– కలల కొలువు తీర్చిన డీఎస్సీ-98
– 25 ఏళ్ల క్రితం టీచరు పరీక్షరాసిన వారికి ఇప్పుడు కొలువు
– వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి టీచర్ ఉద్యోగం
– తనకు ఆసక్తి లేదన్న ఎమ్మెల్యే
– ఈపాటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ధర్మశ్రీ
– కడప డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాసరావుకూ టీచరు ఉద్యోగం
– తన కలలు నెరవేరాయని శ్రీనివాసరావు ఆనందం
– గవర్నమెంటు కొలువే తన లక్ష్యమని స్పష్టీకరణ
– ఉద్యోగంలో చేరతానన్న కాంగ్రెస్‌నేత శ్రీనివాసరావు
– జబర్దస్త్ టీవీ షో గణపతికీ సర్కారీ కొలువు
– లేటు వయసులో ఊహించని ఉద్యోగాలు
– సీఎం జగన్ నిర్ణయంతో అద్భుతాలు-ఆశ్చర్యాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఒక కల. ఏవిధంగానయినా ఉద్యోగం సంపాదించేందుకు రాత్రి-పగలు కష్టపడతారు. అదే టీచరు ఉద్యోగమైతే ఇంకా క్రేజీ. సమాజంలో వారికి ఉండే గౌరవమే వేరు. అందుకే ఎంత కష్టమైనా గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలన్నదే చాలామంది కోరిక.
ఆవిధంగా… ఇరవై ఐదేళ్ల క్రితం టీచరు పరీక్ష రాసి, ఫలితాలు రాక, వచ్చినా ఉద్యోగం రాక విసుగుపుట్టి వేర్వేరు పనులు చేసుకుంటున్న వారికి…. హటాత్తుగా ‘మీకు టీచరు ఉద్యోగం వచ్చిందోచ్’ అని అపాయింట్మెంట్ లెటర్ ఇంటికివస్తే, వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది?
ఈ వయసులో ఉద్యోగం వచ్చిన వారి మనోభావన ఎలా ఉంటుంది? ఇంత లేటు వయసులో లేటెస్టుగా వచ్చిన సర్కారీ కొలువు వారిని ఉక్కిరిబిక్కిరి చేయదూ? ‘చేసేది పదేళ్ల ఉద్యోగమే అయినా ఆ కిక్కే వేరప్పా’ అని మనసు చిన్నపిల్లాడిలా గెంతులేయదూ? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ-98 రాసిన అభ్యర్ధులదీ అదే పరిస్థితి. అలా.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం, అనేకమంది ప్రముఖులను సర్కారీ ఉద్యోగులను చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ-98 పరీక్షలు గందరగోళం రేపాయి. రిక్రూట్మెంట్- నిర్వహణ జాప్యం-కోర్టు వివాదాల కారణంగా ఆ పరీక్ష రాసినవారంతా దాని గురించి మర్చిపోయారు. ఉద్యోగం కోసం ఎదురుచూసి, విసిగివేసారిపోయిన నిరుద్యోగులు, ఇతర రంగాలు-ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. కొందరు రాజకీయాల్లోకి వెళ్లగా మరికొందరు టీవీ, సినిమాలో అదృష్టం వెతుక్కునేందుకు వెళ్లిపోయారు.
ఈలోగా కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. డీఎస్సీ-98లో పాసయిన అభ్యర్ధులకు ఏపీ సీఎం జగన్ చల్లటికబురు అందించారు. వారికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతే .. అందరికీ అపాయింట్మెంట్ లెటర్లు వచ్చేశాయి. అయితే.. సీఎం నిర్ణయానికి కృతజ్ఞతలు చెప్పేవారెవరూ కనిపించలేదు. కారణం.. అప్పటికే వారంతా వివిధ రంగాల్లో స్థిరపడటమే!
ఆవిధంగా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే, కరణం ధర్మశ్రీకి సైతం టీచర్ ఉద్యోగం వచ్చింది. డీఎస్సీ-98 రాసిన ధర్మశ్రీ, ఆ తర్వాత ఒకసారి ఎమ్మెల్యే కూడా చేశారు. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ధర్మశ్రీ.. ఇప్పుడు తనకు టీచర్ ఉద్యోగంపై ఆసక్తి లేదన్నారు. అయితే కడ ప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు వ్యవహారం మాత్రం ఇందుకు రివ ర్సు. టీచర్ ఉద్యోగం వచ్చిన ఆయన ఆనందానికి అవధుల్లేవు. సర్కారీ కొలువు తన కల అని, అది నెరవేరే అవకాశం వస్తే ఎందుకు కాదంటాను? నేను ఉద్యోగంలో చేరిపోతానని చెబుతున్నారు.
తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కాబట్టి, డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుకు లేఖ రాశారు. ‘నాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉన్నప్పటికీ, టీచరు ఉద్యోగం అంతకంటే ఇష్టం’ అని స్పష్టం చేశారాయన. సిద్ధవటం మండలం దిగువపేట హైస్కూల్లో శ్రీనివాసరావుకు టీచర్ ఉద్యోగం వచ్చింది.
ఇక జబర్దస్త్ కామెడీ టీవీషోలో కడుపుబ్బ నవ్వించే హైపర్ ఆది టీమ్‌లో.. లావుగా కనిపించే గణపతికీ, డీఎస్సీ 98 ఉద్యోగం వచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవసలకు చెందిన గణపతి, డీఎస్సీ పరీక్ష రాసిన తర్వాత కళారంగంలోకి వెళ్లారు.
అన్నట్లు.. హాస్యనటుడు బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, ఎల్బి శ్రీరాం, దివంగత జయప్రకాష్ నారాయణ వంటి నటులంతా ప్రభుత్వ ఉద్యోగాలు చేసి, సినీరంగంలో అదృష్టం పరీక్షించుకున్న వారే కావడం విశేషం.
ఈవిధంగా ఆశ్చర్యాలకు వేదికగా నిలిచిన డీఎస్సీ 98లో, ఉద్యోగాలు సంపాదించుకున్న వారంతా… తొమ్మిది-పదేళ్ల తర్వాత రిటైరుకాబోవడం మరో ఆశ్చర్యం. ఏదైతేనేం.. సర్కారీ కొలువు సాధించాలనుకున్న విక్రమార్కులంతా… లేటయినా… లేటెస్టుగా తమ లక్ష్యం సాధించారన్నమాట. ఈ వయసులో సర్కారీ కొలువు చేస్తే ఆ కిక్కే వేరప్పా. ఆల్‌ది బెస్ట్!