-పత్తికొండ సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-ఏపీ దావూద్ జగన్ రెడ్డిని ఇంటికి పంపుదాం
-రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం..మూడు రాజధానులు కడతాడా.?
-నకిలీ విత్తనాలతో రైతులు అప్పులపాలు
-నవరత్నాలు కాదు..నవమోసాలు
-పత్తికొండ బాదుడే బాదుడే కార్యక్రమంలో చంద్రబాబు ధ్వజం
-అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించకపోతే, ఇవే తన చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. తాను తిరిగి సీఎంగానే సభలోకి వస్తానని సవాల్ చేసి, అసెంబ్లీని బహిష్కరించిన విషయాన్ని ఆయన ప్రజలతో పంచుకున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో, చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ హయాంలో 5 ఏళ్లలో రాష్ట్రంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని, అవి కొనసాగి ఉంటే ఇప్పుడు 30 లక్షల ఉద్యోగాలు యువతకు వచ్చేవని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని, ఈ రోజు మనం ఉద్యోగాల కోసం హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వస్తోందని ప్రశ్నించారు. కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా ఓర్వకల్ ఎయిర్ పోర్టుకు చంద్రబాబు చేరుకోగానే… విద్యార్థులు తమ ఇబ్బందులు, ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడం తదితర సమస్యలను చంద్రబాబుకు విన్నవించారు. ఈ సందర్భంగా
జాబు రావాలి అంటే బాబు రావాలి అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… ఇప్పుడు ఇక్కడ ఉన్న విమానాశ్రయాన్ని ఎవరు కట్టారో ఆలోచించాలన్నారు. ‘‘కర్నూల్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ కోసం 10 వేల ఎకరాలు ఇచ్చాం. జిల్లాకు సీడ్ పార్క్ తెచ్చాం. సోలార్ పార్క్ తెస్తే కమిషన్ల కోసం జగన్ రెడ్డి నిలిపివేశారు. అభివృద్ధికి టీడీపీ మారుపేరు. ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ హయాంలోనే జరిగాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
జగన్ మూడు ముక్కలాటలాడుతున్నాడు
హైదరాబాద్ ఉన్న తెలంగాణ కంటే మనం మరింత అభివృద్ధి చెందాలనుకున్నామని, అందుకే అమరావతి రాజధాని నిర్మాణాన్ని తలపెట్టాం అని తెలిపారు. ‘‘ఈ రోజు రాష్ట్రానికి ఏమిటీ ఖర్మ? యువతలో చైతన్యం రావాలి. వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఉంటుందా? జగన్ మూడు ముక్కల ఆట ఆడుతున్నాడు.? నాడు వైఎస్సార్ హైటెక్ సిటీ కూల్చివేసి ఉంటే తరువాత అభివృద్ధి జరిగేదా? కర్నూల్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు నిలిపివేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రిని కూడా జగన్ గౌరవించడం లేదు
జగన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డిని కూడా గౌరవించడం లేదని, రాజశేఖర్ రెడ్డి తెచ్చిన వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహం తొలగించారన్నారు. కర్నూల్ లో పరిశ్రమలు రావాలని 10 వేల ఎకరాలలో టౌన్ షిప్ తెచ్చామని, సోలార్ ప్రాజెక్ట్ లు తెచ్చి నాడు ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. రాయలసీమ యూనివర్సిటీలో సిబ్బందికి కనీసం జీతాలు కూడా నేడు ఇవ్వడం లేదని విమర్శించారు.
రామ్ గోపాల్ రెడ్డిని గెలిపించండి
త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమరాయలసీమ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. యువత భవితకు తనదీ భరోసా అన్నారు.
నకిలీ విత్తనాలతో నష్టపోయామని చంద్రబాబుకు మొర
పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం మార్కాపురం గ్రామంలో పత్తి పంటలను చంద్రబాబు పరిశీలించారు. నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు చంద్రబాబుకు రైతులు వివరించారు. నకిలీ విత్తనాలపై జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదని రైతులు వాపోయారు. ప్రజా ప్రతినిదులు కూడా కంపెనీల వారితో కుమ్మక్కు అయ్యారని రైతుల అవేదన వ్యక్తం చేశారు. పత్తిపంట సాగు చేసి నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్ట పోయామని చంద్రబాబు వద్ద రైతులు అవేదన వ్యక్తం చేశారు. పత్తి రైతులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘పత్తి రైతులకు నాసిరకం విత్తనాలు ఇచ్చి రైతుల కడుపు కోతకు కారకులయ్యారు. ఎకరాకు రూ.50 వేలు ఖర్చు పెడితే కనీసం ఐదారు వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా ఒక్క రైతుతోనైనా మాట్లాడారా? రైతులు సంక్షేమం కావాలని అడిగితే రైతుల మోటార్లకు మీటర్లు బిగించి మెడకు ఉరితాళ్లు వేస్తానంటున్నాడు. దేశం లో ఎక్కువ రైతు ఆత్మహత్యలు చేసుకుంటుండేది మన రాష్ట్రం లోనే. ఎక్కువ అప్పులుండేది మన రాష్ట్రంలోనే. రైతులందరూ అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంతలు పూడ్చలేని సీఎం..మూడు రాజధానులు కడతాడా.?
కోడుమూరు సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహానికి చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి విజయ భాస్కర్ రెడ్డి అని, అవినీతికి, అక్రమాలకు ప్రతిరూపం జగన్ రెడ్డి అని మండిపడ్డారు. నియోజకవర్గంలో మట్టి దోపిడీ, అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతారా అని ప్రశ్నించారు. నీరు ఉండే ప్రాంతాలు, విమానాశ్రయంతో సహా అన్నీ నంద్యాల జిల్లాకు వెళ్ళాయని, కర్నూల్ జిల్లాలో నీటి ఎద్దడి అధికంగా ఉందన్న విషయాన్ని టీడీపీ హయాంలో గుర్తించి హంద్రీ-నీవా ద్వారా నీరిచ్చామని పేర్కొన్నారు. ఇక్కడ టీడీపీయే సాగునీటి ప్రాజెక్ట్ లు చేపట్టిందని తెలిపారు. మూడేళ్లలో ఒక్క పని అయినా చేశారా అని ప్రశ్నించారు. రోడ్ల మీద గుంతలు పడితే మట్టి వేయలేని సీఎం…మూడు రాజధానులు కడతాడా అని నిలదీశారు. మన రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని, జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కల పేకాట ఆడుతున్నాడని దుయ్యబట్టారు.
అమ్మఒడి..నాన్న బుడ్డీ
ఇంటి పన్నుతో సహా అన్ని పన్నులు విపరీతంగా పెంచారని, కరెంటు చార్జీలు పెంచారని విమర్శించారు. నిత్యవసర వస్తువుల ధరలు, చివరికి చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రజలపై అధిక భారం మోపారని, మళ్ళీ టీడీపీ వస్తేనే ఉద్యోగాలు అని యువత చెబుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, ఇసుక, మద్యం దోపిడీ జరుగుతోందని, అమ్మ ఒడి అంటున్నారు, నాన్న బుడ్డీ ద్వారా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరితే దేవరకొండ వరకు ఎక్కడ చూసినా యువ కిశోరాలే కనపడ్డాయన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు సూర్యప్రకాశ్ రెడ్డి, ఆలూరు నియోజకవర్గ ఫైర్ బ్రాండ్ కోట్ల సుజాతమ్మ ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ప్రారంభమైందని, జగన్మోహన్ రెడ్డితో మీరు పోరాడండి, మీ వెంట మేముంటాం అని యువకులు పిడికిలి బిగించి చెబుతున్నారని వివరించారు. ఈ ప్రభుత్వంతో ఏ ఒక్కరూ ఆనందంగా లేరని, అందరూ నాశనమయ్యే స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దామని పిలుపునిచ్చారు.
ఏపీ దావూద్ జగన్ రెడ్డిని ఇంటికి పంపుదాం
కిలో టమోటా రూపాయి మాత్రమే పలుకుతోందని, ఈ ధరతో రైతులకు గిట్టుబాటు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రూ.3,500 కోట్లు రైతులు నష్టపోయారన్నారు. ఇదంతా వైసీపీ పాపమేనని, మోసం చేయడంలో జగన్ రెడ్డి దావూద్ ఇబ్రహీంను మించిపోయాడని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తున్నారని, తెలుగుదేశం తమ్ముళ్లపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లల్లో పెట్టారని పేర్కొన్నారు. న్యాయం, ధర్మం, రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని, సమస్యలపై రాసిన పత్రికలపై దాడులు చేస్తూ.. కేసులు పెడతున్నారని అన్నారు. సీబీసీఐడీని పిలిపించి విచారణ చేయిస్తున్నారని, వ్యాపారాలపై దాడులు చేయిస్తారని పేర్కొన్నారు. జడ్జీలపైన సోషల్ మీడియాలో అవమానిస్తున్నారని, ఏపీ దావూద్ జగన్ ని ఇంటికి పంపిద్దాం అని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో నిజాలు పోస్టు చేయడం ఎమ్మెల్యేని విమర్శించే హక్కు ప్రజలకు ఉండకూడదా అని ప్రశ్నించారు. ఈ పుడంగులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నెర్ర చేసివుంటే మీ పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించాలని హెచ్చరికంచారు. వైసీపీ నాయకులు భూకబ్జాలు, పేకాట, మద్యం, ఇసుక వ్యాపారాలు చేస్తున్నారని, ప్రజలకు సేవ చేయలేని దద్దమ్మ మంత్రులు తనను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
6వేల స్కూళ్లు మూసేశారు
‘‘అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలైంది ప్రజలు అధికారమిచ్చి ఏం చేశారో చెప్పాలి. తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు వైసీపీ నాయకులకు లేదు. అమ్మఒడి అని చెప్పి పిల్లల జీవితాలను నాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి పిల్లలకు మేనమామ కాదు కంసమామ. 6 వేల స్కూళ్లను మూయించారు. 4 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు వెళ్లడం మానేశారు. పీఆర్సీ, సీపీఎస్ ఇవ్వకుండా ఉపాధ్యాయులను వేధించారు. బాత్ రూముల వద్ద ఫొటోలు తీసే పని ఉపాధ్యాయులకు అప్పగించారు. ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలా? లేక ఫొటోలు తీసుకుంటూ కూర్చోవాలా? జగన్ కు రంగుల పిచ్చి ఉంది. కర్నూలులో నేను 10 వేల టిడ్కో ఇళ్లు ఒకే స్థలంలో కట్టాను. అవి పూర్తి చేసి ప్రజలకు ఇవ్వకుండా వాటికి వైసీపీ రంగులు వేసుకున్నారు. మీ పాసు బుక్కులపై జగన్ ఫొటోలు ఎందుకు? భయపడుతూ పోతే శాశ్వతంగా ఊడిగం చేయాల్సి వస్తుంది.
నవరత్నాలు కాదు..నవమోసాలు
‘‘ప్రజలకు ఈ ముఖ్యమంత్రి ఇచ్చింది నవరత్నాలు కాదు.. నవమోసాలు. జగన్ ఇచ్చింది గోరంత దోచింది కొండంత. ఏ ఒక్కరి జీవన ప్రమాణాలూ మెరుగపడలేదు. వచ్చే ఆదాయం సరిపోవడంలేదు. అప్పులు చేయాల్సి వస్తోంది. ముఖ్యమంత్రికి భయం పట్టుకుంది. ఇప్పుడే ఎన్నికలకు పోతే బాగుంటుందని అనుకుంటున్నాడు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ ఎన్నికలకు సిద్ధం. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తాం. భూస్థాపితం చేస్తాం. వైసీపీ పీడ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. మేం వస్తే మెరుగైన సంక్షేమం ఇస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాం. సంపద సృష్టిస్తాం. సంపద పెంచి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేదవారి సంక్షేమానికి, మీ భవిష్యత్తుకే ఖర్చు చేస్తాం. మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తాం. జగన్ వ్యక్తిత్వం లేని వ్యక్తి. రాజశేఖర్ రెడ్డితో పోరాడాం గానీ ఆ పోరాటానికి ఒక హుందాతనం ఉండేది. ప్రజాస్వామ్య విలువలు ఉండేవి. పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు. చట్టాలను గౌరవించే పోలీసులకు నేను అండగా ఉంటాను. చట్టాలను మీ చేతుల్లోకి తీసుకునే టెయింటెడ్ ఆఫీసర్ల భరతం పడతాం.‘‘ అని హెచ్చరించారు.