Suryaa.co.in

Editorial

హేట్సాఫ్.. సునీత!

-తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై పట్టువదలని కూతురు
సునీత వదిలిస్తే కేసు సమాధి
-టీడీపీనే దోషి అన్న నింద నిజమయ్యేది
-ఇప్పుడు హంతకులెవరన్నది సీబీఐ చెబుతోంది
-సీబీఐ వేళ్లన్నీ అవినాష్ కుటుంబం పైనే
-ఇంకా వెలుగులోకి రాని ముసుగువీరులెందరో?
-సునీత పోరాటం అద్భుతం
( మార్తి సుబ్రహ్మణ్యం)

పోరాటం చేసేవారినే చరిత్ర గుర్తుంచుకుంటుంది. అలాంటి వారికే చరిత్రలో స్థానం దక్కుతుంది. దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుంది. తన తండ్రిని గొడ్డలివేటుతో నరికేసిన హంతకులు, ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ ఆమె చేసిన ఒంటరిపోరాటానికి, సీబీఐ తలవంచి నిగ్గుతేల్చాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాలతో, వివేకాimageహత్యను చేపట్టిన సీబీఐ తేలుస్తున్న అంశాల్లో నిజమెంత? అబద్ధమెంత? అసలు సూత్రధారులకు శిక్ష పడుతుందా? లేదా? అన్నది పక్కనపెడితే.. ఒక మహిళగా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయం కోసం సునీత కసితో చేస్తున్న పోరాటాన్ని ప్రతి మనసూ అభినందించాల్సిందే.

సోదరుడు సీఎంగా ఉన్నందున, ఇక తండ్రిని హత్యచేసిన ముష్కరుల సంగతి సులభంగా తేలిపోతుందని సునీత భావించడంలో తప్పేమీ లేదు. అది అత్యాశ కూడా కాదు. విపక్షనేతగా ఉన్న సోదరుడు, జగనన్న సీబీఐ విచారణ కోరారు. తెలుగుదేశం వారే వివేకా రక్తచరిత్ర లిఖించారని, వైసీపీ మీడియా కూడా కోడైimage కూసింది. అంతకుముందు గుండెపోటని చెప్పిన నోళ్లే, ఆ తర్వాత గొడ్డలిపోటని అంగీకరించాల్సి వచ్చింది. పనిలో పనిలో.. ఆ ఎన్నికల సమయంలో వివేకాను హత్య చేసింది టీడీపీనే అని, బట్టకాల్చి నెత్తిన వేసింది. ఫలితం.. బాబాయ్ హత్యకు సానుభూతిగా, బ్యాలెట్లలో వైసీపీకి ఓట్ల వర్షం కురిసింది. అది వేరే విషయం.

సోదరుడు జగనన్నే సీఎం అయ్యాడు కాబట్టి.. ఇక తండ్రి కేసు పంచకల్యాణి గుర్రంలా వేగంగా దౌడు తీస్తుందని, కూతురు సునీత ఆశించడం సహజం. కానీ ఆమె ఆశ అడియాశ అయింది. రాష్ట్ర ప్రభుత్వంimage విచారిస్తోంది కాబట్టి, ఇక సీబీఐ విచారణ అవసరం లేదని.. జగనన్న సర్కారు కోర్టులో చెప్పినప్పుడు, అదే సునీత ఖంగుతినడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ ఆ తర్వాత కూడా కేసు నెలలపాటు నత్తలు కూడా సిగ్గుపడేలా సాగడం, తండ్రిని పోగొట్టుకున్న ఏ కూతురుకయినా శరాఘాతమే.

అప్పుడు సునీతదీ సరిగ్గా అదే పరిస్థితి. ఆ తర్వాత సీబీఐ విచారణకు వచ్చిన ఎస్పీపైనే, బాధితుల పేరిట పోలీసు కేసు నమోదు చేయటం, దానిని కోర్టు తప్పుపట్టడంతో.. సునీతకు అదృశ్యశక్తులపై ఉన్న అనుమానం నిజమని నిర్ధరణ అయింది. మరి నిజం నిలకడమీద గానీ తెలియదు కదా?!

తెరవెనుక ఏం జరిగిందో ఆలస్యంగా తెలుసుకుని… తేరుకున్న సునీత, తండ్రి హత్యపై సీబీఐ విచారణ కోసం కోర్టు గుమ్మం ఎక్కారు. కథ అక్కడి నుంచే మలుపు తిరిగింది. అన్నాయ్ పార్టీ మీడియా సంస్థల్లో, వివేకా హత్యలో సునీత-ఆమె భర్తల హస్తం ఉందన్న రీతిలో కథనాలు రావడం చెల్లాయిని ఖంగుతినిపించాయి.

ఆ తర్వాత ఏపీలో అన్నాయ్ సీఎంగా ఉన్నందున, కేసు అక్కడ తెమలదని తెలిసిన సునీత.. మరో రాష్ట్రానికి అప్పగించాలని సుప్రీంకోర్టు తలుపుతట్టారు. దానితో స్పందించిన సుప్రీంకోర్టు, తెలంగాణకు వివేకానంద విచారణ బాధ్యత బదలాయించింది. ఆ తర్వాత సీబీఐ.. ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారించడం, ఆ తర్వాత కడప జైలులో ఉన్న నిందితులను హైదరాబాద్ చంచల్‌గూడ జైలుకు మార్చడం, జగన్ ఓఎస్‌డీ- భారతి పీఏలను విచారించడం, అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి సీబీఐ నోటీసులివ్వడం చకచకా జరిగిపోయాయి. ఇదంతా సునీత పోరాట ఫలితమేనన్నది నిష్ఠుర నిజం.

వివేకా హత్య కేసులో ఎవరు హంతకులు? ఎవరు నిర్దోషులు? ఈ కేసులో ముందు ఎవరిని అరెస్టు చేస్తారన్నది సంగతి పక్కనపెడితే.. సునీత తన తండ్రి హంతకులెవరో తేల్చాలని పోరాటం చేయకపోతే, ఆ కేసు విజయవంతంగా సమాధి అయ్యేదన్నది, మనం మనుషులం అన్నంత నిజం. అప్పుడు అధికార పార్టీ అధికార మీడియా రాసినట్లు.. ‘నారా’సుర రక్తచరిత్ర, ఇంకా నిజమని జనం నమ్మే అవకాశం ఉండేది.

టీడీపీ కూడా అలవాటు ప్రకారం.. వివేకా హత్యతో తమకు సంబంధం లేదని, ఇప్పటికీ బురద కడుక్కునే పనిలోనే ఉండేది. సునీత పోరాటం వల్ల టీడీపీపై ఆ నిందలు మాయమయ్యాయి. కాబట్టి నాలుగేళ్లు నిందలు మోసిన పార్టీ అధినేతగా, చంద్రబాబు నాయుడు కచ్చితంగా సునీతకు రుణపడి ఉండాల్సిందే.

ఇప్పుడు సునీత పోరాటం వల్ల.. వివేకా హత్యలో పాత్రధారులు, సూత్రధారులెవరన్న ఒక్కో నిజం పురుడుపోసుకుంటోంది. ఏకంగా సీబీఐ తన విచారణలో ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి పేర్లు ప్రస్తావించింది. దస్తగిరి ఆల్రెడీ అప్రూవర్‌గా మారారు. అందులో పాత్రధారులు-సూత్రధారులెవరన్నదీ స్పష్టంగా పేర్కొని, వాటిని కోర్టుకు సమర్పించింది.

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. వివేకా హత్య వెనుక అంత:పురంలో చాలామంది హస్తాలున్నాయని, శివగామి ఎవరో త్వరలో తేలుతుందని వ్యాఖ్యానించారు. అటు సీబీఐ కూడా వివేకా హత్య జరిగిన రోజు, ఉదయం ఎవరి ఫోన్లు ఎక్కడున్నాయో స్పష్టం చేసింది.

ఇప్పుడు వివేకా హత్య కేసు విచారిస్తున్న సీబీఐ పరిశోధనలు లీక్ చేస్తున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ. నిజమే. మీడియా పనే అది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ మీడియా చేసింది కూడా అదే. బాబు సర్కారులోని డొల్లతనం, అవినీతిని వైసీపీ మీడియా ఏవిధంగా- ఏ మార్గాల్లో అయితే సేకరించిందో.. ఇప్పుడు ఒక వర్గానికి చెందిన మీడియా కూడా అదే దారిలో వెళుతోంది.

అయినా.. సీబీఐ గానీ, మరొకరు గానీ కోర్టుకు ఆధారాలు సమర్పించిన తర్వాత, అది అధికార డాక్యుమెంట్‌తో సమానమే. కోర్టు నుంచి ఎవరైనా ఆ కాపీలు తీసుకోవచ్చు. పిటిషనర్ న్యాయవాది కూడా వాటిని తీసుకోవచ్చు. అయితే విచారణ ముగియకుండానే, మీడియా తీర్పులివ్వడం అనైతికం. ఈ సూత్రం ఎవరికైనా వర్తించేదే.

నిజమే. వివేకా హత్య తర్వాత.. ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని జగన్, అవినాష్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసిరెడ్డి పద్మ చెప్పిన మాటలు ఇప్పుడు సీబీఐ విచారణ పుణ్యాన నిజమయ్యాయి. విజయసాయిరెడ్డి ముందు గుండెపోటని చెప్పినా, తర్వాత సర్దుకుని మృతిపై అనుమానాలున్నాయని తేల్చిచెప్పారు. సీబీఐ పుణ్యాన చివరాఖరకు, వివేకాది హత్యేనని తేలడంతోపాటు, అందులో పాల్గొన్నవారెవరో కూడా బయట ప్రపంచానికి తెలిసిపోయింది.

అసలు ఇప్పుడు పాత్రధారులు-సూత్రధారులు-ముసుగువీరులెవరన్నది కాదు ప్రశ్న. అంతపెద్ద కేసు నీరు కాకుండా, ఫ్యాక్షన్ రాజ్యంలో సమాధి కాకుండా సజీవంగా నిలిపి, నిందితులను బలిపీఠం ఎక్కించాలన్న కసితో పోరాడుతున్న డాక్టర్ సునీతను మెచ్చుకోవాల్సిందే.

అంతా బాగుంది. అయితే.. అంత రక్తచరిత్ర లిఖించిన ఆ నిశీధిలో కూడా అత్యంత తాపీగా, వివేకాతో లేఖ రాయించిన ఆ విశ్వామిత్రుడెవరన్నదే ఇంకా తేలలేదు. తేలితే.. ఆయన తెలివికి దండేసి దండం పెట్టాల్సిందే.
image

LEAVE A RESPONSE