నాటుసారా తాగి మరణిస్తే సంబంధిత వ్యక్తులే ఆ పర్యవసానాలు అనుభవిస్తారని వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. జప్తు చేసిన నల్ల బెల్లాన్ని తక్షణం విడుదల చేయాలని అధికారులకు తేల్చిచెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్‌సఎస్ సోమయాజులు గురువారం ఆదేశాలిచ్చారు. తనకు చెందిన 25,250 కేజీల నల్ల బెల్లాన్ని పశ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం ఎస్ఈబీ అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ వ్యాపారి వాసిరెడ్డి గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్ జడ్జి నల్లబెల్లం నిల్వ చేయడం, రవాణా చేయడం నేరంగా పరిగణించడానికి వీల్లేదని పేర్కొన్నారు.
వ్యాపారి నుంచి జప్తు చేసిన 25,250 కేజీల నల్లబెల్లాన్ని విడుదల చేయాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎ్‌సఈబీ) అధికారులను ఆదేశించారు. బెల్లం విలువ మేరకు పూచికత్తు సమర్పించాలని పిటిషనర్‌కు స్పష్టం చేశారు. ఎక్సైజ్ తరఫున ప్రభుత్వ న్యాయవాది టి.కిరణ్ చేసిన వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.