ఏప్రిల్ 30 ఆదివారం కన్యకా పరమేశ్వర జయంతి
ఓం కుసుమ పుత్రీచ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవీ ప్రచోదయాత్
ఆమె కారణ జన్మురాలు. శక్తి స్వరూపిణి.. కామిత వరదాత. ఆత్మాభిమానానికి, త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనం. రాజరికపు అరాచకత్వాన్ని అహింసాయుతంగా ధిక్కరించిన ధీరవనిత. విశ్వసించిన వారికి మోక్షాన్నిచ్చిన అపర పార్వతి.
గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం పవిత్రస్థలి. అక్కడికి సమీపంలోని పెనుగొండ గోదా కన్యకా పరమేశ్వరీ జన్మస్థలం. సుమారు వేయేళ్ల క్రిందట వేంగీ చాళుక్యుల కాలంలో జరిగిన పెను తిరుగుబాటుకు వేదిక పెనుగొండ. ఆనాడు మాఘ శుద్ధ విదియ. గోదావరి ఒడ్డున నగరేశ్వర స్వామి సన్నిధానానికి సమీపంలో 103 అగ్ని కుండాలు మహోజ్వలంగా వెలుగుతున్నాయి. పెనుగొండ నగరమంతా ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది. ఎదుటివారి అభిప్రాయానికి విలువనివ్వకుండా ఇష్టారాజ్యం సాగించుకోవాలనుకునే అధికార దర్పానికి చరమ గీతం పాడే త్యాగపతాక లాంటి సందర్భం.. జీవితాంతం కన్యగానే ఉండాలనుకున్న కన్యక అభీష్టానికి వ్యతిరేకంగా విష్ణువర్ధనుడు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఒప్పుకోకపోవడంతో పెనుగొండపై యుద్ధం ప్రకటించాడు. తనవల్ల రాజ్యంలో సంక్షోభం రేగడం కన్యకను బాధించింది. ఆత్మత్యాగం చేసుకోవాలనుకుంది.
ఆమెకు మద్దతుగా 102 గోత్రాల వైశ్యప్రముఖులు కూడా ఆనాడు ఆత్మబలిదానానికి సిద్ధపడ్డారు. బలిదానానికి ముందుగా కన్యక విశ్వరూపం ప్రదర్శించింది. ఆర్యమహాదేవిగా తనను ప్రకటించుకుంది. గత జన్మలో దేవీ ఆరాధన విశేషంగా చేసిన సమాధి అనే వైశ్యశ్రేష్ఠుడే నేటి జన్మలో కుసుమ శ్రేష్ఠిగా, తన తండ్రిగా జన్మించాడని చెప్పింది.
తపోఫలితంగా తనతో పాటు 102 గోత్రాలవారికి మోక్షాన్ని ఇవ్వాలని ఆయన కోరుకున్నందువల్ల ఈ జన్మ వచ్చిందని తెలియచేసింది. దేశభక్తి, సమాజసేవ, నిజాయితీల ప్రాధాన్యాన్ని ప్రబోధించింది. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి జన్మదినం వైశాఖశుద్ధ దశమి కాగా, ఆమె ఆత్మార్పణ దినం మాఘశుద్ధ విదియ. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో రాజరాజనరేంద్రుడు నిర్మించిన వాసవీ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. నగరేశ్వరస్వామి ఆలయంలోనే కన్యక ఆత్మార్పణ చేసిన చోట కన్యకాంబ ఆలయం ఉంది.
– సిహెచ్ ఆంజనేయులు