-ప్రగతిపథంలో నడిపిన నవ్యాంధ్రను జగన్ రెడ్డి సర్వనాశనం చేశారు
-తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు
పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్రాన్ని కుల, మత, ప్రాంతాల వారీగా జగన్‌రెడ్డి విభజిస్తూ అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక్క చాన్స్ అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి తన అరాచక పాలన, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా మార్చేసారు. చంద్రబాబు ఎంతో కష్టపడి ఒక రూపు తీసుకొచ్చిన నవ్యాంధ్రను మూడున్నరేళ్లలో భ్రష్టపట్టించారు. ఏపీ జీవనాడి పోలవరాన్ని నిలిపేయడం జగన్ రెడ్డి దుర్మార్గ పాలనకు నిదర్శనం. వైపీపీ పీడ ఎప్పుడు వదిలించుకుందామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం.
సీయం : రైతులకు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాం
వాస్తవం : రైతులకు ఉపయోగపడే పథకాలను నిర్వీర్యం చేశారు. గతంలో ఇచ్చిన సున్నా వడ్డీ, పావలా వడ్డీ, పంట రుణాలను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. సున్నా వడ్డీ కింద రాయితీ టీడీపీ హయాంలో రూ.2 వేల కోట్లు మేర ఇస్తే దానిని రూ.487 కోట్లకు కోత కోసి ఇస్తూ రైతులందరినీ ఉద్ధరించానంటూ ప్రసంగాలు చెపుతున్నారు. విపత్తు సాయాన్ని కొందరికే పరిమితం చేశారు. చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే స్ప్రేయర్లు, డ్రిప్ ఇరిగేషన్, పవర్ టిల్లర్లు, యంత్ర పరికరాల సరఫరాను నిలిపేశారు. అప్పుల కోసం రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతులను వేధిస్తున్నారు. కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. టీడీపీ హయాంలో 12 లక్షల మందికి పైగా రైతులకు రుణాలిచ్చి ఆదుకుంటే నేడు 2 లక్షల మందికి కూడా రుణాలు ఇవ్వలేదు. దేశంలోనే అత్యధిక ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతున్నాయంటే రైతులకు ప్రభుత్వం చేస్తున్న సాయం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. రాయితీపై ఎరువులు, విత్తనాల సరఫరా వంటివి నిలిపివేసి రైతులు ఆర్థికంగా చితికిపోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
సీయం : విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత
వాస్తవం : అత్యంత కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేశారు. పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ ఈ రంగాలను అభివృద్ధి చేయడంపై చూపలేదు. నీతిఅయోగ్ విడుదల చేసిన నేషనల్ హెల్త్ ఇండెక్సింగ్ ర్యాంకుల ప్రకారం 2017`18లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 10వ స్థానానికి పడిపోయింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ప్రధాన ఆసుపత్రుల్లో వైద్యం కూడా చేయడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్లు కూడా దొరకని దయనీయ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇచ్చే సాయాన్ని కూడా పూర్తిగా నిలిపివేశారు. 104, 108 అంబులెన్స్‌ల వైఫల్యాలతో శవాలను, పిల్లలను భుజాల మీదకు వేసుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
టీడీపీ హయాంలో పాఠశాలల్లో 6% నుండి 7% గ్రాస్ ఎన్రోల్మెంట్ పెరగ్గా నేడు ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. ఎన్‌సీఈఆర్‌టి నివేదిక ప్రకారం 2017తో పోల్చుకుంటే 2021లో విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యతా ప్రమాణాలు దిగజారాయని స్పష్టమైంది. మూడున్నరేళ్లలో 10 వేలకు పైగా పాఠశాలలను ఎత్తివేసి 3 వేల టీచర్ పోస్టులను రద్దు చేసి, కొత్తగా ఒక్క స్కూల్ కట్టకపోవడం, ఒక్క టీచర్ని నియమించకపోవడమే జగన్‌రెడ్డి సాధించిన ప్రగతి.
సీయం : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది
వాస్తవం : వైసీపీ ప్రభుత్వం తన అభివృద్ధిని చెప్పుకోలేక గత ప్రభుత్వంలో సాధించిన అభివృద్ధిని తగ్గించి చూపించే ప్రయత్నంచేస్తున్నారు. అప్పులు, అభివృద్ధిలో బాహాటంగా అబద్దాలు ఆడుతున్నారు. 2018-19 లో రాష్ట్ర స్థూల ఆదాయం (జి.ఎస్.డి.పి) రూ. 6,80,332 కోట్లు అని ప్రకటించి దాన్ని 6,21,300 కోట్లకు కుదించి చూపించారు. రూ. 57 వేల కోట్ల తెలుగుదేశం ప్రభుత్వ అభివృద్దిని తగ్గించే ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వం 6.9 శాతం జి.ఎస్.డి.పి సాధించిందని గొప్పగా చెప్పుకునేందుకు నాడు ఉన్న 11 శాతం జి.ఎస్.డి.పి 5 శాతానికి తగ్గించి చూపించారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగి ఉంటే రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదు. 2014 నుంచి 2019 ఐదేళ్లలో చేసిన అప్పులు రూ.2,57,210 కోట్లు, .వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.4 లక్షల కోట్లు దాటాయి. ఈ లెక్కన సగటున ఏడాదికి వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,11,472 కోట్లు. తెలుగుదేశం ప్రభుత్వం కంటే నాలుగు రెట్లు ఎక్కువ అప్పులు చేసి నిస్సిగ్గుగా టిడిపి కంటే తక్కువ అప్పులు చేశామని అబద్దాలు ఆడుతున్నారు.
సీయం : సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం
వాస్తవం : గతంలో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంతో జరిగితే నేడు పూర్తిగా నిలిచిపోయాయి. టీడీపీ 5 ఏళ్లలో రూ.68,293 కోట్లు వ్యయం చేసి కొత్తగా 62 ప్రాజెక్టులు చేపట్టి 23 ప్రాజెక్టులను పూర్తిచేసి 10 లక్షల ఎకరాలకు అదనంగా నీరందించడం జరిగింది. నేడు జగన్‌రెడ్డి పాలనలో మూడున్నరేళ్లలో ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది కేవలం రూ.5,840 కోట్లు మాత్రమే. రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ పాలన సాగించారు.
సీయం : రేషన్ షాపుల ముందు క్యూలు లేకుండా చేశాం
వాస్తవం : గతంలో రేషన్ సరుకులు నెల మొదటి 15 రోజులు ఇచ్చేవారు. లబ్దిదారుడు ఏ సమయంలోనైనా వెళ్లి తెచ్చుకునే వెసులుబాటు ఉండేది. నేడు ఆ విధానానికి తూట్లు పొడిచారు. 93% మందికిపైగా వినియోగించుకున్న రేషన్ విధానం ప్రభుత్వ చర్యలతో 86%నికి పడిపోయింది. 9 రకాలకు పైగా సరుకులు గతంలో రేషన్ షాపుల్లో ఉండేవి. నేడు బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు.
సీయం : అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లు వ్యయం
వాస్తవం : చదరపు గజానికి రూ.12 వేలు ఖర్చు చేసినట్లు, ఒక సామాజిక వర్గం కోసం చేసినట్లు, ఇన్సైడర్ ట్రేడిరగ్ జరిగినట్లు అనేక రకాల తప్పుడు ప్రచారం చేశారు. ఇందులో ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు. ప్రజలపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతిని రూపొందించడం జరిగింది. 13 జిల్లాల అభివృద్ధికి ఉద్యోగాలు కల్పించేందుకు పెట్టుబడుల ఆకర్షించేందుకు ఉపయోగపడే నగరంపై విష ప్రచారం చేస్తున్నారు.
సీయం : 3 రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
వాస్తవం : వికేంద్రీకరణతో మూడు ప్రాంతాల అభివృద్ధి సాధ్యమంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. మూడున్నరేళ్లలో ఉద్దరించిందేంటి? ఒక్క పరిశ్రమ తేవడంగానీ, ఒక్క పరిశ్రమ పూర్తిచేయడం గానీ చేశారా? విశాఖలో విలువైన ప్రభుత్వ భూములు అమ్మేయడం, ప్రజల భూములు లాక్కోవడమే ఉత్తరాంధ్రకు చేసిన మేలా? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతికి బేషరతుగా మద్దతు తెలిపిన జగన్‌రెడ్డి ఇప్పుడు రైతుల త్యాగాలను అవమానించేలా వ్యవహరిస్తున్నారు. ప్రాంతాలవారీగా విషంపోసి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
సీయం : ఇంటి వద్దకే పథకాలు
వాస్తవం : నగదు బదిలీని జగన్‌రెడ్డి కొత్తగా పరిశోధన చేసి కనుగొన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీ హయాంలో ఇచ్చిన పథకాలన్నీ నగదు బదిలీ ద్వారా అమలు చేసినవే. రైతులకు రుణమాఫీ నేరుగా వారి అకౌంట్లలో జమ చేశాం. అన్నదాత సుఖీభవ, చంద్రన్న బీమా, పసుపు`కుంకుమ, సబ్సిడీ రుణాలు, స్వయం ఉపాధి రుణాలు… ఇలా అన్ని పథకాలు నగదు బదిలీ ద్వారానే నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జగన్‌రెడ్డి చేసిందేమిటి? వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వీఆర్వో, వీఆర్ఏ, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల అధికారాల్లో కోత కోశారు.
సీయం : ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందిస్తున్నాం
వాస్తవం : మూడున్నర సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలపై ఎటువంటి శ్రద్ధ చూపలేదు. కొత్తగా సబ్‌స్టేషన్ నిర్మించడం గానీ, రోడ్డు వేయడం గానీ చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ రోడ్లంటే నరకకూపాలుగా మారాయని పొరుగు రాష్ట్ర ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. పూర్తిగా రోడ్లు ధ్వంసమైపోయాయి. రాష్ట్రంలో ఏ రహదారీ గోతుల్లేకుండా లేదు. టీడీపీ హయాంలో 25 వేల కి.మీ. మేర సింమెటు రోడ్లు నిర్మిస్తే, మూడున్నరేళ్లలో వెయ్యి కి.మీ. మేర కూడా సిమెంటు రోడ్లు నిర్మించలేదు. రోడ్ల మరమ్మత్తు కోసం మూడున్నరేళ్లలో ఖర్చు చేసింది రూ.32 కోట్లు మాత్రమే.
సీయం : నవరత్నాలతో సంక్షేమ బాట
వాస్తవం : కేంద్రం ఇచ్చే సొమ్ముతో సంబంధం లేకుండా రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకూ రూ.12,500 ఇస్తానన్నారు. ఇప్పుడు రూ.7500 ఇస్తూ.. రూ.6000 చొప్పున ఎగ్గొట్టారు. 80 లక్షల రైతులుంటే 54 లక్షల మందికే ఇస్తున్నారు. అమ్మఒడితో అందరికీ రూ.15వేలు హామీపై మాట తప్పారు. రూ.13వేలకు పరిమితం చేశారు. పిల్లల సంఖ్యను 82 లక్షల నుండి 43 లక్షల మందికి కుదించారు. అమ్మఒడితో ఇచ్చి నాన్న బుడ్డీతో ఏటా రూ.36వేలు లాక్కున్నారు. అవ్వా తాతలకు రూ.3వేల పెన్షన్ హామీకి తిలోదకాలిచ్చి రూ.2,250తో చేతులు దులుపుకున్నారు.
ప్రతి ఏటా పెంపు హామీకీ మూడో ఏడాది వరకు మోక్షం కలగలేదు. ఒక్కొక్కరికి సగటున రూ.30వేల చొప్పున ఎగ్గొట్టారు. అందరికీ ఇళ్ల నిర్మాణంపేరుతో 12వేల ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నారు. మూడున్నరేళ్లలో కట్టింది 65వేలే. ప్రతి విద్యార్ధికీ ఫీజు రీయింబర్స్ మెంట్ హామీకి తిలోదకాలిచ్చి 7 లక్షల మందికి కోత పెట్టారు. జీవో నెం.77తో ప్రైవేటు కాలేజీల్లోని విద్యార్ధులకు పథకం ఎత్తేశారు. మద్యపాన నిషేధం హామీపై మాట తప్పి.. మద్యం ఆదాయంతోనే పథకాలు అనే స్థితికి వచ్చారు. మూడేళ్లలో రూ.33 వేల కోట్లు అప్పులు తెచ్చారు. ధరలు పెంచి, నాశిరకం మద్యం అమ్మకాలతో ఏటా రూ.5వేల కోట్ల కమిషన్లు దండుకుంటున్నారు.
జలయజ్ఞం కాస్తా.. ధన యజ్ఞం చేశారు. సాగునీటి రంగాన్ని భ్రష్టుపట్టించారు. 2019కే పూర్తి కావాల్సిన పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో వెనక్కి నెట్టారు. ఆరోగ్యశ్రీతో అందరికీ ఆరోగ్యానికి పడకేయించారు. బిల్లులు చెల్లించక ప్రైవేటులో వైద్యం దూరమైంది. తాజాగా ఆరోగ్యశ్రీ నిధుల్ని పక్కదారి పట్టించి వైద్యాన్ని ప్రశ్నార్ధకం చేశారు. ఆసరాతో రూ.27 వేల కోట్లు రుణమాఫీ హామీ ఇచ్చి.. రుణాలు తీసుకుని చెల్లించిన వారికి ద్రోహం చేశారు. చేయూతతో 45 సం.లు నిండిన వారికి పెన్షన్ హామీపైనా మాట తప్పి మడమ తిప్పి.. మహిళలకు రూ.1.05 లక్షలు ఎగనామం పెట్టారు.