– ఆలయాల ప్రతి సెంటు భూమినీ పరిరక్షిస్తాం
– గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా విధుల నిర్వహణ
– ధూప దీప నైవేద్య పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ. 10 వేలకు పెంపు
– ఆలయాల పునర్నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ
– బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఈ రెండు దస్త్రాలపైనా సంతకాలు
– రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ఎన్‌టీఆర్ జిల్లా: ధర్మో రక్షతి రక్షితః.. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందనే గొప్ప మాటల్ని నమ్ముతూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని.. గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయాల పవిత్రతను కాపాడేందుకు, ఆలయాల ప్రతి సెంటు భూమినీ పరిరక్షించేందుక సమష్టిగా కృషిచేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
విజయవాడ గ్రామీణం, గొల్లపూడిలోని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనరేట్‌లో గురువారం ఉదయం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ధూప దీప నైవేద్య పథకం కింద అర్చకులకు ఇచ్చే మొత్తాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచి, శ్రేయోనిధి నుంచి అందించే దస్త్రంతో పాటు ఆలయాల పవిత్రతను, ఔన్నత్యాన్ని కాపాడేలా ఆలయ పునర్నిర్మాణ పనుల పర్యవేక్షణ, అనుమతులకు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన దస్త్రంపైనా మంత్రి సంతకాలు చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశీస్సులతో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని.. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, పాలక వర్గాల నుంచి వచ్చిన వారికి, శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. మ్యానిఫెస్టో, కూటమి ప్రణాళికలోని అంశాలను ప్రాధాన్యంగా శాఖ అభివృద్ధికి కృషిచేయనున్నట్లు తెలిపారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి వారి సలహాలు తీసుకోవడం జరిగిందని.. ఇదే విధంగా దేవుని ఆశీస్సులు, ప్రధాన పీఠాధిపతులు, మఠాధిపతుల ఆశీస్సులతో ఈ శాఖ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 26 వేలకు పైగా ఆలయాలున్నాయని.. ఆలయాల ఆస్తులు, ఆదాయాల నిర్వహణలో లోపాలను సరిదిద్ది ప్రక్షాళన చేయనున్నామని తెలిపారు. ఆలయాల పవిత్రతను, హిందూ ధర్మాన్ని కాపాడుతూ అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభమైందని పేర్కొన్నారు. పాలక వర్గాల ఏర్పాటుకు కృషిచేయనున్నట్లు తెలిపారు. సచివాలయంలో పూర్తిస్థాయి కార్యాలయం పనులు సాగుతున్నాయని.. జులై 3 తర్వాత ఇది అందుబాటులోకి వస్తుందని.. అందువల్లే కమిషనరేట్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, అడిషనల్ కమిషనర్-1 టి.చంద్రకుమార్, అడిషనల్ కమిషనర్-2 కె.రామచంద్ర మోహన్‌లతో పాటు ఉన్నతాధికారులు ఎం.రత్నరాజు, చంద్రశేఖర్ ఆజాద్, ఆర్‌జేసీలు సుబ్బారావు, మూర్తి, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో కేఎస్ రామరావు, వివిధ ఆలయాల ఈవోలు తదితరులు పాల్గొన్నారు