– టీచర్లను అవమానించిన ప్రవీణ్ ప్రకాష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి
– మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ
ఉపాధ్యాయులను ప్రభుత్వం అడుగడుగున వేధిస్తోందని, ఉపాధ్యాయులను అవమానంపాలుచేసిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ప్రవీణ్ ప్రకాష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ కోరారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు ..
జగన్ నాయకత్వాన విద్యారంగం ఉనికిని కోల్పోయే స్థితికి వచ్చింది
జగన్ నాయకత్వాన విద్యారంగం క్రమేపి తన ఉనికిని పూర్తిగా కోల్పోయే స్థితికి వచ్చింది. అందుకుగాను తిలాపాపం తలా పిడికెడు అన్న చందాన ప్రభుత్వ పెద్దలు, అధికారులు తమ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీనే దీనికికారణం. ప్రభుత్వానికి విద్యా విధానం పట్ల అవగాహన లేదు, అస్తవ్యస్తంగ విద్యా రంగాన్ని తయారు చేశారు. రాష్ట్రంలో విద్యా రంగాన్ని అన్ని రంగాలుగా భ్రష్టు పట్టించారు. తెలుగు మీడియం వద్దు, ఇంగ్లీష్ మీడియం కావాలి అని117 జీవో తీసుకు రావడం బాధాకరం.
కరోనా సమయంలో ప్రభుత్వం అనుసరించిన తీరువల్ల అనేకమంది నష్టపోయారు. ప్రభుత్వం విద్యా పథకాలను అమలు పరుస్తున్న వైనం దయనీయం. విద్యారంగం దేశంలోనే అత్యంత అథమ స్థాయికి పడిపోయింది. కొత్తగా వచ్చిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ప్రవీణ్ ప్రకాశ్ చర్యలు టీచర్లను అవమానపరచే విధంగా ఉన్నాయి. ఉపాధ్యాయుల స్థానం చాలాగొప్పదని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ప్రవీణ్ ప్రకాశ్ గ్రహించాలి. ప్రవీణ్ ప్రకాశ్ కూడా ఒక టీచర్ ద్వారానే ఈ స్థాయికి ఎదిగినట్లు తెలుసుకోవాలి. ప్రవీణ్ ప్రకాశ్ స్కూళ్లను విజిట్ చేయడంలో అర్థం ఏమిటి? విజిట్ చేయాల్సిన అవసరమేమొచ్చింది? విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ముఖ్యమంత్రి తరవాత ప్రిన్సిపల్ సెక్రటరినే ముఖ్యమంత్రి. అంతటి వ్యక్తి సూపర్ వైజింగ్ పేరిట స్కూళ్లకు వెళ్లడమేంటి? ఒక ప్రిన్సిపల్ సెక్రటరి ఈ విధంగా స్కూళ్లకు వెళ్లి టీచర్లను వేధించడం అసమంజసం. ప్రైమరీ స్కూల్స్ కి సూపర్ వైజింగ్ చేయడానికి ఒక నెట్ వర్క్ ఉంది.
ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ లు ఉన్నారు. హైస్కూల్స్ కి మూడు జిల్లాలకు కలిపి ఒక ఆర్జేడీ ఉంటాడు. డీఈవో ఉన్నాడు. వీరు విజిట్ చేస్తుంటారు. ఏవిధంగా పాఠాలు చెబుతున్నారు అనేది చూడాల్సిన బాధ్యత వారిది. అడ్మినిస్ట్రేటివ్ సూపర్ వైజింగ్ చేస్తారు. మోటివేట్ చేయడానికి సిబ్బంది ఉండగా మీకేం సంబంధం? ఆఫీసు వదలిపెట్టి వెళ్లడమేంటి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కోసం చాలా మంది ఆఫీసుకు వస్తారు. వారు అక్కడ ఉండాలి. అలాంటిది గాలికి వదిలేసి బయట స్కూళ్ల మీద పడి మీ వర్క్ బుక్ మీద సంతకంలేదని, అదిలేదని, ఇది లేదని వారికి నోటీసులివ్వడం, వారిని సస్పెండ్ చేయడం, వారిని బెదిరించడం సమంజసంకాదు. ఒక ప్రిన్స్ పల్ సెక్రటరిగా టీచర్స్ ని మోటివేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. పాజిటివ్ సజేషన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ సెక్రటరికి ఉంటుంది. సీనియర్ స్థాయి టీచర్ ని మీ కుర్చీలో కూర్చోబెడితే చక్కగా విధులు నిర్వర్తిస్తాడు.అయితే ఒక సీనియర్ ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పినట్లు ప్రిన్సిపల్ సెక్రటరి పాఠాలు చెప్పగలరా? చెప్పలేరని ఛాలెంజ్ చేస్తున్నాను. టీచింగ్ లో ఏ విధమైన ప్రిన్సిపుల్స్ పాటించాలో తెలియని వ్యక్తి ప్రిన్సిపల్ సెక్రటరి ప్రవీణ్ ప్రకాశ్.
టీచర్లు సర్టిఫికెట్లు కొనుక్కోలేదు.. కష్టపడి టీచర్లయ్యారు
టీచర్లు సర్టిఫికెట్లు కొనుక్కోలేదని.. సంవత్సరంపాటు థీయరీ చదివి హైస్కూల్ లో ట్రైనింగ్ పొంది, టీచింగ్ ప్రాక్టీస్ చేసి వారు టీచర్ లు అయ్యారనే విషయాన్ని ప్రవీణ్ ప్రకాశ్ గ్రహించాలి. గౌరవప్రదమైన టీచింగ్ వృత్తిలో ఉన్నవారిని వేధింపులకు గురిచేయడం అన్యాయం. వారిని మానసికంగా ఒత్తిడికి లోను చేస్తున్నారు. ఇలాచేస్తే వారు చెప్పే పాఠాల్లో ప్రామాణికం లోపిస్తుంది. ఆమాత్రం మినిమమ్ కామెన్ సెన్స్ ప్రవీణ్ ప్రకాశ్ కు లేకపోవడం బాధాకరం. నేడు వర్క్ బుక్ లు ఎన్ని స్కూళ్లకు అందాయో తెలపాలి.
అనేక స్కూళ్లకు ఇంతవరకు వర్క్ బుక్ లు అందలేదు. టెక్స్ట్ బుక్ లు సకాలంలో ఇవ్వలేదు. వర్క్ బుక్ లు పూర్తి చేశారా అని అడగడంలో అర్థంలేదు. 117జీవో తెచ్చి 3,4,5 తరగతులను హైస్కూళ్ళలో కలిపారు. ఆ విద్యార్థులు 3 కిలోమీటర్లు వెళ్లి పాఠాలు అభ్యసించాల్సిన పరిస్థితి కల్పించారు. దీంతో టీచర్ల కొరత ఏర్పడింది. ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం మెగా డీఎస్సీ వేస్తాము, టీచర్ల కొరత లేకుండా చూస్తామని చెప్పి మాటతప్పి మడమతిప్పారు. మోడల్ స్కూల్స్ లలో ఉన్న టీజీటీస్ ని ఎస్జీటీలుగా కన్వర్ట్ చేశారు. 10 వేల ఎయిడెడ్ స్కూల్స్ లోని టీచర్స్ ని తీసేశారు. నేడు రాష్ట్రంలో దాదాపు 50 వేల ఉపాధ్యాయుల కొరత ఉంది. ఒక్కో ఉపాధ్యాయుడు వారానికి 36 పీరియడ్ లు చెప్పాలి. మిడ్ డే మిల్స్, గుడ్లు, టాయిలెట్స్ ఫొటోలు అప్ లోడ్ చేయడం, ఫారాలు పూర్తి చేయడం, నాడు నేడు పనులు చేయడం ఈ భారమంతా ఉపాధ్యాయులపై పడ్తోంది. కరోనా కాలంలో కూడా నాడు నేడు పనులు పూర్తి చేయమన్నారు. కరోనా సమయంలో కూడా స్కూళ్లకు రావాల్సిందే అనడంతో వెళ్లి వందలాదిమంది టీచర్లు చనిపోయారు.
ప్రిన్సిపల్ సెక్రటరి అనవసరంగా ఢిల్లీ వెళ్లి ప్రజాధనం వృధా
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి ప్రవీణ్ ప్రకాశ్ బ్యుజినెస్ క్లాసుల్లో ప్రతి వారం ఢీల్లీ వెళ్తారు. ఒక్కోసారికి 50వేలు చొప్పున నెలకు 2 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇంత ఖర్చు చేస్తుండడు. మీ జీతం కాకుండా ఈ మోతాదులో ప్రజా ధనం ఖర్చు చేయడమేంటి? ఢిల్లీ వెళ్లి అక్కడ రెండు రోజులు ఉండి ఏం చేస్తున్నారు? ప్రవీణ్ ప్రకాశ్ కు ఎమ్మెల్యే, ఎంపీ కావాలనే కోరిక ఉన్నట్లు అనేక టీవీ ఛానళ్లల్లో వస్తోంది. చాలమంది తన తోటివారు మంత్రులు అయ్యారు.. నేనెందుకు కాకూడదని ప్రవీణ్ ప్రకాశ్ మనసులో ఉన్నటుంది. విద్యాశాఖ అధికారులపై అధికారం చలాయించాలని చూస్తున్నారు. ఉపాధ్యాయులందరూ ఆయనకు మోకరిల్లాలనుకుంటున్నారు. సంవత్సరం క్రితం ఛీఫ్ సెక్రటరి సుబ్రమణ్యంను పంపించడంలో కూడా ప్రవీణ్ ప్రకాశ్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. డీఏ, ఫిట్ మెంట్ విషయంలో ఉపాధ్యాయులకు అన్యాయం చేశారు. ఉపాధ్యాయులు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టినప్పటి నుంచి ఉపాధ్యాయుల వేధింపులు ప్రారంభమయ్యాయి.
ప్రవీణ్ ప్రకాశ్ లాంటివారు అధికారంలో ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ
అందరికంటే లేటుగా టీచర్లకు జీతాలిస్తున్నారు. డ్రాపవుట్ ల సంఖ్య పెంచుతున్నారు. ప్రవీణ్ ప్రకాశ్ లాంటివారు ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఖాళీ అవుతాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో టీచర్లు ధర్నా చేస్తారు. ఇది ప్రభుత్వానికి చాలా నష్టం చేకూరుస్తుంది. ప్రవీణ్ ప్రకాశ్ కు వేధించడమనే రోగమున్నట్లుంది. కోపమొస్తే ఇంటర్నెట్ చూడు, ఎంటర్ టైన్ మెంట్ పొందు అంతేగానీ ఉపాధ్యాయులను మాత్రం వేధించవద్దు. ప్రవీణ్ ప్రకాశ్ ను ఎంత త్వరగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి పదవి నుంచి తొలగిస్తే అంత మంచిదని జగన్ ను కోరుతున్నాను. అప్పుడే విద్యారంగానికి మేలు జరుగుతుంది. జగన్ చెడ్డపేరు తొలగించుకున్నవారవుతారు. ఉపాధ్యాయుల్లో నెలకొన్న భయం, ఒత్తిడిని తొలగించాలి. అప్పుడే టీచర్లు స్వేచ్ఛగా పాఠాలు చెప్పగలరని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.