– మోదీపై యుద్ధంలో కేసీఆర్ ముందడుగు
– విపక్షాలకు మార్గదర్శిగా టీఆర్‌ఎస్ అధినేత
– బీజేపీ మార్గదర్శికే నోటీసులిచ్చిన ఘనత
– మోదీ-అమిత్‌షాతో సమరానికి సై
– జాతీయ స్థాయిలో పెరిగిన కేసీఆర్ పొలిటికల్ ఇమేజ్
– సంతోష్‌జీ సిట్ ముందుకు రాక తప్పదా?
– మార్గం సుగమం చేసిన హైకోర్ట్
– ఢిల్లీ పోలీసు కమిషనర్ సంతోష్‌కు నోటీసు సర్వ్ చేయాల్సిందే
– ఎమ్మెల్యేలకు ఎర కేసులో కమలానికి కొంత మోదం మరికొంత ఖేదం
– సంతోష్ అరెస్టు కాకుండా హైకోర్టు ఉపశపనం
– అలాగని సిట్ ఉత్తర్వులు రద్దు చేయని హైకోర్టు
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి చెప్పినట్లు.. ఇప్పుడంతా తెలంగాణ దళపతి కేసీఆర్‌ను, ఆడు ‘మగాడ్రా బుజ్జీ’ అని మెచ్చుకోక తప్పని పరిస్థితి. దేశంలోనే అత్యధిక సభ్యులున్న బీజేపీకి… దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి.. అత్యధిక పార్లమెంటుసభ్యులున్న బీజేపీకి.. మార్గదర్శకుడయిన బీఎల్ సంతోష్‌కు, నోటీసు ఇచ్చిన మొనగాడిగా ఇప్పుడు కే సీఆర్‌కు జాతీయ స్థాయిలో బోలెడంత ఇమేజ్.
సంతోష్ వైపు చూసేందుకే నిలువునా వణికిపోయే బీజేపీ ప్రత్యర్థుల బలహీనతను వెక్కిరిస్తూ, తెలంగాణ సిట్ ఇచ్చిన నోటీసుతో కేసీఆర్ ఇప్పుడు ఓ నేషనల్ పొలిటికల్ స్టార్‌గా అవతరించారు. అందరి దృష్టీఆయన వైపే. ఎమ్మెల్యేలకు ఎర కేసులో కేసీఆర్ దూకుడు ఫలితం ఇది. అందుకే ఇప్పుడు కేసీఆర్ సామాన్యుడి దృష్టిలో ఒక్కడు.. దూకుడు.. ఆగడు.
బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్దన సంతోష్. బహుశా ఈ పేరు, ఇంతపెద్ద పేరు ఎవరికీ తెలియకపోవచ్చు. అది కాకపోతే.. బీఎల్ సంతోష్! బీజేపీలోని ఒక స్థాయి నేతలకు మాత్రమే తెలిసిన పేరు ఇది. ఆయన బీజేపీ జాతీయ సంఘటనా మహామంత్రి. అంటే బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర పార్టీ అధ్యక్షులను మార్చాలంటే ఆయన అనుమతి అవసరం. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చాలన్నా, ఆయన అనుమతి కావల్సిందే. పార్టీకి సంబంధించి ఏం నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఆయన అనుమతి తప్పనిసరి.
పేరుకు జాతీయ అధ్యక్షులున్నా, పెత్తనమంతా సంతోష్‌సాబ్‌దే. అందరికీ అమిత్‌షా బాసయితే.. ఆయనకు బాసు సంతోష్‌జీ. ప్రధాని మోదీ-హోంమంత్రి అమిత్‌షా అయింట్‌మెంటయినా దొరుకుతుందేమో గానీ, సంతోష్‌జీ అపాయింట్‌మెంట్ దొరకడం చాలా కష్టం. అంటే ఆయన పలుకుబడి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.
నిజానికి.. సంతోష్‌జీ గురించి, ఆయన పలుకుబడి-ప్రభావం గురించి మీడియాలో చాలామందికి తెలియదు. బీజేపీలో ఆయన పాత్ర ఏమిటన్నది, జాతీయ మీడియాలో కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయనది లోప్రొఫైల్ పాత్ర. ఎక్కడా బయటకు వచ్చి, హడావిడి చేసే పాత్ర కాదు ఆయనది. నాలుగు గదుల మధ్య కూర్చుని, పార్టీని పరిగెత్తించే తెరవెనుక పాత్ర. అందుకే చాలామంది ఆయనను గూగుల్‌లో తప్ప, ఎక్కడా చూసి ఉండరు.
ప్రధాని మోదీ, హోం శాఖ అమిత్‌షా వంటి మహామహులే.. ఆయన దర్శనార్ధం వెళ్లాల్సిందే తప్ప, ఆయన వారి వద్దకు వెళ్లరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, గవర్నర్ వంటి కీలక పదవుల్లో సంతోష్‌జీ సిఫార్సు కీలకం. అది వ్యక్తిగతంగా ఆయన గొప్పతనం కాదు. జాతీయ సంఘటనా మహామంత్రి హోదా ఇచ్చిన గొప్పతనం అది. ఆర్‌ఎస్‌ఎస్ పక్షాన, బీజేపీని చేయి పట్టుకుని నడిపించే అనుసంధానకర్త ఆయన.
అలాంటి పర్వతాన్ని ఢీ కొట్టాలని ఎవరైనా సాహసిస్తారా? కొరివితో ఎవరైనా తల గోక్కుంటారా? అగ్నితో ఎవరైనా ఆడుకుంటారా?.. మామూలుగా అయితే లౌక్యం ఉన్నవారెవరూ ఆ పనిచేయరు. భవిష్యత్తుపై ఆశలున్న రాజకీయ నాయకులెవరూ, కలలో కూడా అలాంటి సాహసానికి ప్రయత్నించరు. కానీ కేసీఆర్ ఆ పని చేశారు.
కేసీఆర్ చేసిన సాహసం అలాంటిదిలాంటిది కాదు. తన రాజకీయ భవిష్యత్తునే పణంగా పెట్టి చేసిన సాహసం అది. ఎమ్మెల్యేల ఎర కేసులో సంతోష్‌జీ పేరు ప్రస్తావనకు రావడంతో.. ఆయనపై సిట్ ఉచ్చు బిగించిన కేసీఆర్ చేసిన సాహ సం, ఆయనకు జాతీయ స్థాయిలో హీరోవర్షిప్ తెచ్చిపెట్టింది. ఫలితంగా నాయకుడు లేని విపక్షాలకు ఆయన దిక్సూచిగా అవతరించిన వైనం. బీజేపీపై యుద్ధం చేయాలని ఉన్నా, ఆ యుద్ధం ఎలా చేయాలో, ఏ మార్గంంలో చేయాలో తెలియక గందరగోళంలో ఉన్న విపక్షాలకు.. ఇప్పుడు కేసీఆర్ ఓ రాజకీయ మార్గదర్శిగా అవతరించారు.
సోనియా, శరద్‌పవార్, నితీష్‌కుమార్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, హేమంత్ సొరేన్ వంటి మహామహులకు చేతగాని పోరాటాన్ని, కేసీఆర్ తన అధికారంతో చేసి చూపించారు. నిజానికి వారంతా బీజేపీ బాధితులే. ఈడీ, ఐటి, సీబీఐ కేసులతో సతమతమవుతున్నవారే. అయితే బీజేపీపై వారిదంతా ఇప్పటివరకూ కలి‘విడి’పోరాటమే.
కలసి కదనం చేయాలని ఉన్నా, బాహుబలి లాంటి బీజేపీని చూస్తే వణుకు. అలాంటి వారి భయాలకు తెరదించి.. బీజేపీతో పోరాటం ఎలా చేయాలో చేసి చూపిన కేసీఆర్ వైపు, ఇప్పుడు బీజేపీ బాధిత పార్టీలు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితిని కేసీఆరే సృష్టించారు. సంతోష్‌జీని సిట్ ముందుకు తీసుకురావడమంటే, మోదీ-షా ద్వయాన్ని తెచ్చినట్లే అన్నది బీజేపీ భావన. అందుకే బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీల దృష్టిలో కేసీఆర్ ఓ హీరో.
హైకోర్టు ఆదేశాల ప్రకారం సంతోష్‌జీకి సిట్ ముందు హాజరుకాకతప్పదు. ఆయనకు నోటీసు ఇచ్చే ఢిల్లీ పోలీసు కమిషనర్‌దే. ఒకవేళ ఈలోగా సుప్రీంకోర్టుకు వెళ్లి, స్టే తెచ్చుకోకపోతే 21న హైదరాబాద్ వచ్చి సిట్ ముందు ఆయన ప్రత్యక్ష్యం కావలసిందే.
సంతోష్‌జీని సిట్ ఎదుట హాజరుకాకుండా, బీజేపీ న్యాయవాదులు చేసిన వాదన నిలవలేదు. అలాగని నిరాశా చెందలేదు. ఆయనను అరెస్టు చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలు, బీజేపీకి బోలెడంత ఊరటనే. కచ్చితంగా సిట్ ముందు హాజరుకావాలన్న హైకోర్టు ఆదేశం, అటు కేసీఆర్ సర్కారుకూ ఊరటనే. ఆమేరకు ప్రపంచాన్ని సిట్ మీద దృష్టి సారించేలా చేసిన కేసీఆర్ లక్ష్యం, దానితో నెరవేరినట్లే. ఆ ప్రకారంగా హైకోర్టు ఇరుపక్షాలకూ సమన్యాయం చేసినట్లే లెక్క.