– బీసీ మంత్రి బద్నామ్ వెనుక ఉన్నదెవరు?
– తెరవెనక నిజాలు మంత్రికి తెలియడం లేదా?
– బీసీ అధికారులే లక్ష్యంగా పేషీ పావులు
– డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కుర్చీకి ఎసరు?
– బీసీలను వేధిస్తున్న మరో వర్గం
– ఆ వర్గ అధికారులకు కీలక పోస్టింగులు
– వారిలో ఏసీబీ కేసులున్నా పట్టించుకోని వైచిత్రి
– మంత్రిని బద్నామ్ చేస్తున్న పేషీ, అధికారులు?
– మంత్రికి తెలియకుండానే పేషీతో బదిలీ రాయ‘బేరాలు’
– ప్రమాదం జరిగిన పరిశ్రమల యజమానులతో బేరాలు?
– మంత్రి ఇమేజీకి పేషీ భారీ డామేజీ
– ‘చక్రం’ తిప్పుతున్న ‘జూనియర్’ అధికారులు?
– పని లేకుపోయినా షేపీలో పోస్టింగులెందుకు?
– ఏ పేషీలోనూ లేని ప్రత్యేకతలు కార్మికశాఖకే ఎందుకు?
– ఒక పేషీలో అంతమంది పనిచేస్తారా?
– పేషీలో తిష్టవేస్తున్న అనధికార పీఆర్వోకు దన్ను
– అనధికార పీఆర్వోతో గిట్టని అధికారులపై మీడియాకు లీకు కథనాలు
– ఆరోపణలకు జవాబు ఇవ్వకుండా ఫ్యాక్టరీస్ అధికారులపై వ్యతిరేక కథనాలు
– ఆరోపణలపై ఇప్పటివరకూ వివరణ ఇవ్వని ఫ్యాక్టరీస్ అధికారులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయనో యువ మంత్రి.. సరిగ్గా ఎన్నికలకు నెలరోజుల ముందు మాత్రమే అమలాపురం వైసీపీ నుంచి టీడీపీలో చేరి, రామచంద్రాపురం టికెట్ సాధించుకున్న నేత. స్థానికంగా పట్టు లేకపోయినా, కులబలం ఆధారంగా పార్టీ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని విజయఢంకా మోగించారు. కానీ.. అదే శెట్టిబలిజ కులంలో క్రేజ్, ఇమేజ్, అనుభవం, ఫాలోయింగ్ ఉన్న సీనియర్ నేత పితాని సత్యనారాయణను కూడా కాదని.. యువకుడైన ఆయనకు తొలిసారి మంత్రి పదవి అవకాశం కల్పించారు. దానికి కారణం నమ్మకం! తమ అంచనాలకు తగినట్లు నడుచుకుంటారన్న నమ్మకం!! ఆయనే కార్మికమంత్రి వాసంశెట్టి సుభాష్. అలాంటి బీసీ యువ మంత్రిపై సొంత వారే కుట్రలు చేసి, ఆయన ఇమేజీని భారీగా డ్యామేజీ చేస్తున్నారంటే నమ్మగలరా?.. నమ్మితీరాలి!
కార్మికమంత్రి వాసంశెట్టి సుభాష్ జిల్లా ఇన్చార్జిగా మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్నారన్న కితాబు అందుకుంటున్నారు. అయితే సొంత శాఖపై ఇంకా పట్టు సాధించలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆయనకు తెలియకుండా, పేషీలో ‘చక్రం’ తిప్పుతున్న ‘జూనియర్’, మరో అధికారి కలసి.. మంత్రిని తప్పుదోవపట్టిస్తున్నారన్న విమర్శలు ఫ్యాక్టరీస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రధానంగా బదిలీలు, థర్డ్ పార్టీ సేప్ఠీ ఆడిట్ ఏజెన్సీ విషయంలో పేషీలోని ఆ ఇద్దరు ఆడుతున్న చదరంగంతో మంత్రి ప్రతిష్ఠ దెబ్బతింటోందని చెబుతున్నారు.
‘జూనియర్’ అంటే సీనియర్లకు హడల్!
ఏ శాఖలో అయినా జూనియర్ అధికారులు, సిబ్బంది సీనియర్లకు భయపడతారు. ఇక సచివాలయంలో అయితే మంత్రి, పీఎస్, ఓఎస్డీ స్థాయి అధికారులయితే అసలు జూనియర్లను పట్టించుకోరు. కానీ ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటులో మాత్రం రివర్సు. సీనియర్ అధికారులు, జిల్లా-రాష్ట్ర స్థాయి అధికారులు మాత్రం ఒక జూనియర్‌కు భయపడిపోతున్న వైచిత్రి ఎవరూ న మ్మకపోవచ్చు. కానీ నిజం. దానికి కారణం అందరి గుట్లు సదరు జూనియర్ గుప్పిట ఉండటమేనట!
సహజంగా పేషీలో ఉద్యోగులు మాత్రమే పనిచేస్తుంటారు. కానీ ఎలాంటి జీతం లేకుండా ఒక సీనియర్ జర్నలిస్టును పేషీలో పెట్టుకోవడం, సదరు జర్నలిస్టుతో తమకు గిట్టని ఉన్నతాధికారులపై చిన్నా చితకా పేపర్లలో.. వార్తలు రాయిస్తున్న విషయం ఇటీవల బట్టబయలయింది. మంత్రి బిజీగా ఉంటారు కాబట్టి ఒకవేళ ఈ విషయం ఆయనకు తెలియకపోయినా, రోజూ పేషీలోనే ఉండేఏ ఓఎస్డీ, పీఎస్‌కు సైతం తెలియకపోవడమే వింత. ఎలాంటి అధికార ఉత్తర్వులు, ఐడి కార్డు లేని వ్యక్తి రోజూ ఒక మంత్రి పేషీకి వస్తుంటే..అధికార రహస్యాలు బయటకు వెళ్లవా అన్నదే ప్రశ్న.
ఇదిలాఉండగా.. పేషీలో ‘చక్రం’ తిప్పుతున్న ఓ ‘జూనియర్’ మంత్రి బంధువుల ఫోన్లను రికార్డు చేస్తారని, వారు తమను దూరం పెట్టినప్పుడల్లా వాటిని తనకు కావలసిన వారికి పంపిస్తుంటారన్న ప్రచారం అధికార వర్గాల్లో జరుగుతోంది. మంత్రి గారికి చెందిన బంధువులు పరోక్షంగా నిర్వహించే థర్డ్‌పార్టీ సేఫ్టీ ఏజెన్సీ వివరాలు, రామచంద్రాపురం నియోజకవర్గంలో కుటుంబ వ్యవహారాలను కూడా సదరు జూనియరే లీక్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అసలు సదరు సదరు ‘జూనియర్’ వద్ద ఉన్న రెండు ఫోన్లలో.. ఒకటి ఫ్యాక్టరీస్‌కు సంబంధించిన సమాచారంతోపాటు, మరో ఫోన్లో ప్రమాదం జరిగే పరిశ్రమల యజమానుల నంబర్లు ఉన్నందున, వాటిని స్వాధీనం చేసుకుని రిట్రీవ్ చేస్తే.. మంత్రి అప్రతిష్ఠకు ఎవరు కారణమన్నది తేలిపోతుందని ఫ్యాక్టరీస్ అధికారులు సూచిస్తున్నారు.
కాగా.. తన పేషీ కేంద్రంగా జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి సారించి, వాటిని చక్కదిద్దుకుని.. ఎన్నికల ముందు వైసీపీ నుంచి చేరినా మంత్రి పదవి ఇచ్చిన సీఎం నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన మంత్రి వ్యవహారశైలి కూడా, అందుకు భిన్నంగా ఉండటం చర్చనీయాంశమయింది. నిజానికి పేషీలో జూనియర్ అసిస్టెంట్ల అవసరం లే కపోయినా, డిప్యుటేషన్ మీద వారిని తీసుకురావలసిన పనిలేదు. ఇక ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటులో తనను అడ్డు పెట్టుకుని పేషీ అధికారులు చేస్తున్న అడ్డగోలు పనులు మీడియాకెక్కుతున్నా, నష్టనివారణ చర్యలు తీసుకోకపోవడం మరో ఆశ్చర్యం.
ప్రధానంగా బీసీ అయిన తనను మాత్రమే కాకుండా.. బీసీ అధికారులే లక్ష్యంగా పేషీ అధికారులు కొందరు ఆడుతున్న చదరంగంలో, మొత్తం బీసీలే నష్టపోతున్న వైనం మంత్రికి ఇప్పటికీ తెలియకపోవడమే వింత. ఫ్యాక్టరీస్‌లో కీలక స్థానంలో ఉన్న బీసీ అధికారుల స్థానంలో తమ కులానికి చెందిన వారికి, తనతోనే పోస్టింగులు ఇప్పిస్తున్న పేషీ తెలివిని మంత్రి ఇప్పటికీ అర్ధం చేసుకోవడం లేదని బీసీ అధికారులు వాపోతున్నారు.
తన పేరు వాడుకుని అప్రతిష్ఠపాలు చేస్తున్న పేషీ ముఠాపై చర్యలు తీసుకోకుండా.. శాఖపై వస్తున్న వ్యతిరేక కథనాలను బూచిగా చూపించి, డైవర్షన్‌తో పబ్బం గడుపుకుంటున్న పేషీ ముఖ్యుల మాట వింటున్న వైనంపై అధికారుల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
నిజానికి డైరక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్గా ప్రస్తుతం పనిచేస్తున్న అధికారికి ఎప్పుడో పూర్తి బాధ్యత ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంకా ఇన్చార్జిగానే కొనసాగిస్తున్నారు. ఆయనకు అంతకుముందే ఆ ఇన్చార్జి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఆయన కంటే జూనియర్‌కు ఇన్చార్జి ఇచ్చారు. అందుకోసం అప్పటికే ఆ సీటులో ఉన్న మరో అధికారితో బలవంతంగా సెలవు పెట్టించారన్న వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి. కాగా బీసీ అయిన ఇప్పటి ఇన్చార్జి తమ మాట వినడం లేదన్న ఆగ్రహంతో ఆయనను కూడా తొలగించాలన్న పేషీ అధికారుల ప్రయత్నాలు జరుగుతుండటంపై , బీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సహజంగా డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ స్ధాయి అధికారితో మంత్రి లేదా కమిషనర్, జాయింట్ కమిషనర్ మాత్రమే నేరుగా మాట్లాడి ఆదేశాలు జారీ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు పేషీలో పనిచేసే ఆ ఇద్దరు మాత్రమే ఫోన్లు చేసి, ఫలానా అధికారిని బదిలీ చేయాలని సూచిస్తున్న పరిస్థితి ఏర్పడిందని, ఫ్యాక్టరీస్ కార్యాలయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ మంత్రికి తెలియకుండానే, ఆయన పేరు చెప్పి జరుగుతున్న వ్యవహారాలేనంటున్నారు.
ఫ్యాక్టరీలకు పేషీ నుంచి నేరుగా ఫోన్లు?
సహజంగా ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటులో జరిగే అన్ని వ్యవహారాలను ఆయా జిల్లా- రాష్ట్ర అధికారులే పర్యవేక్షిస్తుంటారు. కంపెనీలపై ఫిర్యాదులు, ఆరోపణలపై వారే చర్యలు తీసుకుని, పైస్థాయి అధికారులకు నివేదిస్తారు. అంటే ఈ విషయంలో జిల్లా స్థాయి నుంచి డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి పాత్ర మాత్రమే ఉంటుంది. ఇది ఏ ప్రభుత్వంలోయినా జరిగే ప్రక్రియనే.
కానీ కార్మికశాఖ పేషీలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. పేషీలో తిష్టవేసి ‘చక్రం’ తిప్పుతున్న జూనియర్ సౌజన్యంతో, అందుకు సహకరిస్తున్న మరో అధికారి మాత్రం.. నేరుగా పరిశ్రమల యజమానులకు ఫోన్లు చేస్తున్న వైనం వివాదంగా మారింది. అసలు పేషీ వ్యక్తులకు నేరుగా ఫ్యాక్టరీ యజమానులకు ఫోన్లు చేసే అధికారం ఎవరు కట్టబెట్టారు? సీఎస్సార్ నిధుల పేరుతో కంపెనీలపై చేస్తున్న ఒత్తిళ్లు వారి నుంచి పరోక్ష వసూళ్లకా? లేక పరిశ్రమలో కాంట్రాక్టు పనులకా? అన్నదే ప్రశ్న.
పేషీ పెత్తనమేంటని అధికారుల ఆగ్రహం
కాగా తమపై పేషీ పెత్తనం ఏమటని ఫ్యాక్టరీస్ జిల్లా-రాష్ట్ర స్థాయి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మాకు నేరుగా ఫోన్లు చేసే ఆదేశించే అధికారం పేషీకి ఎవరిచ్చారు? నిజానికి వాళ్లకంటే మేమే సీనియర్లం. మా కింద పనిచేసే వారికి మేం భయపడాల్సి వస్తోంది. దానికి కారణం ఎవరు? దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తే నిజాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని ఫ్యాక్టరీస్ జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటుపై వస్తున్న ఆరోపణలపై శాఖాపరమైన విచారణకు బదులు.. పేషీలో ‘జూనియర్’ తెచ్చిపెట్టుకున్న ‘అనధికారి పీఆర్వో’ అయిన సీనియర్ జర్నలిస్టుతో, చిన్నా చితకా పత్రికల్లో ఎదురుదాడి చేయిస్తున్న తీరే ఆశ్చర్యం. అయితే అందులో ‘మహానాడు’ ఆధారాలతో రాసిన కథనాలకు నిర్దిష్టమైన సమాధానాలు లేకుండా, బీసీ మంత్రి కార్యక్షేత్రం నుంచి.. బీసీ అధికారుల పైనే తుపాకి గురిపెట్టడం పేషీ అతితెలివికి నిదర్శనం.
– ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్‌పై గత ఏడాదిన్న నుంచి మీడియాలో వస్తున్న వార్తా కథనాలను ఇప్పటిదాకా ఎందుకు ఖండించలేదు? అంటే అవి నిజమనే కదా అర్ధం? డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌గా ఉన్న అధికారితో బలవంతంగా సెలవుపెట్టించి, ఆయన స్థానంలో జూనియర్ అధికారికి ఇన్చార్జి ఇచ్చింది నిజం కాదా? ఇప్పడు అదే స్థానంలో ఉన్న ఒక బీసీ అధికారిని తొలగించి, తమ మాట వినే మరో అధికారిని ఆ స్థానంలో తెచ్చేందుకు పేషీ అధికారులు ప్రయత్నించడం అబద్ధమా?
– కాకినాడ, ఏలూరు, నెల్లూరు, అనకాపల్లి సర్కిళ్లలో ఒకటి మినహా.. మిగిలిన మూడు సర్కిళ్లలకూ పేషీలో ‘చక్రం’ తిప్పుతున్న ‘జూనియర్ ’ ‘వర్గాని’కి చెందిన వారేనన్నది నిజం కాదా? ఏసీబీ విచారణతో పాటు గతంలో కలెక్టర్ సరెండర్ చేసిన అధికారికి కీలకమైన అనకాపల్లికి పోస్టింగ్ ఇచ్చిన మాట నిజం కాదా? కడపలో సస్పెండయిన అధికారిపై విచారణ పూర్తి కాకుండానే కీలకమైన ఏలూరులో పోస్టింగు ఇచ్చిన మాట అబద్ధమా? నారాయణరెడ్డి అనే అధికారి బదిలీ, ఏసీబీ విచారణ వెనుక పేషీ హస్తం ఉన్న మాట నిజం కాదా?
– అనకాపల్లి, ఏలూరు, కాకినాడ సర్కిళ్లలో తమ బినామీలయిన ధర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ ఏజెన్సీలతోనే ఆడిట్ చేయించుకోవాలని పరిశ్రమలపై ఒత్తిడి చేస్తున్న మాట నిజం కదా? అది అబద్ధమని నిరూపించే వివరాలు విడుదల చేయగలరా?
– ప్రమాదం జరిగే పరిశ్రమలకు పేషీ ముఖ్యులు ఫోన్లు చేసి రాయ‘బేరాలు’ చేస్తున్న మాట నిజం కాదా? సీఎస్సార్ నిధుల పేరుతో గోదావరి జిల్లాలకు చెందిన పరిశ్రమల నుంచి, పేషీ ముఖ్యులు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణ నిజం కాదా? వీటిపై ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్తో సంబంధం లేని వారితో ఒక విచారణ కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చగలరా?
– ప్రస్తుతం అనకాపల్లి, ఉమ్మడి విశాఖలోని ఇద్దరు అధికారులపై విజిలెన్స్, ఏసీబీ విచారణ పెండింగ్‌లో ఉన్నా వారికి పోస్టింగ్ ఇచ్చిన మాట అబద్ధమా? వీరిలో వైసీపీ అధినేత జగన్ సోదరుడయిన కడప ఎంపి అవినాష్‌రెడ్డి సిఫార్సు లేఖతో, ఇంకా ప్యాక్టరీస్ డిపార్టుమెంట్లో హవా సాగిస్తున్నమాట నిజం కాదా? విశాఖలో పనిచేసిన కళింగ కులానికి చెందిన అధికారిని ఆకాశరామన్న లేఖ ఫిర్యాదుతో సస్పెండ్ చేసిన మాట అబద్ధమా?
– కార్మికమంత్రి పేషీలో అనధికార పీఆర్వో ఎవరూ లేరని.. ఆయనతో తమకు గిట్టని ఉన్నతాధికారులపై వ్యతిరేక కథనాలు రాయించడం లేదని ఖండించగలరా? కాకినాడ ప్రధాన కేంద్రంగా వెలువడే వాట్సాప్ పత్రికల్లో.. పేషీలో తాను ప్రతిష్ఠించిన సీనియర్ జర్నలిస్టుతో, తనకు గిట్టని అధికారులపై వ్యతిరేక కథనాలు రాయిస్తున్న వైనం నిజం కాదా?
– కాకినాడలో తమ మాట వినని ఇద్దరిని అనంతపురం జిల్లాకు బదిలీ చేసి, తమ మాట వినేఅధికారిని పేషీలో ‘చక్రం’ తిప్పుతున్న వారు, ఆ స్థానంలో తెచ్చుకున్న మాట అబద్ధమా? పేషీలో ‘చక్రం’తిప్పుతున్న ఓ జూనియర్.. కాకినాడ కేంద్రంగా తన అత్త, బావమరిది పేరుతో ధర్డ్‌పార్టీ సేఫ్టీ ఏజెన్సీ నిర్వహిస్తున్నమాట నిజం కాదా?
పెట్టుబడుల వేళ ఏమిటీ పంచాయితీ?
ఓ వైపు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలంటూ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ కాళ్లకు బలపాలు కట్టుకుని దేశ విదేశాలు తిరుగుతున్నారు. వారి కృషి ఫలితంగా అరేక సంస్ధలు రాష్ట్రానికి రానున్నాయి. ఇదంతా కేవలం వారిపై ఉన్న నమ్మకం వల్లే.
మరోవైపు ఉన్న పరిశ్రమలను బెదిరిస్తూ, వారిని వేరే రాష్ట్రాలకు వెళ్లేలా వ్యవహరిస్తున్న పేషీ ముఖ్యుల వ్యవహారం ప్రభుత్వ ప్రయత్నాలకు విఘాతంగా మారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా త్వరలో విశాఖ కేంద్రంగా పార్టనర్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో, ఇలాంటి చర్యలు పెట్టుబడులకు అవరోధంగా మారతాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
ఇప్పటికే కమ్మ-కాపు-క్షత్రియ కులాలకు చెందినవారి పరిశ్రమలను పేషీలో ‘చక్రం’ తిప్పుతున్న వారు బెదిరిస్తున్న వైనం సీఎంఓ, సీఎస్, విజిలెన్స్‌కు చేరిన విషయం తెలిసిందే. దీనిపై ఫ్యాక్టరీస్ డిపార్టుమెంట్తో సంబంధం లేని అధికారులతో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్న సూచన పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తోంది.