(షఫీ షేక్)
“మావికాయ” అని ఒక క్రొత్త రకం పచ్చడి
ఈ పచ్చడి తయారు చేయడానికి మామిడి ముక్కలు, నూనె, ఆవపిండి, మిరప్పొడి, ఉప్పు, మెంతిపిండి, ఆవాలు వగైరాలు కావాలి.
వేడి వేడి అన్నంలో ఈ “మావికాయ”, కాసింత నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.
ఓయ్.. ఇదేమిటి? “మావికాయ” ఏమిటి? “ఆవకాయ” కదా? ఎప్పటి నుండో ఉన్న మ్యాంగో పికిల్ కి క్రొత్త పేరు పెట్టేసి అమ్మేస్తే ఊరుకుంటామా? అని మీరనొచ్చు..
AI పవర్డ్ వాషింగ్ మెషిన్ తెలుసా? మార్కెట్లో క్రొత్తగా వచ్చింది, తెగ అమ్ముడుపోతోంది. దీని గొప్పదనం ఏమిటంటే ఇచ్చిన బట్టల ఫాబ్రిక్ ని అర్ధం చేసుకుని, దానికి తగ్గట్టుగా టెంపరేచర్ సెట్ చేసుకుంటుంది.
ఇదేమిటి, బేసిక్ టెంపరేచర్ సెట్టింగ్స్ అని ఎప్పటి నుండో ఉన్నదే కదా? దానికి ఏఐ పేరు ఎందుకు పెట్టారు?
అయ్యా, మెషీన్లు తెలివి మీరలేదు. మనుషులే మరింత తెలివి మీరుతున్నారు. ఎప్పటి నుండో ఉన్న ఫీచర్స్ కి కాసింత మెరుగులు దిద్ది, కాసిన్ని మెరుపుల పూసలు అంటించి అమ్ముతున్నారు.
శరీరపు ఉష్ణోగ్రతల్లో అసమానతలను, జరుగుతున్న మార్పులను, భావోద్వేగాలను “ఎలా అర్థం చేసుకోవాలో” మెషీన్లకు ఎప్పుడో చెప్పాం. వాడుతూనే ఉన్నాం.
ఎలా అర్థం చేసుకోవాలో మాత్రమే చెప్పాం. అర్ధం చేసుకున్నాక ఏం చేయాలో చెప్పలేదు. ఆ పనే ఇప్పుడు చేస్తున్నాం.
శరీరపు టెంపరేచర్ చూడటానికి థర్మామీటర్ ఉంది. పల్స్ చెక్ చేయడానికి స్టెతస్కోప్ ఉంది. గుండె పని తీరు తెలుసుకోవడానికి ఎలెక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసిజి) ఉంది.
అలాగే, మనిషి నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా అనేది తెలుసుకోవడానికి పాలిగ్రాఫ్ టెస్టూ ఉంది.
ఇన్నాళ్లూ అవి రిపోర్ట్ మాత్రమే ఇచ్చాయి. ఆ రిపోర్ట్ లో నెగటివ్ ఉంటే ఏం చేయాలో, పాజిటివ్ అయితే ఏం చేయాలో ఫీడ్ చేస్తే తుదిమెరుగులు అద్దినట్టే. అంటే, వాటిల్లో AI ని మరింత అభివృద్ధి చేసినట్టే.
అంటే, మన భావోద్వేగాలను గుర్తించే పరికరాలు ఉన్నాయి, స్పందించి ఏం చేయాలో చెప్పడమే తరువాయి.
అయితే – ఇది ప్రారంభం మాత్రమే.
AI కి పునాదులు 100 సంవత్సరాల క్రితమే పడ్డాయి. ఆ దిశగానే అడుగులు వేస్తూ వచ్చారు. అందులో భాగమే ఇన్నాళ్ల నుండి చూస్తున్న అభివృద్ధి.
ఇప్పుడు అది వేగవంతం అయింది.
డ్రైవర్ లేని కార్లు రోడ్ల మీద దర్శనం ఇస్తున్నాయి. ఎగిరే మోటార్ సైకిళ్ల డెమో మొన్నే చూశాను. వీటి ముందు భావోద్వేగాలకు స్పందించడం అనేది చాలా చిన్న విషయంగా తోస్తోంది.
స్కానింగ్ నివేదికను విశ్లేషించి, మెషీన్లే శస్త్రచికిత్సలు చేసే రోజులు రాబోతున్నాయి.
