-ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించాలి
-అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పర్యాటకులను ఆకర్షించాలి
– ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర పర్యాటక విధానాన్ని ఫిబ్రవరి 10వ తేదీలోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, అభయారణ్యాలు, ఆలయాల ప్రాతిపదిక చేసుకొని పాలసీని రూపొందించాలని సీఎం సూచించారు.
తెలంగాణ రాష్ట్ర సమగ్ర పర్యాటక విధానంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. దేశీయంగా వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పర్యాటక పాలసీలతో పాటు అంతర్జాతీయంగా ప్రముఖమైన పాలసీలను అధ్యయనం చేసి తెలంగాణ పర్యాటక పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణకు దేశీయ పర్యాటకులనే కాకుండా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించాలన్నారు.
పర్యాటక రంగంలో బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్‌సీ) పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీ ఉండాలని సీఎం తెలిపారు. ఎంఎన్‌సీలు పెట్టుబడులు పెట్టినప్పుడు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు ఏర్పడతాయని.. అప్పుడు పర్యాటకుల ఆకర్షణ సులవవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో కవ్వాల్, ఆమ్రాబాద్ పులుల అభయారణ్యాలను సఫారీ టూరిజానికి అనువుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమ్మక్క-సారక్క, రామప్ప దేవాలయం, లక్నవరాలను సర్య్యూట్‌గా తీర్చిదిద్దాలని, నాగార్జున సాగర్, శ్రీశైలం బ్యాక్ వాటర్‌ల్లో కేరళ తరహాలో బోటు హౌస్‌ల ద్వారా పర్యాటకుల సంఖ్య పెరిగేలా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక ప్రదేశాలను కలుపుతూ బౌద్ధ సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్నారు.సమ్మక్క-సారక్క
జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు సమీపంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. సింగపూర్ వంటి దేశాలు తక్కువ ప్రదేశంలో వైవిధ్యమైన ప్రణాళికలతో పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ స్కైవాక్, సర్య్యూట్‌ను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.
అనంతగిరితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వసతులు మెరుగుపర్చాలని సూచించారు. పరిశ్రమలు, ఇతర రంగాల నుంచి వచ్చే ఆదాయమే కాకుండా పర్యాటక రంగం నుంచి వచ్చే ఆదాయం పెరిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరో దశకు చేరుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
సమీక్షలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.