– జగన్ ను నమ్ముకుంటే జైలుకు పోతారన్న చంద్రబాబు
– చంద్రబాబు కర్నూలు పర్యటనకు ప్రజల అపూర్వ స్వాగతం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
కర్నూల్, నవంబర్ 16: చంద్రబాబును నమ్మితే భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్నట్టేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ను నమ్ముకుంటే జైలుకు పోతారని చంద్రబాబు మరోమారు స్పష్టం చేసినట్టు అయన తెలిపారు.
బుధవారం కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబుతో కలిసి శిష్ట్లా లోహిత్ పలు కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులు చేసిన అధికారులందరినీ బోనెక్కిస్తామని చంద్రబాబు హెచ్చరించారని తెలిపారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఎమ్మెల్సీ అనంత బాబు ఘటనను చంద్రబాబు ఉదహరించినట్టు తెలిపారు.
రౌడీ మూకలను పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరస్తులను ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండని చంద్రబాబు హెచ్చరించారన్నారు. ముఠాలను రూపుమాపి, మత విద్వేషాలను తెలుగుదేశం పార్టీ కట్టడి చేసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారన్నారు. ప్రభుత్వం కేసులు పెడుతుందని ఎవరూ భయపడవద్దని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు హత్యా రాజకీయాలకు దూరమని చంద్రబాబు వివరించారన్నారు. అన్యాయం జరిగితే చెప్పడానికి పిరికితనం ఎందుకని చంద్రబాబు ధైర్యం చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కొట్టడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. కొట్టిన నిందితుడిని కాపాడుతున్న వారు ఎక్కడున్నా బయటికి తీసుకు వస్తానని చంద్రబాబు హెచ్చరించినట్టు చెప్పారు.
డోన్ లో ఒక అప్పుల మంత్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు చెందిన కాంపౌండ్ వాల్ ను కూల్చివేశాడని, మేం తలుచుకుంటే మిమ్మల్ని కూల్చడం పెద్ద పనేమీ కాదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారన్నారు. న్యాయం, ధర్మం ప్రకారం వ్యవహరించాలని, లేకుంటే మీ గుండెల్లో నిద్ర పోతామంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను చంద్రబాబు హెచ్చరించారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలి వీస్తోందని, అది ప్రభంజనంగా మారుతోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారన్నారు.
తెలుగుదేశం పార్టీ గాలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుందంటూ చంద్రబాబు జోస్యం చెప్పారన్నారు. కర్నూలు జిల్లాలో 18 లక్షల కార్డులు తీసివేశారని, పేదల బాధలు వైసీపీ ప్రభుత్వానికి ఉరి తాళ్లుగా మారుతాయని,18 లక్షల కుటుంబాలను అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాంగోపాల్ రెడ్డిని ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారన్నారు.
నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఉద్యోగులకు గౌరవం ఇవ్వని పరిస్థితులను ప్రజలకు చంద్రబాబు వివరించారని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భూస్థాపితం చేయండని, దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి మెట్టు వేయాలని చంద్రబాబు సూచించారన్నారు. ఇదిలా ఉండగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం మార్కాపురం గ్రామంలో పత్తి పంటలను చంద్రబాబు పరిశీలించారని తెలిపారు. నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు చంద్రబాబుకు రైతులు వివరించారన్నారు.
నకిలీ విత్తనాలపై జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదని రైతులు చంద్రబాబు ఎదుట వాపోయారని తెలిపారు. ప్రజా ప్రతినిదులు కూడా కంపెనీలతో కుమ్మక్కు అయ్యారని రైతులు అవేదన వ్యక్తం చేశారని శిష్ట్లా లోహిత్ చెప్పారు.