– పోలీసులకంటే ముందే సంకల్పసిద్ధి స్కామ్ పై సీఐడీకి ఫిర్యాదు అందినా, దేనికోసం ఎవరి ఆదేశాలతో, ఎవరిని కాపాడటానికి సీఐడీ ప్రేక్షకపాత్ర వహించిందో జవాబు చెప్పాలి
• స్కామ్ తాలూకా ఫిర్యాదులు పోలీసులకంటే ముందే సీఐడీకి వెళ్లాయని విజయవాడ సీపీ క్రాంతిరాణా టాటా నవంబర్ 28న చేసిన ప్రకటనపై సీఐడీ చీఫ్ ఏం సమాధానం చెబుతారు?
• స్కామ్ తాలూకా ఫిర్యాదు తొలుత సీఐడీలోని ఏ అధికారి వద్దకు వెళ్లిందో…ఇంకా సీఐడీలో ఎవరెవరు ఈ వ్యవహారంలో తలదూర్చారో నిగ్గుతేల్చాలి
• మూడున్నరేళ్లలో ప్రజలకు ఉపయోగపడే, వారికిమంచిజరిగే ఒక్క కేసైనా సీఐడీ చేధించిందా?
• సంకల్పసిద్ధి వంటి ఆర్థికనేరాలను అరికట్టి, అసలుదొంగల్ని శిక్షించాల్సిన సీఐడీ, కేవలం ప్రతిపక్షనేతల్ని వేధిస్తూ, అమాయకుల్ని బలిచేస్తూ, తాడేపల్లి ప్యాలెస్ కు ఊడిగం చేస్తోంది.
• క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (సీఐడీ) కాస్త తాడేపల్లి ప్యాలెస్ కుచెంచాగిరీ చేసే డిపార్ట్ మెంట్ గా మారిందని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం.
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
తెలుగురాష్ట్రాలతోపాటు, కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన సంకల్పసిద్ధి సంస్థ భారీ కుంభ కోణంపై పోలీస్ శాఖకంటే ముందే సీఐడీకి ఫిర్యాదుఅందినా, ఎందుకు స్పందించలేదని, దేనికోసం ఎవరిఆదేశాలతో, ఎవరిని కాపాడటానికి, తనకేమీ పట్టనట్టు సీఐడీ విభాగం ప్రేక్షకపాత్రకే పరిమితమైందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిలదీశారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“తెలుగురాష్ట్రాలతోపాటు కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘సంకల్పసిద్ధి’ కుంభకోణంపై ఏపీ సీఐడీ మౌనం వహించడం వెనకున్న ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నాను. సంకల్పసిద్ధి సంస్థ నిర్వాహకులు, ఎర్రచందనం మొక్కలుపెంచితే 12రెట్ల లాభమని, రియల్ ఎస్టేట్ వెంచర్లని, సంకల్పసిద్ధి మార్ట్ లపేరుతో దుకాణాల్లో తక్కువధరకే సరుకులని, గోల్డ్ స్కీమ్ అని చెప్పి ప్రజల్ని నిలువునా మోసగించారు. ఈ వ్యవహారం వెనుక కొడాలినాని, వల్లభనేని వంశీలయొక్క ప్రధాన అనుచరుల పాత్ర ఉందని ఇదివరకే మీడియాద్వారా రాష్ట్రప్రజలు గ్రహించడం జరిగింది.
నవంబర్ 28న విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణా టాటా సంకల్పసిద్ధి స్కామ్ కు సంబంధించి అరెస్ట్ చేసిన కంపెనీ నిర్వాహకుల్ని మీడియాముందు ఉంచి మాట్లాడినప్పు డు, సంకల్పసిద్ధి కుంభకోణానికి సంబంధించిన ఫిర్యాదులు పోలీసులకంటే ముందు ఏపీ సీఐడీకి వెళ్లాయని చెప్పారు. తమవిచారణలో స్కామ్ కు సంబంధించిన ఫిర్యాదులు, తమకంటే ముందే సీఐడీకి వెళ్లినట్లు తేలిందని, తరువాత ఏంజరిగిందో తమకు తెలియదని సీపీ మీడియావారితో పూర్తివివరాలు చెప్పకుండా దాటవేశారు.
సంకల్పసిద్ధిపై పోలీసులకంటే ముందే సీఐడీకి ఫిర్యాదు అందినా, విచారణ జరపకుండా ఎందుకు మౌనం వహించింది?
సీఐడీ బాస్ కు, ఆ విభాగానికి సంకల్పసిద్ధి స్కామ్ గురించి విచారించేంత తీరికలేదు. ముందే ఫిర్యాదు అందినా సీఐడీ ఎందుకు ఈ వ్యవహారంలో మౌనంగా ఉందని గతంలో తాను కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించి దాదాపు 10రోజులైనా సీఐడీ స్పందించలేదు. విజయవాడ సీపీ ఏదైతే చెప్పారో, దాని గురించే తాము సీఐడీ విభాగాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏ మీడియా సంస్థపై తప్పుడుకేసులు పెడదాం.. ఎవరిని తీసుకొచ్చి అక్రమంగా లోపలేద్దాం.. ఎవరిని మానసి కంగా హింసిద్దాం… ఎవరి గొంతునొక్కి ప్రభుత్వానికి ఊడిగం చేద్దామనే ఆలోచనల్లో సీఐడీ బిజీగా ఉంటుందిగానీ, కుంభకోణాల గురించి విచారిస్తుందా? సీఐడీ సకాలంలో స్పందించి ఉంటే, సంకల్పసిద్ధి కుంభకోణంలో ఇన్నివేల మంది పేదప్రజలు కోట్లరూపాయలు నష్టపోయి ఉండేవారు కాదు.
కొన్నికోట్లు పోగొట్టుకున్న సంకల్పసిద్ధి డిపాజిటర్లకు సునీల్ కుమార్ సమాధానం చెప్పాల్సిందే…
స్కామ్ పై ఫిర్యాదులు వచ్చినాకూడా ఏపీ సీఐడీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం? క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (సీఐడీ) యొక్క ప్రాథమిక కర్తవ్యం ప్రజల్ని మోసగించేవారిని కట్టడిచేయడం. ఆర్థికనేరాలను అదుపుచేసి, స్కాములకు తావులేకుండా చూడటం, తప్పులుచేసేవారిని కఠినంగా శిక్షిం చడం. కానీ అందుకు విరుద్ధంగా ఏపీ సీఐడీ విభాగం తాడేపల్లి ప్యాలెస్ పాలకుల సేవలో తరిస్తూ, స్కాములు, దోపిడీలు చేసేవారిని ఉపేక్షిస్తోంది అనడం ఎంతమాత్రం అతి శయోక్తి కాదు. సంకల్పసిద్ధి స్కామ్ కుసంబంధించి పోలీస్ శాఖకంటే ముందే ఫిర్యాదులువచ్చినా దానిపై ఎందుకు విచారించలేదో సీఐడీ చీఫ్ సమాధానం చెప్పాలి. కొన్నికోట్ల రూపాయలు పోగొట్టు కున్న సంకల్పసిద్ధి డిపాజిటర్లకు సునీల్ కుమార్ సమాధానం చెప్పాల్సిందే. తనశాఖలో ఏ అధికారివద్దకు సంకల్పసిద్ధి స్కామ్ ఫిర్యాదు ముందుచేరిందో? ఆ అధికారి ఏ పై అధికారి అండదండలతో ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడో? సీఐడీ శాఖలో మొత్తం ఎంతమంది సంకల్పసిద్ధి నిర్వాహకులతో మంతనాలు జరిపారో? ఏ రకమైన ప్రలోభాలకు వారు లొంగిపోయారనేదానిపై తక్షణమే సునీల్ కుమార్ మౌనంవీడి, సంకల్పసిద్ధి బాగోతంపై నోరువిప్పాలి. ఎవరిని కాపాడటంకోసం ఆయన ఇన్నాళ్లు చేతులుకట్టేసుకున్నాడో కూడా చెప్పాలి. చేతులు కట్టేసుకొని సీఐడీపరిధిలో ఎవరిని కాపాడటానికి ఆయన ప్రయత్నిస్తు న్నారో తెలియాలి.
మూడున్నరేళ్లలో సీఐడీ ప్రజలకు ఉపయోగపడే ఒక్క కేసు అయినా చేధించిందా?
మూడున్నరేళ్లలో సీఐడీ విభాగం ప్రజలకు ఉపయోగపడే మంచిపని ఒక్కటైనా చేసిందా? ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క కేసు అయినా పూర్తిచేసిందని సునీల్ కుమార్ నిరూపిస్తే, ఆయనకు సెల్యూట్ చేస్తాను. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోలేని దుస్థితిలో ఉన్నందుకు సీఐడీ చీఫ్ సిగ్గుతో తలదించుకోవాలి. తమవద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంఉందని చెప్పుకునే సీఐడీ, అదే పరిజ్ఞానం సాయంతో ఆర్థిక నేరస్తుల్ని ఎందుకు కట్టడిచేయలేకపోతోంది. సాంకేతిక పరిజ్ఞానం మెండుగా ఉన్నవారు తనకింద చాలామంది ఉన్నారని సీఐడీ బాస్ పదేపదే చెబుతుంటారు. అలాంటప్పుడు ఆ పరిజ్ఞానం సంకల్పసిద్ధి స్కామ్ సూత్రధారులు, పాత్రధారులను ఎందుకు కనిపెట్టలేక పోయింది? వారికి సంబంధించిన ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు సీఐడీ నేటికీ ఎందుకు పరిశీలించలేక పోయింది. ప్రజలకు ఉపయోగపడే, వారికి మంచిచేసే విషయాలకోసం సీఐడీ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించదా? కేవలం ఆ పరిజ్ఞానాన్ని అమాయకులపై కక్షసాధింపులకు మాత్రమే వినియోగిస్తుందా?
సంకల్పసిద్ధి స్కామ్ తాడేపల్లి ప్యాలెస్ కు తెలిసే జరిగింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ కాస్త తాడేపల్లి ప్యాలెస్ కుచెంచాగిరీ చేసే డిపార్ట్ మెంట్ గా మారిందని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. చంద్రబాబునాయుడు గారి హాయాంలో ఏపీ పోలీస్ హోదా, గౌరవం ఎలా ఉండేవి.. ఇప్పుడెలా ఉన్నాయో పోలీస్, సీఐడీ విభాగాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తక్షణమే సంకల్పసిద్ధి స్కామ్ వ్యవహారంపై సీఐడీ మౌనానికి గల కారణాలేంటో, విషయం తమదృష్టికి వచ్చినా మౌనం వహించిన ఆ అధికారులెవరో, దేనికోసం ఏంఆశించి, వారు మౌనం దాల్చారో లోతైన విచారణద్వారా కనిపెట్టాలి ” అని పట్టాభి డిమాండ్ చేశారు.