– పొమ్మనలేక ‘కమలం’ పొగ
– కండువాలప్పుడే నేతల కళకళ
– తర్వాత తప్పని తిప్పలు
– బాధ్యతలు అప్పగించని బీజేపీ బాసులు
– బయటనుంచి వచ్చిన వారికి బాధలే
– పాతుకుపోయిన పాతనేతలు
– ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేశారా?
– వారంతట వారే వెళ్లే వ్యూహం
– అందుకే కమలవనంలో వికసించని వలస నేతలు
– బీజేపీ మైండ్‌సెట్ తెలియక చేరుతున్న నేతలు
– సీనియర్లను సొంతం చేసుకోవడంలో బీజేపీ విఫలమవుతోందా?
– అందుకే వలస నేతల పీఛేముడ్
( మార్తి సుబ్రహ్మణ్యం)
నాగం జనార్దన్‌రెడ్డి.. మోత్కుపల్లి నర్శింహులు.. కన్నా లక్ష్మీనారాయణ.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. రావెల కిశోర్‌బాబు.. డాక్టర్ పరకాల ప్రభాకర్.. వీరంతా వారి వారి రంగాల్లో ప్రముఖులు. వీరిలో ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలినవారంతా మంత్రుల స్థాయిలో పనిచేసిన నాయకులు. నాగం, మోత్కుపల్లి, కన్నా లాంటివాళ్లు అనేకసార్లు మంత్రులుగా పనిచేసిన మాస్ లీడర్లు. మరి ఇలాంటి అగ్రనేతలు ఇతర పార్టీలో చేరితే, వారికి ఏ స్థాయిలో గౌరవం దక్కాలి? వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి?
తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో తప్ప, జనంలో పెద్దగా బలం లేని బీజేపీ లాంటి జాతీయ పార్టీలో చేరితే వారి ప్రభ వెలిగిపోవాలి కదా?! మరి అందుకు భిన్నంగా మసకబారిందెందుకు? బీజేపీలో చేరే ఇతర పార్టీ ప్రముఖులకు గౌరవంతోపాటు, బాధ్యతలెందుకు దక్కడం లేదు? వారిని బీజేపీ రాష్ట్ర నేతలు ఎందుకు ఓన్ చేసుకోవడం లేదు? బయటనుంచి వచ్చిన వారికి గౌరవ ం ఇవ్వాలని అమిత్‌షా అరడజనుసార్లు చెప్పినా, అందుకు భిన్నంగా ఎందుకు జరుగుతోంది? ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఊపిరాడక ఎందుకు బయటకొస్తున్నారు? బీజేపీ సిద్ధాంతాలను వలస నేతలు అర్ధం చేసుకోలేకపోతున్నారా? పోనీ బీజేపీ సిద్ధాంతాలు వంట పట్టించుకోవాలంటే, దానికి ఎన్నేళ్ల సమయం పడుతుంది? పార్టీలో చేరిన వలస నేతలు.. తమ పూర్వ హోదాలను మర్చిపోలేక, దానిని పార్టీ నుంచి కోరుకుంటున్నారా? కండువా కప్పేసుకున్న రోజున ఉన్న ఆనందం తర్వాత ఎందుకు ఆవిరవుతోంది? పాతవారు పార్టీని ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చేస్తున్నారా? అసలు కమలంలో ఏం జరుగుతోంది?
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలం తక్కువ. తెలంగాణలో పోరాటాల ఫలితంగా, ఇప్పుడిప్పుడే కమలం వికసిస్తుంటే, ఏపీలో రోజు రోజుకూ వాడిపోతోంది. నిజానికి ఏపీలో తొలి నుంచీ బీజేపీ బలం బహు తక్కువ. పెద్ద నేతలకు కొదవలేకపోయినా, కార్యకర్తలే కరువు. అంతా లిమిటెడ్ వ్యవహారమే. అంతకుమించి ఎదగాలని, విస్తరించాలని కూడా కోరుకోరు. పట్టణ స్థాయి నుంచి, జాతీయ స్థాయి వరకూ చూసినా అంతా వారే అనేక పదవుల్లో కనిపిస్తుంటారు.
ఇతర పార్టీల నుంచి ఎవరినీ రానివ్వరు. వచ్చిన వారికి గౌరవం ఇవ్వరు. వేదికలపైకి పిలవరు. కార్యక్రమాల సమాచారం ఇవ్వరు. బాధ్యతలు అప్పగించరు. విసిగి వేసారి, వారంతట వారే నిష్ర్కమించాల్సిందే.అయితే ఈ పరిణామాలను ఢిల్లీ పార్టీకి, మరొక కోణంలో చూపిస్తారు. ‘ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు మన పార్టీలో ఇమడలేరు. మీరేమో మాలాంటి వారిని విస్మరించి, బయటనుంచి వచ్చిన వారిని నెత్తికెత్తించుకుంటారు. చివరకు ఉండేది మేము మాత్రమే’ అని సూత్రీకరిస్తారు.
ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని ఎప్పుడూ కోరుకోరు. కేంద్రంలో అధికారంలో ఉండాలి. రాష్ట్రంలో పొత్తులు పెట్టుకుని, పార్టీ ఎదగకూడదన్నదే వారి సిద్ధాంతం. ఎన్నికల్లో పోటీ చేస్తే చందాల పుణ్యాన నాలుగురాళ్లు వెనుకేసుకుని, ఐదేళ్లూ బతికేయచ్చన్న ఆశ. అందుకే ఆంధ్రాలో బీజేపీ ఎదగలేక చతికిలపడింది. సొంతగా ఎదగాలన్న లక్ష్యం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. ఆంధ్రా-తెలంగాణ బీజేపీలో దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది.
కాకపోతే బండి సంజయ్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత, బీజేపీ అధికారం లోకి రావాలన్న తపన, పట్టుదల కనిపిస్తోంది. ఆ ఒక్క అంశంలో తప్ప, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి విషయంలో రెండు రాష్ట్రాల్లోనూ ఇలాంటి దయనీయ పరిస్థితే కనిపిస్తోంది.
ఓవైపు అమిత్‌షా లాంటి అగ్రనేతలు ‘ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకోండి. వారిని గౌరవించండి. బాధ్యతలు అప్పగించండి. పార్టీలో మేమే ఉండాలనుకుంటే కుదరదు. బయట నుంచి నాయకులు రావాల’ని స్పష్టం చేస్తుంటారు. కానీ రాష్ట్ర నాయకత్వాలు, వారిని మార్గదర్శనం చేసే సంఘటనా మంత్రులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు.
తెలంగాణలో సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్న నేత. మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలను దశాబ్దాల పాటు కంటిచూపుతో శాసించారు. అంత సీనియర్ నేత బీజేపీలో చేరితే, ఆయనకు మిగిలింది అవమానాలే. ప్రెస్‌మీట్‌కు పార్టీ ఆఫీసులో అనుమతి లేకపోతే, ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్లు పెట్టాల్సిన దుస్థితి కల్పించారు. పార్టీ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వ పోగా, వేదికలపైనా స్థానం కల్పించలేని అవమానం. దానితో విసిగి వేసారిన నాగం కాంగ్రెస్‌లో చేరిన వైనం.. బీజేపీ మార్కు రాజకీయానికి ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.
టీడీపీలో ఫైర్‌బ్రాండ్, ఎన్టీఆర్ హయాంలోనే మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్శింహులుకూ అదే అవమాన పర్వం. పార్టీలో చేరిన ఆయనకు నెలలపాటు ఎలాంటి బాధ్యత అప్పగించలేదు. వేదికలపైకి పిలవని అవమానం. దానితో చాలాకాలం ఓపిక పట్టిన మోత్కుపల్లి, చివరాఖరకు బీఆర్‌ఎస్‌లో చేరాల్సి వచ్చింది. ఒకరకంగా బీజేపీ నాయకత్వమే ఆయనను బీఆర్‌ఎస్‌లో చేరాల్సిన అనివార్యతను కల్పించింది.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మండలి చైర్మన్ స్వామిగౌడ్, బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌పై విమర్శనాస్ర్తాలతో నిత్యం మీడియాలో కనిపించే దాసోజు శ్రవణ్, భిక్షమయ్యగౌడ్‌తోపాటు మరికొందరు.. మళ్లీ బీఆర్‌ఎస్‌కు వెళ్లేంత వరకూ బీజేపీ నాయకత్వం నిద్రపోలేదు. వీరందరినీ పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. వారు పార్టీ నుంచి నిష్ర్కమించేంతవరకూ, ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవడం విశేషం.
ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌తోపాటు, ఇతర పార్టీల నుంచి వచ్చిన మరికొందరి పరిస్థితీ అదే. చివరకు ఫైర్‌బ్రాండ్ విజయశాంతి సైతం, తనను పార్టీ పట్టించుకోవడం లేదని మీడియా సమక్షంలో వాపోయిన దుస్థితి. ఇతర పార్టీల్లో ఒక వెలుగు వెలిగి బీజేపీలో చేరిన వారంతా, ఇప్పుడు పార్టీలో ఎందుకు చేరామా అని తలపట్టుకోవలసిన విషాదం. ప్రత్యామ్నాయం లేక బీజేపీలో చేరిన తెలంగాణ నేతలకు ఇదో గుణపాఠంగా మారింది.
ఇక ఆంధ్రాలో అయితే ఇంతకుమించిన విషాదం. కాంగ్రెస్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన సీనియర్ నే త కన్నా లక్ష్మీనారాయణ తాజా నిష్ర్కమణ .. బీజేపీ మార్కు అంతర్గత రాజకీయాలకు పరాకాష్ఠ. తొలుత జాయినింగ్ కమిటీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన కన్నాకు, మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికలకు 10 నెలల ముందు అధ్యక్ష పదవి ఇచ్చారు. 175 స్థానాల్లో అభ్యర్ధులు దొర కని బీజేపీకి, మూడు, నాలుగు చోట్ల మినహా అభ్యర్ధులను నిలబెట్టారు. పార్టీకి సంబంధించి అదొక సాహసం కిందే లెక్క.
కన్నా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైసీపీపై చేసిన పోరాటాలు చూసి, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా ఖంగుతింది. ఒక దశలో టీడీపీ నుంచి భారీ స్థాయిలో బీజేపీలో చేరికలకు రంగం సిద్ధమయింది. అయితే ఆ కీలక సమయంలో కన్నాను అధ్యక్ష పదవి నుంచి తప్పించి, సోము వీర్రాజుకు అప్పగించారు. కన్నాను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించినప్పటికీ, రాష్ట్ర నాయకత్వం ఆయనను పట్టించుకోవడం మానేసింది. సోము అధ్యక్షుడయ్యాక, కన్నా హయాంలో ఉన్న జిల్లా అధ్యక్షులను తొలగించడం, ఆయనను అవమానించినట్టయింది. ఇంత జరుగుతున్నా.. సంఘటనా మంత్రి మధుకర్‌రెడ్డిలో చలనం లేదు. జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రెండుసార్లు కన్నాతో మాట్లాడినప్పటికీ, ఎలాంటి హామీ లభించలేదు.
రాష్ట్ర పార్టీలో నలుగురైదుగురు వైసీపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారన్న విమర్శలకు తెరదించే ప్రయత్నం, జాతీయ నాయకత్వం కూడా చేయలేదు. సోము నాయకత్వ తీరుపై అసంతృప్తితో ఉన్న కన్నాను, తమ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ-జనసేన సిద్ధంగా ఉన్నాయన్న సమాచారం ఉన్నప్పటికీ, ఆయనను నిలువరించే ప్రయత్నాలు చేయకపోవడమే ఆశ్చర్యం. చివరాఖరకు కన్నా పార్టీ నుంచి నిష్ర్కమించాల్సిన పరిస్థితిని కల్పించారు.
ఇక మాజీ మంత్రి, దళిత నేత రావెల కిశోర్‌ను కూడా.. రాష్ట్ర నాయకత్వమే పార్టీ నుంచి వెళ్లేలాచేసిందన్న విమర్శలున్నాయి. గతంలో పరకాల ప్రభాకర్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా అప్పటి నేతల రాజకీయాల కారణంగానే, విసిగి వేసారి బీజేపీనుంచి నిష్ర్కమించాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
ఇదిలాఉండగా జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధీశ్వరి, ఎంపీ సీఎం రమేష్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, మాజీ ఎంపీ టిజి వెంకటేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వంటి ప్రముఖులకు.. సోము నాయకత్వం, పెద్దగా గౌరవం ఇవ్వడం లేదు. దానితో వారు పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు.
ఏపీ బీజేపీ సంఘటనా మంత్రి మధుకర్‌రెడ్డి, కో ఇన్చార్జి సునీల్ దియోధర్ వైఫల్యాలే పార్టీ ప్రస్తుత దుస్థితికి కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నా, రెండేళ్లు దాటినా వారిద్దరినీ మార్చకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రధానంగా సునీల్ దియోధర్ ఒంటెత్తు పోకడ, మధుకర్‌రెడ్డి మౌనం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో సంఘటనా మంత్రిగా పనిచేసిన ఓ ప్రముఖుడి ఆశీస్సులతోనే సోము నాయకత్వం, ఇతర పార్టీల నుంచి చేరిన వారిని దూరం పెడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.