Suryaa.co.in

Andhra Pradesh

పాలకుల నుంచి ప్రజలను రక్షించడానికి రాష్ట్రంలో ఏక్ నాథ్ షిండేలు పుట్టుకొస్తారేమో

– ఉద్దవ్ థాక్రే పై జరిగినట్లుగా తిరుగుబాటు తప్పదేమో
– కోడి కొత్తి సంఘటన సమయంలో జగన్మోహన్ రెడ్డికి అయిన గాయం తీవ్రత ఎంతో, ఇప్పుడు సీఐ కనకారావు కు అయిన గాయం తీవ్రత కూడా అంతే
– ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తిపైనే కేసులు పెట్టి హింసించడం దుర్మార్గం
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

పాలకుల నుంచి ప్రజలను రక్షించడానికి రాష్ట్రంలోనూ ఏక్ నాథ్ షిండే లు పుట్టుకొస్తారేమోనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కు 9 నుంచి 10 స్టెంట్లు వేయడం వల్ల, ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన ఎవరిని పెద్దగా కలిసేవారు కాదని తెలిసిందన్నారు. అయితే ఏ కారణం లేకుండా ఎవ్వర్నీ కలవని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై కూడా, ఉద్దవ్ థాక్రే పై జరిగినట్లుగా తిరుగుబాటు తప్పదేమోనన్న అనుమాన్ని వ్యక్తం చేశారు. ఉద్దవ్ థాక్రే మంచి పాలనధక్షుడని, అయినా ఎమ్మెల్యేలను కలవకపోవడం వల్లే ఆయనపై ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారన్నారు. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు అనంతరం, తనకు తానే జగన్మోహన్ రెడ్డి పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న విషయం తెలిసిందేనని అన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగడానికి ఎన్నికల కమిషన్ అంగీకరించకపోవడంతో, చేసేది లేక తన ప్రతిపాదనను విరమించుకున్నారని తెలిపారు. పార్టీలో ఏక్ నాథ్ షిండే లు ఉండబోరని తాను చెప్పలేనన్న రఘురామకృష్ణం రాజు, తాను మాత్రం ఏకనాథ్ షిండే తరహాలో వ్యవహరించబోనని చెప్పారు. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘు రామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తప్పు జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పై 10 సెక్షన్ల కింద తప్పుడు కేసులు నమోదు చేయడం రాష్ట్ర పోలీసులకే చెల్లిందన్నారు. ఎటువంటి తప్పు చేయని వ్యక్తిని దారుణంగా హింసించడమే కాకుండా, రాత్రంతా పోలీస్ స్టేషన్ లో కూర్చో బెట్టడం దారుణమని మండిపడ్డారు . పట్టాభి పై పోలీసులు నమోదు చేసిన తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేయాలన్న రఘురామకృష్ణంరాజు, నేరుగా హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు. హైకోర్టులోను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి న్యాయం జరిగితే, సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్నారు. సుప్రీంకోర్టులో కచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పట్టాభి ఒంట్లో అయిన అంతర్గత గాయాలు మానక ముందే దేశ సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించి మళ్ళీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరాలన్నారు

జగన్ కత్తిపోటుకు ఓ న్యాయం… పట్టాభి పోలీసు పోటుకు మరో న్యాయమా?
జగన్మోహన్ రెడ్డి పై విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి దాడి జరిగిన వెంటనే ఆయన హైదరాబాదుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారని రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రభావితం చేయలేని విజయవాడ ఎయిమ్స్, హైదరాబాదులోని మిలిటరీ ఆసుపత్రులకు పట్టాభిని తీసుకువెళ్లి పరీక్షలను చేయించి ఈ కేసును ఒక కొలిక్కి తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. లేకపోతే రాష్ట్ర పోలీసులు రెట్టించిన ఉత్సాహంతో మరో ఒకరు ఇద్దరు టిడిపి నేతల పై తప్పుడు కేసులు బనాయించి చిత్రహింసలు పెట్టే అవకాశాలు లేకపోలేదని అన్నారు. ఇది ఇంతటితో ఆగదని, రాష్ట్ర పోలీసులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు కూడా ప్రస్తుతం ఏమీ చేయలేరని, ఎన్నికల సమయంలో మాత్రం వారు తమ పార్టీ పెద్దల గూబ పగలగొడతారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నది ఏమిటో, ఎవరి పక్షాన న్యాయం ఉన్నదో ప్రజలు ఆలోచించాలన్న రఘురామకృష్ణంరాజు, బాలకోటి రెడ్డి అనే వ్యక్తిని తమ పార్టీ నాయకులే చంపేశారన్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ , బాధిత పక్షమైన టిడిపి నాయకుల పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, దాడులు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పై మాత్రం నామమాత్రపు కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారన్నారు.

ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన న్యాయస్థానం
న్యాయమూర్తులు చట్ట ప్రకారమే నడుచుకుంటారని భావిస్తూ వస్తున్న ప్రజల ఆశలపై పట్టాభి కేసులో న్యాయస్థానం నీళ్లు చల్లినట్లు గా వ్యవహరించిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. సాక్షి దినపత్రిక తో పాటు, చోటామోటా నాయకులు వండి వార్చిన బిర్యానితో న్యాయస్థానం కూడా ఏకమైపోయినట్లుగా వ్యవహరించడం ఆవేదన కలిగించిందన్నారు. న్యాయస్థానాలలోనూ న్యాయం జరుగుతుందని నమ్మకం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కనకారావుకు టిడిపి నేత విసిరిన రాయి తగిలి గాయమైందట అని అపహాస్యం చేశారు.

రాళ్ళల్లోనూ టిడిపి, వైసిపి రాళ్లని వేరువేరుగా ఉంటాయా అని ప్రశ్నించారు. కనకా రావు నుదుటికి దెబ్బ తగిలితే ఆయన ఒక చేత్తో సెల్ ఫోను పట్టుకొని, మరొక చేతితో ఆసరాగా ఉండడానికి ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తిని కూడా పట్టుకోలేదన్నారు . సీఐ తల కు గాయం తగిలినట్లుగా చెబుతున్న నుదిటికి వెనుకన కూర్చున్న కానిస్టేబుల్ చేతిని అడ్డుగా పెట్టడం పరిశీలిస్తే, రాళ్లదాడిలో అసలు సిఐ కి దెబ్బ తగిలిందా? అన్న అనుమానం కలుగక మానదని రఘురామకృష్ణం రాజు అన్నారు. కోడి కొత్తి సంఘటన సమయంలో జగన్మోహన్ రెడ్డికి అయిన గాయం తీవ్రత ఎంతో, ఇప్పుడు సీఐ కనకారావు కు అయిన గాయం తీవ్రత కూడా అంతేనని ఎద్దేవా చేశారు. దానికే కనకారావు ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా సాక్షి దినపత్రికలో వార్తా కథనం రాయడం విస్మయాన్ని కలిగించిందన్నారు. నుదుట చిన్న గీత గీసుకుపోతే దానికి టిడిపి నేతలపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు, కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు.

తొలుత సీఐ బాగానే ఉన్నారని చెప్పి, పట్టాభిని కోర్టు లో న్యాయ మూర్తి ముందు హాజరపరిచే సమయానికి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని చెప్పడం పరిశీలిస్తే పోలీసులు ఆడుతున్న డ్రామాలో భాగమేనని విమర్శించారు. కనకా రావుకు ప్రాణహాని ఉండే ప్రమాదం లేకపోలేదని, తమ వాళ్ళు మంచి వాళ్ళు కాదంటూ హెచ్చరించారు. కట్టు కథలు చెప్పి న్యాయస్థానాన్ని నమ్మించినప్పటికీ, చరిత్ర అనేది చెరిపేస్తే చెరిగిపోదన్నారు. ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారని, ప్రజా న్యాయస్థానంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. టిడిపి నాయకుడు చిన్నపై జరిగిన దాడి గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన పట్టాభి చాలా సౌమ్యంగా మాట్లాడుతూ కనిపిస్తే, పరుష పదజాలంతో మాట్లాడినట్టుగా వక్రీకరించడం సిగ్గుచేటు అన్నారు. తమ పార్టీ నాయకుడి పై దాడి చేసిన వైసీపీ, నాయకులు కార్యకర్తలు, తమ పార్టీ కార్యాలయం పై దాడి చేయబోతున్నట్లుగా తమకు సమాచారం అందిందని, రక్షణ కల్పించాలని కోరినప్పటికీ పోలీసులు, టిడిపి కార్యాలయం పై అధికార పార్టీ కార్యకర్తల దాడిని నిలువరించలేకపోవడం పోలీసు అధికారుల వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. అలాగే టిడిపి కార్యాలయం ముందు ఉన్న వాహనాలకు నిప్పు పెట్టి, దగ్ధం చేస్తున్నప్పటికీ పోలీసులు ఏమి చేస్తున్నారని నిలదీశారు.

వైద్య పరీక్షలే చేయకుండా దెబ్బలేమి తగలలేదని ఎలా నిర్ధారించారు?
పోలీసులు అదుపులోకి తీసుకున్న పట్టాభి కి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించినప్పటికీ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. కాలి బొటనవేలు విరిగినప్పటికీ, ఎమ్మారై తీయకుండానే ఏమీ కాలేదని వైద్య నివేదికను అందజేయడం డాక్టర్ల పనితీరుకు అద్దం పడుతుందని విమర్శించారు. గతంలో తనను కూడా లాకప్ లో చిత్రహింసలకు గురి చేసినప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభావతి తప్పుడు నివేదికను ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు పట్టాభి విషయంలోనూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అదే చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి న్యాయమూర్తి ఇంటికి తీసుకు వెళ్తున్న వాహనంలోకి ఎక్కిన అగంతకులు, వాహనంలోనే పట్టాభిని మరొకసారి కొట్టినట్లు తనకు సమాచారం అందిందని తెలిపారు. ఇంతకుముందే ఆయనని కాళ్లు, చేతులపై మోకాళ్లపై పోలీసులు కొట్టినట్టు పట్టాభి స్వయంగా పేర్కొనడం జరిగిందన్నారు. న్యాయస్థానానికి కళ్ళు లేక చూడలేదని, వైద్యులకు కళ్ళు, వైద్య పరికరాలు ఉన్నప్పటికీ ఎందుకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య నివేదికను అందచేయలేదని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

ఆంధ్రజ్యోతి పేరిట సోషల్ మీడియాలో వైకాపా శ్రేణులు తప్పుడు ప్రచారం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని ఆంధ్రజ్యోతి ఛానల్ పేరుతో తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పవన్ కళ్యాణ్ తన సతీమణికి విడాకులు ఇవ్వనున్నట్లుగా ఆంధ్రజ్యోతి చానల్ లో ప్రసారమైనట్టుగా ఒక తప్పుడు కథనాన్ని వైసీపీ సోషల్ మీడియా విభాగం సృష్టించి తీవ్ర ప్రచారాన్ని చేస్తోందన్నారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెంచడానికి ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతుందని తెలిపారు. ఈ తరహా ప్రచారంపై ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయబోతే, వారే సోషల్ మీడియాలో ఈ తరహా పోస్ట్ పెట్టారని కేసు పెట్టిన ఆశ్చర్య పోవలసిన పనిలేదని ఎద్దేవా చేశారు. సమాజంలోని కొన్ని వర్గాల మధ్య విభేదాలను సృష్టించే పనులన్నీ, తమ పార్టీ వారే చేస్తారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

టంగుటూరి ప్రకాశం పంతులు పేరెందుకు పెట్టలేదు?
లా నేస్తం అనే సంక్షేమ పథకానికి టంగుటూరి ప్రకాశం పంతులు పేరెందుకు పెట్టలేదని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రతి సంక్షేమ కార్యక్రమానికి తన తండ్రి పేరు లేదంటే తన పేరును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ కాబట్టి, హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరును పెట్టామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు, లా నేస్తం పథకానికి వైయస్సార్ పేరును ఎందుకు పెట్టారో చెప్పాలని నిలదీశారు. బహుశా న్యాయ శాస్త్రం చదువాలనుకుని, వైయస్ రాజశేఖర్ రెడ్డి చదివి ఉండకపోవడం వల్ల ఈ పథకానికి ఆయన పేరు పెట్టి ఉంటారని అపహాస్యం చేశారు. వైయస్సార్ లా నేస్తం పథకానికి కోటి 55 వేల రూపాయలను బటన్ నొక్కి విడుదల చేసిన బటన్ మోహన్ రెడ్డి, ప్రచారానికి నాలుగు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం దారుణమని మండిపడ్డారు. నాలుగు కోట్ల రూపాయలను మరేదైనా సంక్షేమ కార్యక్రమానికి వినియోగించి ఉంటే ప్రజలకు మేలు జరిగి ఉండేది అన్నారు.

అర్హతలన్నీ ఉన్నా ప్రభుత్వ పథకానికి ఎంపిక చేయని వాలంటీర్లు
ప్రభుత్వ పేదరిక నిర్మూలన పథకం ( సెర్ప్ ) ద్వారా లబ్ధి పొందడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, తమని వాలంటీర్ ఎంపిక చేయలేదని ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకానికి అర్హులను ఎంపిక చేయడానికి వాలంటీర్లు ఎవరని న్యాయమూర్తి ప్రశ్నించారన్నారు. ఎటువంటి జవాబుదారితనం లేకుండా, కేవలం గౌరవ వేతనంతో పని చేసే వాలంటీర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టడం సిగ్గుచేటని రఘు రామ కృష్ణంరాజు మండిపడ్డారు . ఈ కేసు విచారణను ఈ నెల 28వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారన్న ఆయన, విచారణ సమయానికి కేసు యాదృచ్ఛికంగా వేరే బెంచ్ కు బదిలీ అవుతుందేమో ననే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE