– క్యాసినో పై సజ్జల ఎందుకు నోరు మెదపటం లేదు?
– గుడివాడ క్యాసినోపై నాడే చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ పరిస్దితి ఉండేదా?
నేపాల్ లో క్యాసినో నిర్వహించిన హోటల్ లో ఇంకా 27 రూములు లాక్ చేసి ఉన్నాయి
– ఆ రూముల్లో ఏం ఉన్నాయో వాటిలో ఎవరు బస చేశారో ఈడీ తేల్చాలి
-సీబీఐ, ఎన్.ఐ.ఏ అధికారులతో కలిపి కేంద్రం సిట్ ఏర్పాటు చేయాలి
-నేపాల్ క్యాసినోకి వెళ్లిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఆధారాలతో సహా త్వరలో బయటపెడతా
– సవాంగ్ తన ఆఫీసులో జగన్ ది కాకుండా నా ఫొటో పెట్టుకోవాలి
-క్యాసినో దేశ ఆర్దిక వ్యవస్ధకు పెనుముప్పు
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులువర్ల రామయ్య
క్యాసినో దేశ ఆర్దిక వ్యవస్ధకు పెను ముప్పుగా మారిందని, దీనిపై కేంద్రం సిట్ వేసి సమగ్ర విచారణ జరపాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ…. చికోటి ప్రవీణ్ నేపాల్, శ్రీలంక, ఇండియా, థాయ్ లాండ్, మరికొన్ని దేశాల్లో బిగ్ డాడీ పేరుతో క్యాసినో నడుపుతున్నాడు. ఇతనికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలతో పాటు వైసీపీ పెద్దలకు సన్నిహిత సంబందాలున్నాయి. ఈ క్యాసినో దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా మారింది. క్యాసినో ముసుగులో రాజకీయ నేతలు తమ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారు.
రాష్ట్రంలోని అధికార పార్టీ పెద్దలు ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాల ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును క్యాసినో ముసుగులో నేపాల్ తరలించి అక్కడ నుంచి లావోస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చి ఇండియాకి తరలిస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రక్రియే ఈ క్యాసినో. రాష్ట్ర పెద్దలకు తెలిసే గుడివాడలో క్యాసినో జరిగింది. బూతుల మంత్రి నిర్వహించిన క్యాసినో వల్ల అనేక కుటుంబాలు నాశనమయ్యాయి. కేరళ, తెలంగాణ, మహారాష్ట, కలకత్తా, ఇంకా అనేక ప్రాంతాల ప్రజలు గుడివాడ క్యాసినోలో కోట్లాది రూపాయలు పోగొట్టుకుని రోడ్డునపడ్డారు.
అయినప్పటికి ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దీనిపై టీడీపీ నిజనిర్ఱారణ కమీటీ గవర్నర్ కి నివేదిక అందించినా చర్యలు శూన్యం. అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ కి ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆయన కనీసం మా ముఖాలు చూడ్డానికి కూడా ఇష్టం లేనట్టు వ్యవహరించారు. రోడ్డుపై నిలబెట్టి రిపోర్టు తీసుకున్నాడు. వైసీపీ తొత్తుగా వ్యవహరించి నేడు ఫలితం అనుభవిస్తున్నాడు. నా వల్ల ఆయనకు సర్వీస్ కమిషన్ పోస్టు వచ్చింది. సవాంగ్ తన ఆఫీసులో వెనుక భాగాన జగన్ ది కాకుండా నా ఫొటో పెట్టుకోవాలి.
గుడివాడ క్యాసినోపై నిజాలు నిగ్గు తేల్చేందుకు మేం వెళ్తున్నామని తెలిసి ఏలూరు డీఐజీ పక్క జిల్లాకు పారిపోయారు. ఎస్పీ.. డీఎస్పీ సత్యానందను అనుమానించి శెలవుల్లోకి పంపారు. గుడివాడ క్యాసినో కోసం గోవా నుంచి అమ్మాయిలను తీసుకొచ్చారని, వారి ఫ్లైట్ టికెట్ తో సహా మేం ఆధారాలు సమర్పించాం. ఏ కారులో వచ్చారో, ఏ హోటల్ దిగారో అన్నీ ఆరోజే వివరించాం. రాష్ట్ర ప్రభుత్వం గుడివాడ క్యాసినోపై నాడే చర్యలు తీసుకుని ఉంటే, నేడు ఈ క్యాసినో దేశ ఆర్దిక వ్యవస్దకు పెనుముప్పుగా మారేది కాదు. ఇందులో వైసీపీ పెద్దలకు వాటా ఉంది కాబట్టే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదా?
నేపాల్ లో క్యాసినో నిర్వహణకు ప్రత్యేకంగా హోటల్ మ్యాచీ క్రౌన్స్ (HMC) ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఎవరూ కష్టమర్స్ రారు. హోటల్ బిజినెస్ జరగదు. కేవలం క్యాసినో నిర్వహించడానికే ఈ హోటల్ పెట్టారు. దీనిలోకి రాజకీయ పెద్దలు, సినిమా పెద్దలు వస్తారు. చికోటి ప్రవీణ్ చెప్పినవారికి మాత్రమే రూమ్స్ ఇస్తారు. ఈ హోటల్ లో ఇంకా 27 రూములు లాక్ చేసి ఉన్నాయి. ఆ రూముల్లో ఏమున్నాయో? ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు విజిట్ చేయాల్సిన బాధ్యత లేదా? ఈ హోటల్ ను సీజ్ చేయాల్సిన బాధ్యత లేదా? నేపాల్ మన ఫ్రెండ్లీ కంట్రీ. వారి సహాయం తీసుకొని విచారణ జరిపాలి. అందులో ఎవరికి సంబంధించిన డబ్బు, ఆస్తి ఉందో తేలాలి. ఈడీ అధికారులు ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. నేపాల్ వెళ్లి రంగంలోకి దిగితే బండారం బయటపడుతుంది.
నేపాల్ ప్రజలకు క్యాసినో ఆడటాన్ని ఆ దేశం నిషేధించింది. ముఖ్యంగా ఏపీ ప్రజల కోసమే చికోటి ప్రవీణ్ ఈ క్యాసినో భవనాన్ని నడుపుతున్నాడు. మన అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఇందులో భాగస్వాములుగా లేరని చెప్పగలరా? చికోటి ప్రవీణ్ ఎవరో మాకు తెలియదని అధికార పార్టీ నాయకులు, కొడాలి నాని, వల్లభనేని వంశీ చెప్పగలరా? వీరిద్దరు చికోటి ప్రవీణ్ తో కలిసి అనేకసార్లు నేపాల్ వెళ్లారు. వంశీ నా క్లోజ్ ప్రెండ్ అని చికోటి ప్రవీణ్ ఓ ఇంటర్యూలో చెప్పారు. నేపాల్ లో జరిగిన క్యాసినోకి ఏపీ కేబినెట్ లో సగం మంది, వైసీపీ ఎమ్యెల్యేలు 22 మంది వెళ్లారని మాకు సమాచారం అందింది. దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు? జూలై 10, 11, 12, 13 తేదీల్లో మీ మంత్రుల ఐరీస్ బయో మెట్రిక్ తీయండి. చికోటి ప్రవీణ్ తోక పట్టుకొని నేపాల్ కి ఎవరెవరు వెళ్లారో తెలియాలి.
వల్లభనేనీ వంశీ, మాజీ బూతుల మంత్రితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే తనకు కోవిడ్ అని నియోజకవర్గ ప్రజలకు చెప్పి నేపాల్ క్యాసినోకి చెక్కేసింది నిజమా కాదా? ఎవరెవరు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారో తెలియాలి. ఇన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా? సీబీఐ, ఎన్ఐఏ అధికారులతో కలిపి నేషనల్ సెక్కూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవెల్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలి. ఈ సిట్ లో గుడివాడ క్యాసినోని కూడా చేర్చాలని ప్రధానిమంత్రి, కేంద్ర హోం మంత్రిని కోరుతున్నాను. చికోటి ప్రవీణ్ ఫాంహౌస్ లో జరిగిన అతని బర్త్ డే వేడుకలకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతమంది హాజరయ్యారో సీఎం తెలపాలి. ముఖ్యమంత్రి ప్రమేయంతో వెళ్లారా అనేది కూడా తేలాలి. దీనిపై ఇంటలిజెన్స్ రిపోర్టు బయటపెట్టాలి. మీరు ప్రజా ప్రతినిధులా? చీకటి సామ్రాజ్యానికి అధిపతులా?
చికోటి ప్రవీణ్ భాగోతం బయటికి వచ్చాక చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేల, పెద్దల పిల్లలు విదేశాలకు వెళ్లిపోయారు. ఎందుకో తేలాల్సివుంది. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరగాలి. ఈనెల 17 నుంచి శ్రీలంకలో జరిగిన క్యాసినోపై కూడా దర్యాప్తు జరపాలి. ఇంత జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోంది? సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? స్టేట్ ఇంటలిజెన్స్ ఏం చేస్తోంది? నేపాల్ క్యాసినో తో పాటు గుడివాడ క్యాసినో పై కూడా సమగ్ర విచారణ జరపాలని కేంద్రాన్ని కోరుతున్నాం. నేపాల్ క్యాసినో పై నిజనిర్దారణ కమిటీ వేయాలని టీడీపీ నేతలం చంద్రబాబు నాయుడ్ని కోరుతాం.
సగం మంది కేబినేట్ సభ్యులు చికోటి ప్రవీణ్ చుట్టూ తిరుగుతుంటే రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం జరిగే అవకాశాలు లేవు. చీకటి సామ్రాజ్యంలో అనేక కుటుంబాలు నాశనమైపోతున్నాయి. రాష్ట్రంలో తెలుగు మహిళల పుస్తెలు తెగి మంటల్లో కాలిపోతున్నాయి. ఇదంతా దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా తయారయింది. పన్నుల రూపేణ వచ్చే జీఎస్టీ ఆగిపోతోంది. రూపాయి పన్ను లేకుండా కోట్లాది రూపాయలు వైసీపీ నేతల అకౌంట్లలోకి వస్తున్నాయి. దీనిపై ఆర్బీఐ ఉలిక్కిపడింది. ప్రతి దానికి మీడియా ముందుకి వచ్చి తన మిడి మిడి జ్ఞానం ప్రదర్శించే సజ్జల క్యాసినో పై ఎందుకు నోరు మెదపటం లేదు? ఇందులో సజ్జల వాటా ఎంత? నేపాల్ వెళ్లిన వైసీపీ నేతల పేర్లు ఆధారాలు త్వరలో బయటపెడతా, దీనిపై ఈడీ సమగ్ర విచారణ జరపాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
( నోట్ ) వల్లభనేని వంశీ తనకు మంచి మిత్రుడంటూ చికోటి ప్రవీణ్ ఓ ఇంటర్యూలో చెప్పిన వీడియో,
నేపాల్ లో క్యాసినో జరిగిన హోటల్ మ్యాచీ క్రౌన్ పోటోలు మీడియా సమావేశంలో వర్ల రామయ్య ప్రదర్శించారు.