-ప్రజలకు మంచి జీవనశైలి అలవాటు చేయండి
-అనవసర మందులు, అనవసర వైద్య పరీక్షలు వద్దు
-వైద్యులకు భారత పూర్వ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు సూచన
-పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటానని వెల్లడి
శ్రీకాకుళం: వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని, ఎంతో సేవాభావంతో చేపట్టాలని, అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని భారత పూర్వ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం విషయంలో మన చుట్టూ ఉన్నవారికి మార్గదర్శనం చేయడం ముఖ్యమని చెప్పారు. బుధవారం వెంకయ్యనాయుడు శ్రీకాకుళంలోని గ్రేట్ ఈస్ర్టన్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ స్నాతకోత్సవానికి హాజరై ప్రసంగించారు. రోగం వచ్చిన తర్వాత చికిత్స చేయడం కన్నా రోగం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని, ఈ దిశగా వైద్యులు పని చేయాలని సూచించారు. మొత్తం వైద్య వ్యవస్థ అంతా కూడా ముందస్తు నివారణ దిశగా పని చేయాలన్నారు. ఆస్పత్రులు, వైద్యుల వద్దకు ప్రజలు రాక ముందే వారి వద్దకు వెళ్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాంటి జీవితం గడపాలో మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
అంటువ్యాధులు బాగా విస్తరిస్తున్నాయని, కేన్సర్ మహమ్మారిలా వ్యాపిస్తోందని, మధుమేహం, ఊబకాయం సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయని చెబుతూ వీటన్నింటి గురించి ముందుజాగ్రత్తగా యువతరానికి వివరించి అప్రమత్తం చేయాల్సిన బాధ్యత వైద్యులకు, బోధనాస్పత్రులకు, ఆస్పత్రులకు, వైద్య సంస్థలకు ఉందని, అది తమ వృత్తి లో భాగంగా చేసుకోవాలని పేర్కొన్నారు.
‘‘దిస్ ఈజ్ ఎ నోబెల్ ప్రొఫెషన్, యు టేక్ ఇట్ యాజ్ ఏ మిషన్. డోన్ట్ ఎక్స్పెక్ట్ ఎనీ కమీషన్, దేర్ ఈజ్ నో ఒమిషన్, వర్క్ విత్ పాషన్, పర్ ది సేక్ ఆఫ్ నేషన్’’ అని వైద్య వృత్తి గొప్పతనాన్ని వివరించారు. ఫీజులు తీసుకోకుండా పని చేయాలని తాను చెప్పడం లేదని, వైద్యుల జీవనానికి, ఆస్పత్రుల అభివృద్ధికి అవసరమేనని,అయితే అవి హేతుబద్ధంగా ఉండాలని సూచించారు. రోగితో ఎక్కువు సేపు మాట్లాడి సమస్యను అర్థం చేసుకోవాలని, కానీ ఇటీవల కాలంలో రోగి రాగానే పరీక్షలు చేయించుకురమ్మని పంపిస్తున్నారని అన్నారు. ‘‘టెస్ట్ ఈజ్ ద బెస్ట్ అండ్ యూ టేక్ రెస్ట్’ అనే ధోరణి పెరిగిదని చెప్పారు.
పరీక్షలు వద్దని తాను అనడం లేదని, వ్యాధి తాలూకూ నిగూఢ అంశాలు నిర్ధారణ కావాలంటే అవసరమేనని చెప్పారు. అవసరమయిన మేరకే మందులు, పరీక్షలు సూచించాలని, అవసరం లేకపోయినా వైద్యపరీక్షలు చేయిస్తున్నారన్న భావన ప్రజల్లో ఉందని, దీని గురించి వైద్యలోకం గంభీరంగా ఆలోచించాలని చెప్పారు.
వైద్యపరంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను, కొత్త చికిత్సావిధానాలను, కొత్త అధ్యయనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. సూర్యోదయానికల్లా నిద్ర లేవాలని, కాసేపు ఎండలో గడపాలని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు అని, రోజూ కొద్దిసేపు వ్యాయామం చేయాలని, ఇలాంటి విషయాలను వైద్యులు ప్రజలకు గట్టిగా చెప్పాలని సూచించారు. భోజనం విషయంలోనూ మార్గదర్శనం చేయాలని, పాశ్చ్యాత్య ఆహారానికి అలవాటు పడరాదని. మన వాతావరణానికి అది సరికాదని చెప్పారు.
భారతీయ సంప్రదాయ వంటింటి భోజనమే ఆరోగ్యానికి మేలు అని స్పష్టం చేశారు. మన వంటల్లో వైవిధ్యమూ ఎక్కువేనని చెప్పారు. వైద్యులు మాతృ భాష బాగా మాట్లాడాలని, రోగులందరికీ ఇంగ్లిష్ రావాలని లేదని చెప్పారు. మాతృ భాషను ప్రేమించడమంటే మరోభాషను వ్యతిరేకించడం కాదని స్పష్టం చేశారు. ఏ భాషనూ బలవంతంగా రుద్దకూడదు, వ్యతిరేకించడకూడదని చెప్పారు. వైద్య విద్య పూర్తయిన తర్వాత డాక్టర్ అయిపోయామని సంతృప్తి చెందకుండా వృత్తిలో కష్టపడి పని చేయాలని సూచించారు.
ఎప్పుడూ పేషంట్లకు అందుబాటులో ఉంటూ, వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రేమతో చూస్తే పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. దీనివల్ల మనసుకు మరింత ఉత్సాహం కలగడంతో పాటు సేవవైపు మళ్లుతుందన్నారు. యోగా ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. యోగా చేస్తే యోగ్యులవుతారని అన్నారు. సెల్ ఫోన్ ఎంత వరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలని, లేదంటే అది హెల్ ఫోన్ అవుతుందని హెచ్చరించారు.
పెద్దలు చూపిన మార్గాన్ని ఎప్పుడూ మరవరాదని వెంకయ్యనాయుడు చెప్పారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కళాశాల రుసుములు కట్టి చదవిస్తారని, వారి కష్టాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వారి సుఖ సంతోషాల కోసం ప్రయత్నించాలన్నారు. విదేశాలకు వెళ్లినా తిరిగి వచ్చి మన దేశానికి సేవలు అందించాలని సూచించారు. ‘‘గో, రీడ్, ఎర్న్ అండ్ రిటర్న్ టు సర్వ్ ద మదర్ ల్యాండ్’’ అని చెప్పారు. పది మందితో పంచుకోవాలి, పది మంది బాగు కోరాలి అనేది భారతీయ ముఖ్య సంస్కృతి అని చెప్పారు. చుట్టూ ఉన్నవారు సంతోషంగా లేనప్పుడు మనం ఎలా సంతోషంగా ఉండగలమని ప్రశ్నించారు.
‘‘ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు తమ అనుభవంతో రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వాన్ని కాపాడుకోవాలి’’ అని సూచించారు. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని స్పష్టం చేశారు. మన కట్టూ బొట్టూ, మన ఆటాపాట, మన మాటా బాట, మన యాసాబాస, గోస మనవేనని, అవే మన గుర్తింపు అని, వాటిని మరవరాదని, ముందు తరాలకూ అందించాలని సూచించారు. ప్రాంతాన్ని బట్టి యాస మారుతుందని, అది అక్కడి గుర్తింపు అని, దాన్ని గౌరవించాలని చెప్పారు. తాను ఉపరాష్ర్టపతి పదవి చేపట్టాక తన దుస్తుల గురించి పత్రికల వారు అడిగారని, ‘‘అడ్రస్ మారుతుంది కానీ నా డ్రెస్’’ మారదు అని చెప్పినట్లు తెలిపారు. ఎన్ని దేశాలూ పర్యటించినా వాతావరణ మార్పులలో తప్పించి తన దుస్తుల శైలి ఇదేనని స్పష్టం చేశారు.
పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలను కలవడం, పలకరించడం మాట్లాడడం తనకు ఇష్టమైన వ్యాపకమని వెంకయ్యనాయుడు చెప్పారు. తాను కేంద్ర మంత్రిగా, ఉపరాష్ర్టపతిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు కూడా దేశమంతా పర్యటించానని గుర్తు చేశారు. నాయకుడనేవాడు నిత్యం ప్రజలతో ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవారు నిత్యం ప్రజలతోనే ఉండాలని, వారితో అనుబంధం పెంచుకోవాలని సూచించారు.
ప్రజల ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు స్వయంగా చూసి తెలుసుకోవాలన్నారు. పుస్తకాలు చదివితే, ఉపాధ్యాయులు చెప్పింది వింటే ఎంతటి జ్ఞానం వస్తుందో, ప్రజలతో తిరిగితే, ప్రజాజీవనాన్ని పరిశీలిస్తే అంతటి అనుభవం వస్తుందన్నారు. బడికి రోజూ నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లేవాడినని చెబుతూ అంత కష్టపడి, ఇష్టపడి చదివాను కాబట్టే ఈ స్థాయికి చేరుకోగలిగానని వెల్లడించారు. ఇష్టపడిన విషయంపై కష్టపడితే నష్టపోయేదీ ఏమీ లేదని, లాభపడడం ఖాయమని స్పష్టం చేశారు.
విద్య, వైద్యం, రాజకీయం, పాత్రికేయం- ఈ నాలుగు రంగాల్లోనూ విలువలకు కట్టుబడి పని చేయాలని, కానీ క్రమంగా ఈ రంగాల్లో విలువలు పడిపోవడం ఆందోళనకరంగా ఉందని చెప్పారు. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదంటారని, కానీ ఆ రంగంలోనూ వ్యాపార ధోరణి పెరిగిపోయిందని చెప్పారు.
జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరమని స్పష్టం చేశారు. వైద్యుల్లో క్రమశిక్షణ ఎక్కువేనని, రాజకీయాల్లోనే తగ్గుతందోని అన్నారు. రావాలనుకుంటే వైద్యులూ రాజకీయాల్లోకి రావచ్చని, కానీ గుంపులో గోవిందయ్యలా కాకుండా వాటిని బాగు చేయడానికి రావాలని సూచించారు. రాజకీయాల్లో నడవడిక చాలా ముఖ్యమన్నారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో, పార్టీ వేదికపై ఇలా ఎక్కడ మాట్లాడినా అవతలి పార్టీ వారిని శత్రువులా చూడకూడదని, వారు ప్రత్యర్థులు మాత్రమేనని చెప్పారు.
త్వరలో తాను తన నియోజకవర్గానికి వెళ్తున్నానని, అక్కడ తనపై ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్తున్నానని చెబుతూ రాజకీయాల్లో శత్రుత్వం ఉండకూడదని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. కార్యక్రమంలో కిమ్స్ ఆస్పత్రుల గ్రూప్ సీఎండీ బొల్లినేని భాస్కరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.