365 రోజులు నీరు ఉబికి వచ్చే కమండల గణపతి ఆలయం

హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతలకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమపూజ అందుకునేవాడు. పార్వతీదేవి కారణంగా ఏర్పడిన రెండు గణపతి ఆలయాలలో ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రములో కేదార్నాధ్ జ్యోతిర్లింగ సమీపంలో గౌరీకుండ్ వద్ద ముండ్కతియా గణపతి ఆలయం.

ఇచ్చట గణేశుడు తలలేకుండా కేవలం మొండెంతో దర్శనం ఇస్తాడు శివుడు కైలాసం వచ్చినప్పుడు పార్వతి తన నలుగుపిండితో బొమ్మనుచేసి ప్రాణంపోసి కావలి ఉంచి స్నానమునకు వెళ్లినది. శివుడువచ్చి బాలుడు అడ్డగించడంవల్ల కోపంతో త్రిశూలంతో బాలుని తల నరికినాడు. పిమ్మట పార్వతికోరికతో గజాసురుని తల ఆబాలుని మొండెమునకు జతపరచి మరలబ్రతికించి గజానానుడు అనునామం ఇచ్చాడు.

గజాననుడే పిమ్మట శివపార్వతులు మరియు దేవతలచే గణనాధునిగా మరియు ప్రధమపూజ్యుడుగా నియమింపబడి దీవించబడినాడు. అట్టి వినాయకుడుని పూజించనిదే హిందువులు ఆచరించు పూజా కార్యక్రమమేధీ ప్రారంభంకాదు.

దేశంలో అన్నిప్రాంత్రాలలో అనేక గణేశుని ఆలయాలు ఉన్నవి. ఆవిధంగానే పార్వతీదేవి నవగ్రహాలలో శక్తివంతుడైన శని కలిగించు బాధ ఉపశమింప చేసుకోవడానికి తపస్సు చేయడానికి ముందుగా విఘ్నములు కలుగకుండా కర్ణాటక రాష్ట్రం చిక్కమగులూరు జిల్లా కొప్ప తాలూకాలో కేసవే గ్రామంలో. కమండల గణపతి దేవాలయం నందు గణపతిని ప్రతిష్టించినది. చిన్నదైననూ ఆలయం చారిత్రిక ప్రాముఖ్యతకలిగి సుమారు వేయి సం.లకు పూర్వం నిర్మితమైంది.

కేసవే గ్రామం చిక్కమగళూరు మరియు షిమోగా జిల్లాల సరిహద్దులో ఉంది. ఆలయం జిల్లా ప్రధానకేంద్రం చిక్కమగళూరు నుండి 61 కిమీ దూరంలోనూ, తాలూకా ప్రధానకేంద్రం కొప్పా నుండి 11 కి.మీ, షిమోగా నుండి 71 కి.మీ. మరియు రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి 293 కి.మీ దూరంలో ఉన్నది. షిమోగా లేదా చిక్కమగులూర్ కానీ రైలులోప్రయాణించి అచ్చటినుండి రోడ్డుమార్గంలో కేశవేగ్రామం చేరుకోవచ్చు.

స్థలపురాణం ప్రకారం శని వక్రదృష్టి కారణంగా శివుని భార్య పార్వతీదేవి అనేక సమస్యలను ఎదుర్కొన్నది. అందువల్ల పార్వతి శనికలిగించు భాధలు భారంగా భావించింది. దేవతలు పార్వతీదేవిని ‘భూలోకం’ నందు శనిగురించి తపస్సు చేయమని సలహాయిచ్చారు. పార్వతి తపస్సు చేయడానికి భూమిపై తగిన ప్రదేశంకోసం వెతకి ‘ ప్రస్తుత ఆలయానికి 18 కిలోమీటర్లు దూరంలో ఉన్న ‘మృగవధే’ అనుప్రదేశం తనతపస్సుకు అనువైనదిగా భావించింది.

అప్పుడు బ్రహ్మచారి రూపంలో వినాయకుడు సృష్టించబడ్డాడని పురాణం తెలుపుతున్నది. పార్వతీదేవి తన తపస్సుకు ఆటంకం కలగకుండా శని దోషం పోగొట్టుకోవడానికి పార్వతీ దేవి గణపతిని ప్రతిష్ఠించింది. పార్వతీదేవికి కలిగిన ‘శనిదోషం’ ఈఆలయం వల్ల పరిష్కరించబడింది. పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం కూడా భక్తులు దర్శనం చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం ఆలయంలో పార్వతీదేవిచే స్థాపించబడిన గణేశుదు. ‘సుఖాసనం’ భంగిమలో బ్రహ్మచారి రూపంలో కమండలం ధరించి ఒకచేత్తో ప్రీతికరమైన ‘మోదకం’ ధరించి, మరోచేయి ‘అభయహస్త’ ముద్రికతో దర్శనంఇస్తాడు గణేశుని ముందు పుష్కరిణి కమలం ఆకారంలో ఉండి పుష్కరిణిలోని నీరు అన్నివేళలా సంవత్సరమంతయూ గణపతిని తాకుతూ ప్రవహిస్తుంది.

పుష్కరిణి బ్రహ్మీనదియొక్క మూలమని అందువల్ల పుష్కరిణికి బ్రహ్మతీర్థమనీ, కమండలంధరించి దర్శనమిచ్చిన గణపతికి కమండల గణపతిఅనే పేరువచ్చినదని స్థలపురాణం. భక్తులకు మేలుచేసేందుకు పార్వతీదేవి తీర్థాన్ని సృష్టించిందని తెలుస్తూంది. కొండల్లోనుంచి భూగర్భంలో చేరుకుని పుష్కరిణిలో ప్రత్యక్షమయ్యే నీటిలో అనేక ఔషద గుణాలు ఉన్నాయి.

ఇక్కడి నుండే బ్రహ్మీనది జన్మించి సుదూరంగా ప్రయాణించి తుంగానదిలో కలుస్తుంది. గణపతిని దర్శించుకొంటే చేసిన సకలపాపాలు పోతాయని చెబుతారు. ఆలయాన్ని సందర్శించు భక్తుల కోరికలను గణేశుడు తీరుస్తాడు కాబట్టి ఈ ఆలయం చాలా పవిత్రమైనది.

భక్తులు ఈ క్షేత్రంలో గణపతిని ధ్యానంచేసి గణేశుని ఆశీస్సులు పొందుతారు.. విజయానికీ, చదువులకూ, జ్ఝానాన్ని అందించే ఆది దేవుడు వినాయకుడు. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు మరియు విజ్ఞావినాశకుడు కావున విఘ్నేశ్వరుడు అంటూ అనేక పేర్లతో కొలుస్తారు.. భక్తులు కేవలం ఆలయాన్ని సందర్శించడం లేదా ఆలయంలో కమండల గణపతికి సేవ లేదా ధ్యానం చేయడం ద్వారా వారి కోరికలన్నీ ఒకేసారి నెరవేరుతాయి.

కమండల గణపతి దేవాలయం ‘శని దోషం’ ఉన్న ప్రజలకు పరిష్కారం. దేశం నలుమూలల నుండి వచ్చిన ‘శని దోషం’ వలన భాధించబడుచున్న భక్తుల దోషనివారణ కోసం పరిష్కారంగా ఈఆలయం అత్యంత ప్రాముఖ్యత కలిగింది. ఇక్కడ నీటిని సేవిస్తే చాలు..అనేక రుగ్మతలు మాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. కమండల గణపతి ఆలయంలోని’కమండల తీర్థం’ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది, .భక్తులు పుస్కరిణినీటితో స్నానంచేస్తే అన్నికష్టాల నుండి ఉపశమనం పొందుతారని మరియు ప్రధానంగా ‘శని దోషాన్ని’ అధిగమిస్తారు.

ఇక్కడి తీర్థాన్ని స్వీకరించి అనారోగ్య సమస్యలన్నిటిని దూరం చేసుకోవడం కొరకు అనేక మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు కమండల గణపతి దర్శనం ప్రత్యేకించి విద్యార్థులకు ఒక వరం. విద్యా విషయాలలో వైఫల్యాలు పోగొట్టి చదువులో రాణించడానికి గణపతి ‘విద్యా గణపతి’ గా జ్ఞాన ప్రదాత.. ఇంతటి విశిష్టత కలిగిన కమండల గణపతి దేవాలయం విశిష్టత కలిగినది అయిననూ ఆలయము తగినంత ప్రాచుర్యంపొందలేదు.

ఆలయం ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12-00 వరకూ తెరచిఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఎటువంటి పూజలు జరుపరు. అందువల్ల ఈ దేవాలయానికి వెళ్లాలనుకొంటే తెల్లవారుజామున ఇక్కడికి వెళ్లడం ఉత్తమం. గ్రామం కావున బస లభ్యంకాదు చిక్కమగులూరు లేదా షిమోగానందు బసచేసి వెళ్లవలసి ఉంటుంది.

(సేకరణ)
శేషార్జున్ దారా

Leave a Reply