-మృతుల ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ షాక్ తో 6 మంది మహిళల ప్రాణాలు పోయాయని, దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దర్గాహోన్నూరులో విద్యుత్ షాక్ తో 6 మంది మహిళా వ్యవసాయ కూలీల మృతి బాధాకరం. వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి. మృతి చెందిన వారంతో బీసీ కులానికి చెందినవారు, పొట్ట కూటి కోసం వెళ్లి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయారు. పాత వైర్లు కావటంతోనే అవి ట్రాక్టర్ పై తెగిపడి ప్రమాదం జరిగిందని స్ధానికులు చెబుతున్నారు.
దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. మృతుల ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వటంతోపాటు గాయపడిన వారికి రూ. 2 లక్షలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. విశాఖ ఎల్జీపాలిమర్స్ ప్రమాదం ఘటనలో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి రూ. కోటి ఇచ్చిన ప్రభుత్వం విద్యుత్ షాక్ తో చనిపోయిన బీసీ మహిళలకు రూ. 25 లక్షలివ్వలేదా? వరుస విద్యుత్ ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదు? ఇకనైనా ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కాల్వ శ్రీనివాసులు అన్నారు.