– ప్రభుత్వాసుపత్రుల్లో సానుకూల వాతావరణం మరియు భావన కల్పించేందుకు చర్యలు
-సరైన నిర్వహణ, పారిశుధ్యం, అవాంతరాలు లేని ఓపీ సేవలు, హాజరుపై దృష్టి
-వైద్యులు, రోగనిర్ధారణ పరికరాలు & యంత్రాల పనితీరును పర్యవేక్షణ
-అన్ని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో అందుబాటులో సూపర్ స్పెషాలిటీ సేవలు
-అన్ని ఆసుపత్రుల్లో అధునాతన శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి చికిత్సలు
-మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వల్ప, మధ్య , దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక
– వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి : ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య మంత్రిత్వ శాఖ పాత 11 అనుబంధ బోధనాస్పత్రులతోపాటు కొత్తవాటితో సహా అన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యత మరియు పనితీరులో మార్పు కోసం ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వచ్చే రోగులు మరియు సందర్శకులకు మెరుగైన సేవలు మరియు సంతృప్తిని కలిగించడమే దీని లక్ష్యం.
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, మీడియా నివేదికలు మరియు గత రెండు నెలల్లో వైద్య ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ వివిధ ఆసుపత్రులను సందర్శించినపుడు వెల్లడైన విషయాల ఆధారంగా ఈ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. ఈ ప్రణాళికను స్వల్ప, మధ్య మరియు దీర్ఘకాలిక చర్యల ద్వారా అమలు చేస్తారు.
వైద్య ఆరోగ్య మంత్రి సూచన మేరకు ఆగస్టు 13న 15 ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్, జిజిహెచ్‌ల సూపరింటెండెంట్‌లు, ఇతర ఆసుపత్రుల ప్రతినిధులతో ఆరోగ్య శాఖ జరిపిన భేటీలో వివిధ సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలతో పాటు పలు అంశాల పై దాదాపు ఏడు గంటలకుపైగా చర్చించి, తీసుకోవాల్సిన చర్యలను నిర్ధారించారు.
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్యసేవల్లో మార్పు తీసుకురావడానికి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యవధిలో తీసుకునేందుకు నిర్ణయించిన చర్యల వివరాలు ఇలా వున్నాయి.
స్వల్పకాలిక చర్యలు (3-6 నెలల్లో)…..
1. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ (జిజిహెచ్) గురించి ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని సృష్టించడం కోసం ఆసుపత్రి ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలి. మరుగుదొడ్లు, మూత్రశాలలు మొదలైన వాటి నిర్వహణ మరియు బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ను పటిష్టంగా నిర్వహించాలి. తద్వారా ఆసుపత్రుల పట్ల ప్రజల్లో సదాభిప్రాయాన్ని కలుగజేయాలి
2. ప్రాంగణంలోని వివిధ సౌకర్యాలు/భవనాలకు రోగులు/అటెండెంట్‌లకు సులభమైన మార్గనిర్దేశం చేయడం కోసం సరైన సూచిక బోర్డులు ఉండేలా చూడడం. విశాలమైన జిజిహెచ్‌ల ప్రాంగణాల్లో వారు గమ్యాన్ని వెతుక్కోవడానికి కష్టపడకుండా స్ట్రెచర్లు, వీల్‌చైర్లు, మహాప్రస్థానం వాహనాలు మొదలైన వాటి డిమాండ్ మరియు లభ్యతను సరిగా అంచనా వేసి అవసరాల మేరకు వాటిని ఏర్పాటు చేయాలి.
4. మగ నర్సింగ్ ఆర్డర్లీ (ఎంఎన్ఓ)లు, మహిళా నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్ఎన్ఓ)లు, ల్యాబ్ మరియు ఇతర సాంకేతిక నిపుణుల కొరతను తక్షణమే అంచనా వేసి పూరించడానికి చర్యలు ప్రారంభించాలి
5. రోగులు/అటెండెంట్‌లను సాదరంగా ఆహ్వానించి సానుకూల దృక్పథంతో వారికి సాయాన్ని అందించడానికి ఫ్రంట్ డెస్క్/రిసెప్షన్ సేవలను బలోపేతం చేయాలి
6. మరిన్ని ఓపి కౌంటర్లు ప్రారంభించి , నర్సింగ్ ట్రైనీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల భాగస్వామ్యంతో రోగులు ఆసుపత్రులకు చేరుకున్న అరగంటలో ఓపి నమోదయ్యేలా చేసి అవాంతరాలు లేని అవుట్ పేషెంట్ (ఓపి) సేవల్ని అందుబాటులోకి తేవాలి
7. అవుట్ పేషెంట్ సేవల గదుల సమీపంలోనే వివిధ పరీక్షల కోసం రక్త నమూనాలు ఇచ్చేలా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి
8. ప్రతి వైద్యుడు రోజుకు అందించే ఓపి సేవల్ని పర్యవేక్షించి, అవసరాలు, ప్రమాణాల మేరకు చేస్తున్నారా లేదా అనేది విశ్లేషించాలి
9. సీనియర్లు/స్పెషలిస్ట్ వైద్యులు తప్పనిసరిగా ఓపి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి
10. రక్త పరీక్ష నివేదికలు, ఇతర రోగనిర్ధారణ నివేదికలు మధ్యాహ్నం 2.00 గంటలలోపు రోగులకు అందుబాటులో ఉంచడంతో పాటు వాటిని రోగుల ఫోన్ లకు పంపాలి
11. సాయంత్రం పూట ఓపి సేవలు మ.2.00- సా4.00 సమయంలో నిర్వహించాలి. ఈ సమయంలో వివిధ పరీక్షల నివేదికల మేరకు రోగులకు తగిన వైద్య మార్గదర్శకత్వం / ప్రిస్క్రిప్షన్ అందించాలి. వారు మరుసటి రోజు లేదా తర్వాత రావలసిన అవసరం లేకుండా చూడాలి
12. వివిధ రోగనిర్ధారణ పరికరాలు మరియు యంత్రాల పనితీరు లభ్యత మరియు రీఏజెంట్ల లభ్యతను
సమర్ధవంతంగా పర్యవేక్షించి రోగులు బయటి నుండి పరీక్షలు చేయవలసిన అవసరం లేకుండా చూడాలి
13. బయటి నుండి పరీక్షలు చేయించుకోవాలని రోగిని సూచించినప్పుడు, దానికి సంబంధించిన కారణాల్ని లిఖితపూర్వకంగా తెలపాలి. దీనితో సంబంధిత అన్ని పరికరాలు/రిఏజెంట్‌ల లభ్యత, పనితీరును సరైన విధంగా అంచనా వేయవచ్చు.
14. ఫీడ్‌బ్యాక్ మరియు ఫిర్యాదుల సేకరణ వ్యవస్థ దాదాపు మరుగునపడినందున ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలపై రోగులు/అటెండెంట్‌ల నుండి ఫీడ్‌బ్యాక్ సేకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. వాటి ఆధారంగా దిద్దుబాటు చర్యల్ని చేపట్టాలి.
15. ఫిర్యాదుల సేకరణకు తాళం వేసి పెట్టెలను అన్ని ప్రధాన స్థలాల్లో ఏర్పాటు చేయాలి.
16. రోగుల సహాయకులు యథేచ్ఛగా ఆసుపత్రి విభాగాల్లో సంచరించకుండా వారి కదలికల్ని నియంత్రించాలి. ఓపీ రోగుల కదలికల్ని ఆమేరకు నియంత్రించాలి. ఐపి రోగుల సహాయకుల కదలికల్ని కూడా అవసరం మేరకు నియంత్రించాలి
17. లంచాలు/అవినీతికి వ్యతిరేకంగా ఆసుపత్రి ప్రాంగణం అంతటా ప్రభావవంతమైన సందేశాల్ని ప్రదర్శించాలి. వాటికి వ్యతిరేకంగా రోగులు/అటెండెంట్లు ‘104’కి కాల్ చేసి ఫిర్యాదు చేయడాన్ని ప్రోత్సహించాలి
18. ‘108’ సర్వీస్ సిబ్బంది మరియు క్యాజువాలిటీ వైద్యుల బృందం మధ్య సమర్ధవంతమైన సమన్వయం ఉండేలా చూడాలి. తీసుకొస్తున్న రోగి పరిస్థితిని ముందుగానే సంబంధిత వైద్యులకు చెప్తే వారు సన్నద్ధంగా ఉంటారు
19. వైద్యులు మరియు ఇతర అన్ని శాఖల సిబ్బంది నిర్దేశించిన పని వేళల మేరకు విధులకు హాజరయ్యేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇప్పటికే రూపొందించిన వివిధ యాప్‌లు, డ్యాష్ బోర్డుల ద్వారా వారి పనితీరును మదుపు చేయాలి
20. ప్రతి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిర్ణీత వ్యవధిలో అందించిన ఓపి సేవలు, ఇన్ పేషెంట్ సేవలు, కష్టతరమైన మరియు ఇతర ప్రధాన శస్త్రచికిత్సలు/సేవల వివరాల్ని క్రమం తప్పకుండా మీడియా ద్వారా ప్రజలకు అందించాలి
మధ్యకాలిక (ఒక సంవత్సరం) వ్యవధిలో చేపట్టాల్సిన చర్యలు:
1.ఎక్స్-రే యంత్రాలు, సిటి స్కాన్లు, ఎంఆర్ఐ, వెంటిలేటర్లు, అల్ట్రాసౌండ్ సిస్టమ్స్ వంటి వివిధ రోగనిర్ధారణ పరికరాలు మరియు యంత్రాలు అవసరాల మేరకు లభ్యమయ్యేలా చర్యలు చేపట్టాలి
2. వివిధ విభాగాల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మరియు టెక్నీషియన్లు, ఎంఎన్ఓలు/ఎఫ్ఎన్ఓలు వంటి కీలక పోస్టులను భర్తీ చేయడం.
3. ఆపరేష్ థియేటర్లలో సూక్ష్మ జీవుల సంక్రమణ(ఇన్ఫెక్షన్ )ను నివారించడానికి ప్రమాణాలకు అనుగుణంగా శీతలీకరణ (ఏసీ) వ్యవస్థను పటిష్టం చేయాలి
4. ఓపీ, ఐపి ప్రదేశాలలో వీడియోల ప్రదర్శన, వైద్యుల సలహాల ద్వారా సందేశాలను నిరంతరం అందించాలి.
5. ఆసుపత్రుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు వాటి పనితీరు ఆధారంగా అన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులకు రేటింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
దీర్ఘకాలిక చర్యలు:
1.అన్ని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో-ఎంటరాలజీ, ఎండోక్రైనాలజీ, క్యాన్సర్ కేర్ ( రేడియేషన్ ఆంకాలజీ, రేడియో థెరపీ మరియు సర్జికల్ ఆంకాలజీ ) సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం.
2. గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవ మార్పిడి సేవల్ని అన్ని చోట్లా కల్పించడం
3. వైద్యులకు సమర్థవంతమైన డిజిటల్ లైబ్రరీ సేవను ప్రారంభించడం.
4. నాణ్యతతో కూడిన ఆధునిక వైద్య సేవలు అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలి
ఈ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక , సంబంధిత ఇతర నిర్ణయాల్ని వైద్య ఆరోగ్య శాఖ అన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులకు తెలియజేసి, వివిధ అంశాలపై పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి కూడా ఇదే విధమైన ప్రణాళికలు త్వరలో నిర్ధారించబడతాయి.