– తీవ్ర నష్టంలో ముదినేపల్లి మండలం పెదపాలపర్రు రైతులు
-ప్రభుత్వ సహాయం కోరుతూ విజ్ఞప్తి
పెదపాలపర్రు (ముదినేపల్లి మండలం), ఏలూరు: మొంథా తుఫాను ప్రభావంతో వీచిన బలమైన గాలులు, భారీ వర్షాలు ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటను నేలమట్టం చేశాయి. ముందుగా కోతకు వచ్చే రకాలను సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. రైతులు చెబుతున్నట్లుగా, పంట కోత దశకు చేరి కొన్ని రోజుల్లో చేతికి అందబోతోంది.
కానీ అకస్మాత్తుగా వీచిన గాలులు, వర్షాలతో పొలాలు నీటమునిగిపోయాయి. “మరికొన్ని రోజుల్లో కోత వేయబోతున్నాం. కానీ ఒక్కసారిగా గాలి, వర్షం వచ్చి మొత్తం పంట నీటిపాలైంది. మా కష్టం, ఖర్చు అంతా వృథా అయిపోయింది” అని గ్రామానికి చెందిన పంచాయితీ వార్డు సభ్యుడు శ్రీనివాస్, రైతు వెంకటేశ్వరరావు వాపోయారు.
లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నీరు నిలిచిపోయి ధాన్యం కుళ్లిపోయే ప్రమాదం నెలకొంది. నీరు త్వరగా దిగకపోతే మిగిలిన పంట కూడా నష్టపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సాగు కోసం అప్పులు తీసుకున్న చిన్న, కౌలు రైతులు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, నష్టాన్ని అంచనా వేసి, నష్టపరిహారం అందించాలని పెదపాలపర్రు రైతులు కోరుతున్నారు. పంట బీమా త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.