ఎంపీ విజయసాయి రెడ్డి
అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా గురువారం పలు అంశాలు వెల్లడించారు. అభివృద్ధి, పాలనా కేంద్రీకరణతో ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. ఇప్పటికైనా అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం జరగాలని అది కేవలం వికేంద్రీకరణతోనే సాధ్యమని అన్నారు. వికేంద్రీకరణ జరగకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టం జరుగుతుందని, మూడు రాజధానులు ద్వారా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
రాష్ట్రంలో 31 లక్షల ఇళ్లు నిర్మాణం
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని, లక్షలాది మంది మహిళల సొంతింటి కలను నెరవేర్చే మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారని అన్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్నారని అన్నారు. వీటి ద్వారా ఒక్కో మహిళకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన సంపదను అందిస్తున్నారని అన్నారు.
పాకిస్తాన్ తో ఎందుకు మాట్లాడాలి? మాట్లాడం, మేము కాశ్మీర్ ప్రజలతో మాట్లాడుకుంటాం. అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని విజయసాయి రెడ్డి అన్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా టెర్రరిస్ట్ కార్యకలాపాలను ప్రోత్సహించడాన్ని స్వస్తి పలికే వరకు పాకిస్తాన్ తో మాట్లాడే ప్రసక్తే లేదని అన్నారు.
వివిధ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు చైర్మన్లుగా నియమితులైన సహచర ఎంపీలకు అభినందనలు తెలియజేస్తున్నానని విజయసాయి రెడ్డి అన్నారు. కమిటీలు అత్యంత నాణ్యమైన రిపోర్టులు తయారు చేసి ప్రభుత్వానికి అందించడం ద్వారా దేశ అభివృద్ధికి దోహదపడతాయని ఈ మేరకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు.