-నాడు చంద్రబాబుపై.. మొన్న సునీతపై.. నేడు సునీల్ యాదవ్‌పై
-సునీల్ యాదవ్ చంపితే రూ.కోటి సుపారీ ఇవ్వాల్సిన అవసరమేంటి?
– ఎం.రవీంద్రనాథ్ రెడ్డి
నాలుక మడతేయడంలో ఒలంపిక్స్‌లో పోటీ పెడితే గోల్డ్ మెడల్స్ అన్నీ జగన్ రెడ్డి గ్యాంగ్వే. వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి గ్యాంగ్ నాలుక తిప్పిన విధంగా మరెవరూ తిప్పి ఉండరు. గుండె పోటుతో మొదలైన మడత డ్రామా.. నాలుగేళ్లుగా అనేక అబద్దాల చుట్టూ తిరుగుతూనే ఉంది.
గుండె పోటు అని చెప్పిన గంటల వ్యవధిలోనే.. టీడీపీ నేతలు హత్య చేశారన్నారు. ఆ తర్వాత నారా సుర రక్త చరిత్ర అంటూ పుస్తకాలేశారు. తర్వాత వివేకా అల్లుడు హత్య చేశాడన్నారు. తర్వాత అక్రమ సంబంధం కారణంగానే హత్య అన్నారు. ఆ తర్వాత ఆస్తి తగాదాలతో హత్య అన్నారు. ఇప్పుడు లైంగిక వేధింపుల వలనే హత్య జరిగిందని కోర్టుకు చెబుతున్నారు.
ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ విచారణ జరగాలన్నారు. అధికారంలోకి వచ్చాక అసలు సీబీఐ విచారణే అవసరం లేదని మడత పెట్టారు. కుమార్తె పోరాడి సీబీఐ విచారణ సాధించుకుంటే.. ఆమెపైనే నిందలేశారు. వివేకాను శారీరకంగా చిత్రహింసలు పెట్టి చంపేసిన రక్త పిశాచాలు.. ఇప్పుడు అతని వ్యక్తిత్వంపై కూడా నిందలేస్తూ వారి కుటుంబాన్ని మానసికంగా హింసిస్తున్నారు. గూగుల్ టేకౌట్ ద్వారా నిందితుల గుట్టు మొత్తం సీబీఐ అధికారులు బయట పెట్టి అవినాశ్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని విచారించిన గంటల వ్యవధిలో జగన్ రెడ్డి ఢిల్లీ పరిగెత్తి వెళ్లారు.
ఇప్పుడు ఏకంగా వివేకా సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించడం కారణంగానే హత్య చేశారంటూ భాస్కర్ రెడ్డి తరపు లాయర్ కోర్టులో పిటిషన్ వేయడం హాస్యాస్పదంగా ఉంది. హత్యకు లైంగిక వేధింపులే కారణమైతే.. సునీల్ యాదవ్‌కు రూ.కోటి సుపారీ ఇస్తామని, తర్వాత మిగిలిన సొమ్ము ఇస్తామని ఓ పెద్దమనిషి చెప్పినట్లు దస్తగిరి వాగ్మూలం ఎలా ఇచ్చారు? ఆ పెద్దమనిషి ఎవరు? సొంత బాబాయి కేసును సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి చిన్నమ్మకు మనశ్శాంతి కలిగించాల్సింది పోయి, ఇలాంటి ఆరోపణలు, అభాండాలు వేసి ఇంకా కుంగిపోయేలా చేయడం సిగ్గుచేటు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా నాలుక మడతేసినా వివేకాపై గొడ్డలి వేటుకు కారణమైన కిరాతకుడు చట్టానికి చిక్కడం తధ్యం.