మీకేమో మినరల్ వాటర్.. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలేమో మురికినీళ్ళు
– కొండా సురేఖ వరంగల్ కు ఏం ఒరగబెట్టారని జూబ్లిహిల్స్ లో ప్రచారం చేస్తున్నారు?
– కూతురును స్టార్ క్యాంపెయిన్ చేస్తే రేవంత్ రెడ్డి అరాచకాలు పూసగుచ్చినట్టు చెప్పేది
– గన్ కల్చర్, రౌడీ రాజ్యం ను జూబ్లిహిల్స్ కు తేవాలని చూస్తున్నారా?
– కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ బీఆర్ఎస్ గెలుపు కోసమే
కాంట్రవర్సీ, కమిషన్ లు, కాంట్రాక్ట్ లు తప్ప ప్రజల కష్టాల గుర్తించి పట్టింపు లేని పట్టుదల గల మంత్రి కొండా సురేఖ
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో షేక్ పేట డివిజన్ ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ ప్రచారం పై, వరంగల్ లో తాగు నీటి సరఫరా సమస్యల పై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ కాంగ్రెస్ ను గెలిపించడం కోసం కాదు. బీఆర్ఎస్ విజయం కోసమే అన్నట్టుంది. భర్తను కోల్పోయిన ఒక్క ఆడబిడ్డను ఓడించడానికి, సీఎం సహా మొత్తం మంత్రివర్గం దండుపాళ్యం బ్యాచ్ లా దిగుతుంది.
కొండా సురేఖ వరంగల్ కు ఏం ఒరగబెట్టారని జూబ్లిహిల్స్ లో ప్రచారం చేస్తున్నారు? కనీసం తాగునీరు అందించలేని మీరు షేక్ పేటలో ఏం ఉద్ధరిస్తారు?మీకేమో మినరల్ వాటర్.. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలేమో మురికినీళ్ళు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోజుకో దుర్వార్త తో వరంగల్ పరువు రాష్ట్ర స్థాయిలో తీస్తున్న ఘనత కొండా సురేఖ దే. కొండా సురేఖ కు బదులు ఆమె కూతురును స్టార్ క్యాంపెయిన్ చేస్తే రేవంత్ రెడ్డి అరాచకాలు పూసగుచ్చినట్టు చెప్పేది.
మీరు వరంగల్ కు తెచ్చిన గన్ కల్చర్, రౌడీ రాజ్యం ను జూబ్లిహిల్స్ కు తేవాలని చూస్తున్నారా? ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటి వరకు అత్యంత చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే, మంత్రి కుమార్తె డైరెక్ట్ గా తిట్టినా చర్యలు తీసుకోలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ స్టార్ క్యాంపెయిన్ ల లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ విడుదలైన తర్వాత మాకు స్పష్టంగా అర్థం అయింది. అది కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాదు బీఆర్ఎస్ గెలుపు కోసమని.
త్వరలో చీఫ్ స్టార్ట్ క్యాంపెయిన్ రేవంత్ రెడ్డి కూడా వస్తాడట. ఆ దెబ్బ తో బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపు 100% కన్ఫర్మ్ అయినట్టే. ఎందుకంటే, హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి రోడ్లు ఎక్కితే పేద ప్రజలు తరిమేలా ఉన్నరు. హైడ్రా, మూసి ప్రక్షాళన పేరుతో హైదరాబాద్ పేద ప్రజలను గూడు లేని పక్షులను చేసిండు. ఇటీవలే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచిండు. నీళ్ల గోస, కరెంట్ కష్టాలు, ఇంటర్నెట్ అంతరాయం, శాంతి భద్రతల వైఫల్యం అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
ఈ లిస్ట్ లో అత్యంత ప్రముఖమైన చీఫ్ క్యాంపెయిన్ మా జిల్లా మంత్రి షేక్ పేటను షేక్ చేయడానికి మా వరంగల్ నుండి విచ్చేసిన మహిళామణి నోరు తెరిస్తే కాంట్రవర్సీ, కాలు బయట పెడితే కాంట్రవర్సీ, కమిషన్ లు, కాంట్రాక్ట్ లు తప్ప ప్రజల కష్టాల గుర్తించి పట్టింపు లేని పట్టుదల గల మంత్రి కొండా సురేఖ . ఆమె దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కాదు. అధర్మ శాఖ మంత్రి.
అటవీ శాఖామంత్రి కాదు ఆటవిక శాఖ మంత్రి. ఎందుకంటే, వారి శాఖ పేరుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అయినా చేసేవాణ్ణి అధర్మం పనులే. తెలంగాణ ప్రజలకే ఇలవేల్పు, దక్షణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న కోడెలనే కబేళాలకు తరలించిన గొప్ప ధార్మికురాలు ఆమె.
ఒక స్త్రీ అయిండి ఒక ఆడపిల్ల సమంత విషయంలో ఎంత ఆటవికంగా మాట్లాడింది లోకమంతా చూసింది. ఇటీవలే ఇంకో అడుగు ముందుకేసి ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానికి కంతకే తుపాకీ పెట్టింది. అందుకే ఆమె అటవీ శాఖ కాదు ఆటవిక శాఖ మంత్రి. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు రక్షణగా గొడుగు పడితే, కాంగ్రెస్ మంత్రులు మాత్రం కమిషన్ల కోసం వ్యాపారస్తుల కంతలకు తుపాకి పెడుతున్నారు.
కొండా సురేఖ తనను గెలిపించిన వరంగల్ ప్రజలను గాలికి వదిలేసి, జూబ్లిహిల్స్ లో ఎందుకు ఊరేగుతున్నారు? వరంగల్ తూర్పు ప్రజలకు సమాధానం చెప్పాలి. కూటిలో రాయి తీయలేనమ్మ ఏట్లె రాయి తీస్తా అన్నదట. వరంగల్ లో కనీసం త్రాగడానికి స్వచ్ఛమైన నీళ్లు కూడా లేని పరిస్థితి దాపురించింది. వరంగల్ ప్రాంతం నీళ్ల విషయంలో ప్రపంచానికే ఆదర్శం. చూసినా గొలుసుకట్టు చెరువులు, మంచినీటికి, సాగు నీళ్లకు కొదవ లేని ప్రాంతం. కానీ, కాంగ్రెస్ పాలన వల్ల కొండా సురేఖ నిర్వాకం వల్ల వరంగల్ ప్రజలే మురికి నీళ్ళను తాగాల్సిన దుస్థితి దాపురించింది.
గత కొద్ది రోజులుగా తాగునీటి సరఫరా సరిగ్గా లేక పచ్చగా మారిన రంగునీళ్లను వరంగల్ ప్రజలు తాగలేక, వాడుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ, ఆ సమస్యలను గాలికొదిలేసి కొండా సురేఖ జూబ్లిహిల్స్ లో ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది.
షేక్ పేట ప్రజలారా.. మీరు కూడా ఆలోచించండి. మీరు కానీ మా కొండా సురేఖ మాటలు విని హస్తం గుర్తుకు ఓటేస్తే గెలిచి అవతల పడ్డ తర్వాత షేక్ పేట కు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఖాయం. మీ పని షేర్ మార్కెట్ లో పెట్టిన ఫండ్ లెక్కనే అవ్వడం ఖాయం జాగ్రత్త.
షేక్ పేట ప్రజలకు మేము ఈ వాటర్ బాటిల్ లు ఇంటికి ఒకటి ఇస్తాం. మీ ఇంటికి కొండా సురేఖ రాగానే అమ్మా మాక్కూడా ఇలాంటి నీళ్లు తెస్తామని చెప్పడానికి వచ్చారా!? ముందు మిమ్మల్ని ఎన్నుకున్న వరంగల్ తూర్పు ప్రజలకు తాగే నీళ్లు సక్కగా ఇవ్వమని, మీ నియోజకవర్గం లో ఉన్న ఎంజీఎం ను బాగు చేయండని నిలదీయండి. కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ లో ఆకాశాన్ని తాకేలా 24 అంతస్తుల హాస్పిటల్ ను నిర్మించ తలపెడితే 2 ఏళ్లలో 2 అంగుళాలు కూడా ముందుకు సాగడం లేదు.
అసలు మీరు దృష్టి పెట్టాల్సింది. జూబ్లిహిల్స్, షేక్ పేట కాదు. ఎంజీఎం లో ఇద్దరు పిల్లలకు ఒకే సిలిండర్ పెట్టీ తల్లిదండ్రులు బిక్కుబిక్కి మంటూ తమ పిల్లల ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అరిగోస పడుతున్నారు. అది చూడండి. పేద ప్రజల పెద్దాసుపత్రి ఎంజీఎం లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
బెడ్ లు సరిపడా లేవు, మందులు లేవు, సిబ్బంది సరిపడా లేరు. అసలు మెయింటెనెన్స్ నిధులు లేవు, ఆకరికి పోస్టుమార్టం గదిలో ఏసీ లు లేక శవాలు సైతం వాసన కొడుతున్నాయి. ఎంజీఎం చుట్టుపక్కల ప్రజలు ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళిపోయే దుస్థితి దాపురించింది. ఈ సమస్యలపై ముందు దృష్టి సారించండి.
Powerfull peoples comers from powerful places కానీ, దురదృష్టవశాత్తు powerful place నుండి ఒక Visionless, Violence, very Controversial leader కొండా సురేఖ వచ్చింది. మా వరంగల్ ప్రజలు ఎక్కడికి పోయినా మీ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కదా కొండా సురేఖ ఏంటి అలా మాట్లాడుతది. అని నిలదీస్తే ఇజ్జతి పోతుంది.ఒకప్పుడు వరంగల్ అంటే ఢిల్లీ లో కూడా గజ్జుమనేది.
పీవీ నరసింహారావు, హయగ్రీవచారి లాంటి నేతలు ప్రతినిత్యం వహించిన గడ్డ ఇది. ఇప్పుడు మాత్రం వరంగల్ కు మీ లాంటి నాయకులు ఎమ్మెల్యేలు, మంత్రులు అవ్వడం వల్ల ఇజ్జతి పోయే కాడికి వచ్చింది. వసూళ్లు, సెటిల్మెంట్ ల మీద ఉన్న శ్రద్ధ వరంగల్ ప్రజల బాగోగుల మీద వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పై దృష్టి లేదు.
స్వయంగా మంత్రి కుమార్తె అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి అరాచకాల గురించి పూసగుచ్చినట్టు చెప్పింది. అయినా రేవంత్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ము లేదు. కనీసం స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు.
అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రేవంత్ రెడ్డి అంత చేతకాని ముఖ్యమంత్రిని చూసి ఉండం. ముఖ్యమంత్రి గన్ కల్చర్ తెచ్చిందని ఆరోపించినా ఏం చేయలేని స్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు.
కొండా సురేఖ కుమార్తె స్టార్ క్యాంపెయిన్ అయితే మొకిలలా, మంచిరేవు, మంచిర్యాల, కోకాపేట ఏం జరుగుతుందో అన్ని బయటకి వస్తాయ్. వివిధ ప్రాంతాల సంగమం జూబ్లిహిల్స్ కాబట్టి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలంతా ప్రచారానికి వస్తున్న మంత్రులను నిలదీయాలి.
జూబ్లిహిల్స్ ప్రజలంతా ఈ మంత్రులు మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడగటానికి వస్తే మహిళలలైతే మీరు ఇస్తామన్న 2500 ఏవీ అని, విద్యార్థినిలు అయితే స్కూటర్లు ఏవని, నిరుద్యోగ భృతి ఎక్కడని నిలదీయండి. అలాగే వృద్ధులు, వికలాంగులు మీరు పెంచిన పెన్షన్లు ఎక్కడా అని అడగండి.
మంత్రులు మాకాడికి వచ్చి కాంగ్రెస్ ను గెలిపించాలని ఓట్లు అడుగుతున్నారు. మరి మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఇవన్నీ ఇస్తున్నారా? పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం ఇస్తున్నారా!? ఈ రెండేళ్లలో మీ నియోజకవర్గాన్ని ఎంత బాగు చేశారు. అని నిలదీయండి. ఒక్క ఆడబిడ్డను ఒడిగొట్టడానికి ఇంతమంది దండుపాళ్యం బ్యాచ్, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం జూబ్లిహిల్స్ ను చుట్టూ ముట్టింది. జూబ్లిహిల్స్ ప్రాంతంలో తెలంగాణ నలుమూలల నుండి వచ్చిన ప్రజలు ఉంటారు. కాబట్టి, అందరూ ఇక్కడ మకాం వేసిన మంత్రుల మొహాలు వాడిపోయేలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలపై నిలదీయాలి.