– ఈ జగన్ చేసేవన్నీ దొంగ పనులు.. మోసాలే
– అవినీతికి అడ్డాగా ఎమ్మిగనూరు
– తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
ఎమ్మిగనూరు: ‘‘నాలుగేళ్లుగా స్పందనకు కాల్ చేస్తే స్పందనే లేదు. ఇప్పుడు ‘జగన్‌కు చెబుదాం..’ అంటూ మరో కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఈ పరదాల జగన్‌కు నేను చెబుతున్నా.. ఎన్నికల ముందు 25 ఎంపీలనివ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానంటివి.. ఆ హోదా ఏమైంది…? కడప ఉక్కు పరిశ్రమ ఎప్పుడు పూర్తి చేయగలవో చెప్పగలవా..? ఒక్కచాన్స్ ఇస్తే 2.30 లక్షల ఉద్యోగాలిస్తానని నిరుద్యోగ తమ్ముళ్లను మోసం చేశావు. ఆ ఉద్యోగాలు ఎప్పుడిస్తావో చెప్పగలవా..?’’ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని నిలదీశారు.
యువగళం పాదయాత్ర 85వ రోజైన ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 7 కి.మీ. మేర సాగింది. ఇప్పటి వరకు లోకేశ్.. 1,088.1 కి.మీ. యాత్ర పూర్తిచేశారు. ఎమ్మిగనూరు టీడీపీ ఇన్చార్జి బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ మంత్రులు అమర్నాథ్రెడ్డి, భూమా అఖిలప్రియ లోకేశ్‌తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై లోకేశ్ నిప్పులు చెరిగారు.
ఈ జగన్ చేసేవన్నీ దొంగ పనులు.. మోసాలేనని మండిపడ్డారు. అందుకే ప్రజల మధ్యకు రావాలంటే జగన్‌కు భయపడుతున్నారన్నారు. 2019లో ఒక్కచాన్స్ అంటే నమ్మి అధికారమిస్తే.. దళితులు, బీసీలు, మైనార్టీలు, మహిళలు, రైతులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలనూ మోసం చేశారని మండిపడ్డారు. 2024లో ఆ తప్పును దిద్దుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ పరదాల జగన్.. చంచల్ గూడా జైలు పేరును.. జగన్గూడా జైలుగా మారుస్తూ జీవో తెచ్చారని లోకేశ్ ఎగతాళి చేశారు. సైకో జగన్ అనాలోచిత నిర్ణయాలు వల్ల చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. టీడీపీ అధికారంలోకి చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామని చెప్పారు. గతంలోగానే నూలు, రంగులు, పట్టు సబ్సిడీపై ఇస్తామన్నారు. మగ్గం ఉన్న వారికి 200 యూనిట్లు, మరమగ్గం వారికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేస్తామన్నారు. అంతకుముందు వీవర్స్ కాలనీలో చేనేత కార్మికరాలు కామర్తి జయశ్రీ ఇంటికి వెళ్లి వస్త్రాల ఉత్పత్తి, మార్కెటింగ్, ప్రభుత్వ సాయం ఎలా అందో అడిగి తెలుసుకున్నారు.
‘తెలుగుదేశం పార్టీ ఎమ్మిగనూరుని అభివృద్ధికి కేరాఫ్ అడ్ర్‌సగా చేస్తే.. వైసీపీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అవినీతికి అడ్డాగా మార్చారు. ఆయన సొంత ఊరు కడిమెట్లలో సర్వే నంబరు 773/బీ1, 773/బి2, 707, 895-8లో ప్రభుత్వ, అటవీ భూమి వంద ఎకరాలు కబ్జా చేశారు. అదే ఊళ్లో దేవదాయ భూమి సర్వే నంబరు 70, 583లో 30 ఎకరాలు ఏకంగా తన పేరున ఆన్లైన్ చేసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు తక్కువేవీ తినలేదు.. నాగులదిన్నె గ్రామంలో సర్వే నంబరు 94లో ఏకంగా హిందు శ్మశానాన్నే కబ్జా చేసి షాపులు కడుతున్నారు’ అని లోకేశ్ ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా నిజాలు గ్రహించి, జగన్ సర్కారును ఇంటికి పంపించాలని లోకేష్ పిలుపునిచ్చారు.