గుత్తి పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి ఏనాడు చూడని విధంగా నీటి కోసం యుద్ధాలు చేసుకునే పరిస్ధితి దాపురించింది. గత మూడు నెలలుగా సాధారణ వర్షపాతం సగటు కన్నా అధికంగా కురిసినట్లు లెక్కలు చెప్తున్న త్రాగునీటి అవసరాలు ఇప్పటికిప్పుడు పరిష్కారం లభించే పరిస్ధితి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నెలల తరబడి నీళ్లు లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మునిసిపల్ కార్యవర్గం వస్తే మారుతుందని భావించిన ప్రజలు ఇప్పుడు పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు ఉంది. ప్రజలకు త్రాగునీటి అవసరాలను తీర్చలేని ప్రజాప్రతినిధులు ఉంటే ఎంత లేకపోతే ఎంత. భారీగా వర్షాలు పడిన చెరువులో నీటి మట్టం అంతంత మాత్రమే. తక్షణమే శివారు ప్రాంతాలల్లో బోర్లు వేసి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అవసరం ఉంది. సమ్మర్ స్టోరేజి ట్యాన్క్ నిర్మాణం జరగలేదు, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సబ్మిట్ చేయలేదు, త్రాగునీటికి ప్రణాళిక ఊసేలేదు.
సాగునీటి పరిస్థితి ఎలా ఉన్నా కనీసం త్రాగునీటి అవసరాలకు సరిపోనూ నీటి విడుదల ప్రస్తుత వర్షాల వలన కల్గితే ఆదే పదివేలుగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. వర్షాకాలంలో పరిస్థితి ఇలా ఉంటే రాబోవు వేసవిని తలుచుకుంటే వణుకుపుడుతోందని ప్రజలు భావిస్తున్నారు. గుత్తి పురపాలక ప్రజలు త్రాగునీటి కోసం గత రెండు సంవత్సరాలకు పైగానే పోరాటం చేస్తున్నారు. దేశంలో నే పెద్దగా వ్యయం లేకుండా రెండు పూటల మంచినీటిని అందించే ఆద్భుత పథకం ఉన్న గుత్తి పట్టణంలోనే నెలకొకసారి మంచినీటిని సరాఫరా చేసే పరిస్థితి వచ్చింది. అపరిశుభ్రతకు, అనారోగ్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారనున్న గుత్తి పట్టణం. గుత్తి పట్టణం మేజర్ పంచాయతీ నుండి మునిసిపాలిటీ కి అప్ గ్రేడ్ అయి ఏడు సంవత్సరాలు అవుతున్నా నగరంలో సమస్యలు దిగజారి అధ్వాన్నంగా ఉంటున్నది. పారిశుధ్యం పూర్తిగా పడకేసింది, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఒకప్పుడు సుందరమైన గుత్తి కోట దర్శనమిచ్చేది, ఇప్పుడు మురికి కాలువలు రహదారుల ద్వారా ప్రవహిస్తున్న పట్టించుకునే నాథుడే లేడు.
గాంధీ చౌక్ దగ్గర మూత్ర విసర్జనతో ఈ నేల తడిసి ముద్దయింటుంది. మూత్ర శాలలు ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడంతో ఫుట్ బాల్ గ్రౌండ్, ఆర్ అండ్ బి కాంపౌండ్ ప్రతి అంగుళం పవిత్రమై ఉంటున్నది. అక్కడే టిఫిన్ సెంటర్లు, అక్కడే చికెన్ పకోడీలు, కూల్డ్రింక్ షాపులు ఏమాత్రం శుచి శుభ్రత లేకుండా డయోరియా, వాంతులు విరేచనాల బారిన పడుతున్నారు. ఇక అన్ని విద్యాసంస్థల దగ్గర దుర్గాంధ పూరిత వాతావరణం పుష్కలంగా ఉంటున్నది. పంట కాలువను తలపించే మురికి కాలువ అనంతపురం రోడ్డు లో ఉన్న జూనియర్ కళాశాల. పిల్లలు మూత్రం పోసుకోవడానికి అనుకూలంగా ఉంటున్నది. ఇక నగరం నడిబొడ్డున ఉన్న మరియొక కళాశాల గురించి ఎంత చెప్పినా తక్కువ చూసి తెరిస్తే గుత్తి ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది.
జిల్లాలో ఇరుకైన రోడ్లు , పందులు స్వైర విహారం చేసే ప్రదేశం, ఏమాత్రం టవున్ ప్రణాళిక లేని నగరంగా పేరు మోసింది. పార్కింగ్ సమస్య విపరీతంగా ఉంది, ఎక్కడా వాహనాలు పెట్టుకోవడానికి స్థలం లేదు. బ్యాంకుల దగ్గర కనీసం పాదాచారులు నడవడానికి స్థలం ఉండదు. ఇంత ఉత్కృష్టంగా ప్రతి బంధకాల మధ్య ప్రజలు బతుకుతున్నారు. ఇంటి ముందు రెండడుగుల స్థలం ఉండదు కానీ పది అడుగుల కార్లు కొన్నారు. అవి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఊరికి దగ్గరలో స్నేహితుల ఇళ్లల్లో , గుళ్ళు , మసీదులు, చర్చి కంపౌండ్లల్లో దర్శనమిస్తున్నాయి. కొత్తగా వెలసిన కాలనీలలో కూడా ఇదే పరిస్థితి. ఒక సందులో దూరితే ఎక్కడ చేరుతామో తెలియదు. పాత శివసాగర్ హోటల్ ప్రక్కన మూడడుగుల రహదారి గుండా వందలాది మంది వెళుతుంటారు. నిత్యం మోటారు సైకిళ్ళు అటు ఇటు తిరుగుతుంటాయి. ఇలాంటి విన్యాసాలను కనులార చూసి తరిస్తే మంచిది. దర్శకులు హారర్ చిత్రాలకు , క్రైమ్ చిత్రాలకు కొన్ని లొకేషన్లు అద్దెకు తీసుకుంటుంటారు.
ప్రజలు ఇలాంటి సినిమాలు చూసినప్పుడల్లా ఇంకా ఇలాంటి మురికి వాడలు, ఇరుకు ప్రదేశాలు ఉన్నాయా అన్న అనుమానం వస్తుంది. తెలుగు దర్శకుల కంట కనపడక పోవడం గుత్తి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, మునిసిపల్ అధికారులు నగర ప్రణాళిక పై అలాగే అపరిశుభ్రతపై సమరం పూరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుత్తి పట్టణంలో వధ శాలలు, చికెన్ సెంటర్లు మెయిన్ రోడ్డుకు మార్చాలి. అలాగే గొర్రెలు, బర్రెలు, ఎరువు దిబ్బలు పట్టణం వెలుపల లేదా సువిశాల ప్రదేశాలల్లో ఉండాలి. తక్షణమే బహిరంగ మల మూత్ర విసర్జనను నిషేధించాలి. మూత్ర శాలలను అన్ని బహిరంగ ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి. చెత్త పన్ను ఆస్తి పన్ను పెంచిన ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు చేయక పోవడం విడ్డురం. మన ప్రాంత అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అలాగే పౌర సంఘాల దర్శకత్వంలో మెరుగైన సమాజం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.