– దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
వరంగల్: రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గొప్ప కార్యాచరణతో ముందుకు సాగుతున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
బల్దియా పరిధిలోని 34 వ డివిజన్ లోని శివనగర్ రామాలయంలో బల్దియా సాధారణ (జనరల్) నిధులు రూ. 35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులకు అధికారులు, ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. నేటి వరకు ఆలయ అభివృద్ధికి ఆలయ కమిటి ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ప్రశంసించారు.
బల్దియా సాధరణ నిధులతో పాటు, దేవాలయాభివృద్ధికి అవసరమైతే దేవాదయ శాఖ నుంచి కూడా నిధులు అందిస్తామని మంత్రి సురేఖ హామీ ఇచ్చారు. స్థానిక మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని మంత్రి భరోసానిచ్చారు. తాను దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రతీ దేవాలయం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు.
ప్రస్తుతం యాదగిరిగుట్ట దేవాలయం గోపురం స్వర్ణతాపడం పనులు మొదలయ్యాయని, త్వరలో వేములవాడ దేవాలయ గోపురం స్వర్ణతాపడం పనులు మొదలు పెడతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం దేవాలయాల్లో కనీస వసతుల మీద దృష్టి పెట్టకపోవడంతో భక్తులు చాలా ఇబ్బందుల ఎదుర్కొన్నారని మంత్రి సురేఖ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకంతో దేవాలయాలకు వెళ్ళే మహిళా భక్తులు సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఆ మేరకు వసతుల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చర్యలు చేపట్టామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో శివనగర్ రామాలయ్యాన్ని వైభవోపేతంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే, స్థానిక డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు