-ఒక్క రోజే 180 ఎకరాలు ఎలా కొన్నారు? మీతాత ఏమైనా మైసూరు మహారాజా?
-జగన్ రెడ్డి క్యాబినెట్ అంతా క్రిమినల్సే
-ఎన్నికల అఫడవిట్ లో రూ. 3 లక్షలు ఆదాయం కూడా లేదన్న జయరాం ఎన్నికల వ్యయం ఎలా చేశారు
-మంది భూములు బొక్కేసిన జయరాం సిగ్గుంటే తన పదవికి రాజీనామా చేయాలి
– శాసనమండలి సభ్యులు బి.టి నాయుడు
మంత్రి గుమ్మనూరు జయరాం భూ బకాసురుడిలా మారాడనే విషయం సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైనా మంత్రి పదవికి రాజీనామా చేయకుండా నీతులు చెప్పడం సిగ్గుచేటు. ఏడాదికి వ్యవసాయం ద్వారా అధికారికంగా వస్తున్న రూ.52లక్షలతో భూములు కొన్నానని చెబుతున్న జయరాం తన ఎన్నికల అఫిడవిట్ లో చూపించిన ఆదాయం ఎంత? మొత్తం కుటుంబ ఆదాయం ఏడాదికి సగటున రూ.3లక్షలు అని చెప్పిన విషయం వాస్తవం కాదా? 2015-16లో రూ.3,92,958, 2016-17లో రూ.4,22,500, 2017-18లో రూ.1,44,000 అంటే సగటున రూ.3లక్షలకు మించి ఆదాయం లేదన్న విషయం మీ అఫిడవిట్ ద్వారా స్పష్టమైంది.2018లో రూ.1,44,000 ఆదాయం ఉన్న మంత్రి కుటుంబ సభ్యులు రెండేళ్ళలోనే కోట్ల రూపాయలు ఎలా గడించారు ? 2019లో 8 ఎకరాలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. 16 నెలల్లో 203 ఎకరాలు కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి?
అక్రమంగా భూములు కాజేయడమేకాకుండా బదలాయించుకున్న భూములపై వ్యవసాయ రుణాలు తీసుకునేందుకు కర్నూలు జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్న విషయం వాస్తవం కాదా? రాయలసీమలో పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మీరు ఏ పంటలు పండించి కోట్ల రూపాయలు గడించారు. మీరు గంజాయి పండించారా? లేక ఇంకా ఏదైనా పంట పండించారా ప్రజలకు సమాధానం చెప్పాలి. నామమాత్రపు ఆదాయం ఉన్న గుమ్మనూరు జయరాం ఒక్క రోజే 180 ఎకరాలు ఎలా కొన్నారు? మీతాత ఏమైనా మైసూరు మహారాజా?
కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించి భూములు బలవంతంగా రాయించుకున్న విషయం వాస్తవం కాదా? సీబీఐ విచారణ జరిగితే మంత్రి గుమ్మనూరు జయరాం తో పాటు ఇతర మంత్రుల భూ కబ్జాలు, భూ కుంభకోణాల బాగోతం బహిర్గతమవుతాయి. ఇతీనా ప్లాంటేషన్ కంపెనీ ఛైర్మన్, డైరెక్టర్లు అంతా మంజునాథ్ అనే వ్యక్తికి కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో కంపెనీకి ఉన్న భూములపై పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినట్లు సృష్టించిన తీర్మానం నకిలీది కాదా? ఈ ఫోర్జరీ తీర్మానంపై ఇతీనా యాజమాన్యం 5, మే 2020న ఫిర్యాదు చేయడంతో బెంగుళూరు కోరమండల్ పోలీస్ స్టేషన్ లో గుమ్మనూరు కుటుంబ సభ్యులపై కేసు కూడ నమోదు చేశారంటే మీ భూ కబ్జాల బాగోతాలతో పొరుగు రాష్ట్రాల్లో కూడా ఏపీ ప్రతిష్టకు మచ్చ తెస్తున్నారు.
ఆస్పరీలో కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో ‘నగదు లావాదేవీ’ అని రాసి కంపెనీ అకౌంట్ కు నగదు గానీ, డిడి గానీ, చెక్కు గానీ ఇవ్వకుండా నేరుగా వ్యక్తులకు నగదు చెల్లించామని పేర్కొనడంతోనే ఇది స్కాం అని తేలిపోయింది. ఇతీనా కంపెనీకి చెందిన భూమిని అక్రమంగా, దౌర్జన్యంగా మంత్రి కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నారన్న విషయం వాస్తవం. అధికార బలంతో అక్రమాలకు పాల్పడుతూ ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేశారు. మంత్రి గుమ్మనూరు జయరాం భూ దోపిడీలపై సమగ్ర విచారణ జరపాలి.