-ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చట్టబద్ధత లేదు- ప్రజా ప్రయోజనం లేదు
-మాజీ మంత్రి కళా వెంకట్రావు
దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడిగా జగన్ రెడ్డి రికార్డులకెక్కారనే విషయాన్ని సజ్జల మర్చిపోయారా? అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతిలో లేని, వేయని రింగ్ రోడ్డు, పైగా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అంశంలో క్విడ్ ప్రోకో అంటూ చట్టవిరుద్ధంగా జీవో 89 విడుదల చేశారు.
తన అవినీతి మరకను చంద్రబాబుకు అంటించేందుకు జగన్ రెడ్డి ఇన్నర్ రింగ్ రోడ్ కుట్రకు తెరలేపారు. చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్ లపై తప్పుడు కేసులు పెట్టారు. లింగమనేని కుటుంబం 1986-2014కు మధ్య భూములను కొనుగోలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆస్తులు కొనుగోలు చేయలేదనే విషయాన్ని గుర్తించాలి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కారణంగా లింగమనేని కుటుంబం 14 ఎకరాల భూమిని కోల్పోయింది.
లింగమనేని భూములు ప్రతిపాదిత ఇన్నర్ రింగ్‌రోడ్డుకు 4 నుంచి 10 కి.మీ దూరంలో ఉన్నాయనేది వాస్తవం. ఆయన ఆస్తులు ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని లేవు. లింగమనేని ఏవిధంగా లబ్ధి పొందారో ఇప్పటివరకు ఆధారాలు చూపలేకపోయారు. జగన్ రెడ్డి మెప్పు కోసమే అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుతో కూడిన మాస్టర్ ప్లాన్ ను హైకోర్టు సమర్థించింది. ఇప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది. సబ్ జుడీషియస్ గా ఉన్న రమేష్ ఆస్తిని అటాచ్ చేయడం చట్టం ముందు నిలవదని జగన్ రెడ్డికి తెలిసి కూడా రాజకీయ దుష్ప్రచారం కోసమే అటాచ్ మెంట్ నాటకం ఆడుతున్నారు.
చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం ఆయన పేరున రిజిస్టర్ చేయలేదని జీవోలోనే పేర్కొన్నారు. లింగమనేని గెస్ట్ హౌస్ కు చంద్రబాబు రెంట్ చెల్లిస్తున్నారు. ఆ గెస్ట్ హౌస్ కు యజమాని లింగమనేని అయినప్పుడు అందులో చంద్రబాబు క్విడ్ ప్రోకో ఎలా ఉంటుందనే విజ్జత లేకుండా తప్పుడు జీవో ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రజాప్రయోజనం ఏమీలేదు, చట్టబద్ధత లేదు. ఒక అబద్దాన్ని పదేపదే చెప్పి నిజం చేయాలని చూస్తున్నారు. మీ ఆటలు సాగబోవు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కాగితాల మీదనే ఉన్నది. భూమిపై రోడ్డు నిర్మించలేదు. ఇందులో క్విడ్ ప్రోకో ఎలా జరుగుతుందో చెప్పాలి. తన నేరాలు, కుంభకోణాలు కప్పిపెట్టుకునేందుకు జగన్ రెడ్డి ఎదుటివారికి తన అవలక్షణాల్ని అంటకట్టడాన్ని ప్రజలు విశ్వసించరు, సహించరు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా పెల్లుబికుతున్న ప్రజాగ్రహాన్ని తప్పించుకోలేరు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై దుష్ప్రచారం చేసి లబ్ధిపొందాలనే మీ దుర్బుద్ధికి ప్రజలే తగిన సమాధానం చెబుతారు.