• తుపానుతో దెబ్బతిన్న రైతుల్ని ఆదుకోవడం చేతగాని కాకాణి, వ్యవసాయం తెలియని ముఖ్యమంత్రే ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం
• చంద్రబాబు టైమ్ లో కరువు, జగన్ వచ్చాక వర్షాలని మంత్రి చెప్పడం సిగ్గుచేటు
• మూడేళ్లు వర్షాలుండికూడా రాష్ట్ర రైతాంగం ఏం బాగుపడింది?
• జగన్ హాయాంలో రైతులుబాగుంటే, రైతుఆత్మహత్యల్లో రాష్ట్రం 3వస్థానంలో ఎందుకుంది కాకాణి?
• 2020లో 161 మండలాలు కరవుబారినపడి, 73మండలాలు తీవ్ర దుర్భిక్షంతో కొట్టుమిట్టాడిన విషయం మంత్రికి తెలియదా?
• ప్రభుత్వం తక్షణమే తడిచిన, రంగుమారిన ధాన్యాన్నికొని, సకాలంలో రైతులకు డబ్బులివ్వాలి
• వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మిరప, ఇతర వాణిజ్యపంటల వివరాలు సేకరించి, తక్షణమే రైతుల్ని ఆదుకోవాలి
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
తుపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వరి, పత్తి, మిరప, ఇతర వాణిజ్యపంటలు ఘోరంగా దెబ్బతిని రైతులంతా దిక్కుతోచక విలపిస్తుంటే, కరువు కహానీలుచెబుతూ, మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి పనిగట్టుకొని మరీ టీడీపీఅధినేతపై విమర్శలుచేస్తూ, సమస్యల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. జూమ్ ద్వారా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు… ఆయన మాటల్లోనే …
“మాండౌస్ తుపాన్ ధాటికి రాష్ట్రరైతాంనికి తీవ్రమైన నష్టంవాటిల్లితే, నష్టనివారణ చర్యలు చేపట్టకుండా, వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వ్యవసాయమంత్రి కరువు కహానీలు చెబుతూ కాలయాపన చేస్తున్నాడు. చంద్రబాబు టైమ్ లో కరువు, జగన్ వచ్చాక వర్షాలే వర్షాలని మంత్రి వాగుతున్నాడు. జగన్ రెడ్డే రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయానికి పట్టిన పెద్ద దరిద్రం.
మంత్రిది మిడిమిడి జ్ఞానమని ఆయన మాటల్లోనే అర్థమవుతోంది
2020లో రాష్ట్రంలో 161 మండలాల్లో కరువు వచ్చిన విషయం మంత్రికి తెలియదా? 73 మండలాలు తీవ్రదుర్భిక్షాన్ని ఎదుర్కొన్నాయన్న వాస్తవం కాకాణి విస్మరించారా? రాష్ట్రంలో మూడేళ్లు వర్షాలున్నా కూడా రాష్ట్ర రైతాంగం ఏం బాగుపడిందో మంత్రి చెప్పాలి. జగన్ రెడ్డి పాలనప్రారంభం కాగానే రాష్ట్ర రైతాంగం, వ్యవసాయరంగం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. టొమాటో రైతులు కిలో రూపాయికి కూడా కొనడంలేదని గిట్టుబాటుధరకోసం రోడ్డెక్కారు. వైసీపీ ప్రభుత్వ చట్టాలతో ఆక్వారైతులు లబోదిబోమంటున్నారు.
తుపాను దెబ్బకు పొలాల్లోఉన్న వరితోపాటు, కోసిన వరికూడా నేలపాలైంది. ధాన్యపురాశులు నీళ్లలో తేలియాడుతున్నాయి. మిరప, పత్తిపంటలు దెబ్బతినడమేగాక, వాణిజ్యపంటలు నేలకొరిగాయి. గోదావరి జిల్లాల్లో 40వేలటన్నుల ధాన్యపురాశులపై తుపాను ప్రభావం చూపింది. ఆ జిల్లాల్లో ఇప్పటికీ లక్షఎకరాల్లో వరికోతలు ఇంకా పూర్తికాలేదు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వరినారుమళ్లు దెబ్బతిన్నాయి. మరలా రైతులు దుక్కిదున్ని వరినారుమళ్లు పోయాల్సిన పరిస్థితి. ఆక్వారైతులకు జరిగిన నష్టం అంతా…ఇంతాకాదు. రొయ్యలు వైరస్ బారిన పడే ప్రమాదం ఏర్పడింది. మాండౌస్ తుపాన్ తో రాష్ట్రవ్యాప్తంగా రైతాంగానికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తక్షణమే లెక్కకట్టి, మీనమేషాలు లెక్కించకుండా అన్నదాతల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
జగన్ హయాంలో రైతులు సంతోషంగా ఉంటే, రైతుఆత్మహత్యల్లో ఏపీ 3వస్థానంలో ఎందుకుంది కాకాణి?
గతంలో చంద్రబాబు హాయాంలో రైతుఆత్మహత్యల్లో రాష్ట్రం 6, 5, 4, స్థానాల్లో ఉంటే, రాజశేఖర్ రెడ్డి రాగానే 2వ స్థానానికి వచ్చింది. అలానే 2014లో చంద్రబాబుగారి పాలనలో రైతుఆత్మహత్యల్లో రాష్ట్రం 8వస్థానంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇప్పుడు 3 వస్థానానికి చేరింది. ఆత్మహత్యల్లో రాష్ట్రం ముందునిలవడమేనా జగన్ రెడ్డి సాధించిన వ్యవసాయప్రగతి? జగన్ హాయాంలో కౌలురైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం 2వస్థానంలో ఎందుకుందో సమాధానం చెప్పు కాకాణి?
2017లో తెలంగాణలో 846 మంది రైతులుఆత్మహత్య చేసుకుంటే, 2021లో 350 మంది చనిపోయారు. టీడీపీప్రభుత్వంలో 2017లో 300మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ సంఖ్య 2019లో 628కి చేరింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రతిరైతుపై తలసరి అప్పు, రూ.2.50లక్షలకు చేరింది. దేశంలో సగటున ప్రతిరైతుపై రూ.75వేల అప్పుమాత్రమే ఉంది. రైతు ఆత్మహత్యల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానానికి చేరబోతోందని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. 2007లో రాజశేఖర్ రెడ్డిహాయాంలో 1800 మంది రైతులు చనిపోతే, 1998-2004 మధ్యకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో 1519 రైతు ఆత్మహత్యలు పెరిగాయని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో పేర్కొంది.
డ్రిప్ ఇరిగేషన్ పై 70శాతంగా ఉన్న సబ్సిడీని చంద్రబాబుప్రభుత్వం 90శాతానికి పెంచడాన్ని ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రముఖంగా ప్రస్తావించింది. 2018లో మైక్రోఇరిగేషన్ లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. యంత్రాలు, యంత్రపరికరాలు, ఇతరత్రా రైతు ఉపకరణాలకోసం టీడీపీప్రభుత్వం 2018లో రూ.650కోట్లు ఖర్చుచేసింది. అదే ఏడాది మైక్రో ఇరిగేషన్ కోసం రూ.1250కోట్లు ఖర్చుచేశాము. నేను మంత్రిగా ఉన్నప్పుడు రైతులకోసం సూక్ష్మపోషకాలు ఉచితంగా అందించడం జరిగింది.
ధాన్యం రైతులకు జగన్ ప్రభుత్వం చేస్తున్న నష్టం అంతా ఇంతాకాదు…
ధాన్యం రైతులు రాష్ట్రంలో ఎన్నివేలకోట్లు నష్టపోతున్నారో ప్రభుత్వానికి తెలుసా? 2020-21లో ఖరీఫ్, రబీ సీజన్లుకలిపి 84లక్షల టన్నుల ధాన్యం సేకరించిన ప్రభుత్వం, 2021-22లో 66లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దానికితోడు తరుగుపేరుతో అదనంగా రైతుల్ని దోపిడీచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 2020-21లో కోటి41లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, 2021-22లో లక్షా19వేల టన్నులు సేకరించింది. రెండు సంవత్సరాల్లో ఏపీకంటే తెలంగాణ అదనంగా 60లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. తరుగుపేరుతో రైతుల్ని వైసీపీప్రభుత్వంలా దోచుకోలేదు. ధాన్యంకొన్న వెంటనే మూడురోజులకే రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తోంది.
తెలంగాణతో పోలిస్తే ఏపీ రైతులకు చేస్తున్నది శూన్యం. ప్రతిరైతుకి రూ.7వేలిస్తున్నామని గొప్పలు చెబుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, ధాన్యం కొనుగోళ్లలో ఎందుకింత వెనుకబడింది? నెల్లూరు జిల్లాలో 6, 7 నెలలు అవుతున్నా ధాన్యంరైతులకు డబ్బులివ్వలేదు. టీడీపీ హాయాంలో ధాన్యం రైతులకు వారంలోనే డబ్బులుచెల్లించాము. క్వింటాల్ వరికి నెల్లూరులో గిట్టుబాటుధరతో పనిలేకుండా రూ.210 అదనంగా చెల్లించాము. ధర తగ్గిందని మిరపకు క్వింటాల్ కు రూ.1500 మధ్ధతుధర చెల్లించాము. మద్ధతు ధర విషయంలో టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఈ ప్రభుత్వంలో ఎకరా వరిసాగుకి అదనంగా రూ. 12 నుంచి రూ.13వేల పెట్టుబడి పెరిగింది. వరిరైతు ఆదాయం మాత్రం దారుణంగా తగ్గింది.
టీడీపీ ప్రభుత్వం రైతులకు ఉచితంగా మోటార్లు ఇస్తే, జగన్ వచ్చాక ఎందుకివ్వలేదు?
టీడీపీ ప్రభుత్వం రైతులకు సోలార్ పథకం కింద ఉచితంగా ఐఎస్ఐ గుర్తింపున్న మోటార్లు అందించింది. విద్యుత్ శాఖే స్వయంగా పాతమోటార్లు తీసేసి, కొత్తమోటార్లు అందించింది. 2021-22లో పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో 50వేల సౌరవిద్యుత్ మోటార్లు రైతులకు బిగించాల్సి ఉంటే, ఒక్కటీ బిగించలేదు. రూ.220కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందని, జగన్ ప్రభుత్వం రూ.450కోట్ల వరకు రైతులకు దక్కాల్సిన ప్రయోజనాన్ని నిర్వీర్యంచేసింది. ఇంతకుముందు వ్యవసాయమంత్రిగా ఉన్న కన్నబాబుగానీ, ఇప్పుడున్న కాకాణి గోవర్థన్ రెడ్డి గానీ ఏనాడైనా రైతుకష్టం గురించి ఆలోచించారా? ఎప్పుడైనా సరే వారు రైతులకళ్లాల్లోకి వెళ్లి, వారితో మాట్లాడారా? ఆక్వా రైతుల్ని పలకరించారా?
తుపాన్ వల్ల దెబ్బతిన్న రైతాంగం వద్దకు మంత్రి ఎందుకు వెళ్లడంలేదు? భయంతో వెనకడుగు వేస్తున్నారా? 2015లో నెల్లూరుజిల్లాలో భారీవరదలు వస్తే, తాను చెరువుకట్టలపై రైతులతోనే ఉన్నాను. తిరుపతిలో సభ పెడితే మాపై తప్పుడుకేసులు పెడతారా? నిరసన తెలిపే హక్కుకూడా మాకులేదా? రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ల హాయాంలోగానీ, అంతకుముందు గానీ ప్రజలకోసం ఎన్నిధర్నాలుచేసినా ప్రతిపక్షనేతలపై ఒక్కకేసు లేదు. ఈ ప్రభుత్వం మాత్రమే ఎందుకింతలా ప్రతిపక్షనేతలపై నిర్బంధాలు అమలుచేస్తోంది? ప్రతిపక్షనేతలపై తప్పుడుకేసులు పెట్టడం దుర్మార్గం. రైతుల ఉసురు తగలకముందే జగన్ వారిని ఆదుకోవాలి” అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.