Suryaa.co.in

Andhra Pradesh

మల బురద సమస్యను అధికమించేలా మొబైల్ సెప్టిక్ ట్రీట్‌మెంట్ యూనిట్

స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు
గంటకు 6000 లీటర్లను శుధ్ది చేయగల అత్యాధునిక సాంకేతికత

మల బురద శుద్ది సమస్యను పరిష్కరించే క్రమంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. పారిశుద్ధ్య రంగంలో వినూత్న మార్పులు, సరికొత్త పరిష్కారాలను అన్వేషిస్తూ మల బురదను శుద్ది చేయగలిగిన మొబైల్ సెప్టిక్ ట్రీట్‌మెంట్ యూనిట్ లను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి జరుగుతుందన్నారు.

ఏ ప్రాంతంలోనైనా సమర్ధవంతంగా పని చేసేలా రూపొందించిన ఈ యూనిట్ పనితీరును మంగళవారం మంగళగిరి తాడేపల్లి పురపాలక సంస్ధ పరిధిలో స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంధం చంద్రుడుకు సంబంధింత సిబ్బంది వివరిస్తూ మా ఈ యూనిట్ గంటకు 6000 లీటర్లను ప్రాసెస్ చేయగల అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంటుందన్నారు.

మొబైల్ సెప్టిక్ ట్రీట్‌మెంట్ యూనిట్ సేకరించిన మల బురదను శుద్ది చేసి స్వచ్చమైన నీరు, కొంపోస్ట్ గా విడగొడుతుందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క అకాంక్షలకు అనుగుణంగా మల బురదను శుద్ది చేయటం పర్యావరణ రక్షణకు దోహదపడుతుందన్నారు.

గంధం చంద్రుడు మాట్లాడుతూ.. మొబైల్ సెప్టిక్ ట్రీట్‌మెంట్ యూనిట్ ల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రెండు వంతున మనకు కేటాయించిందని, టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తీసుకు రావాలని ఉందని వివరించారు. ఈ యంత్రం అధునాతన సాంకేతికత, అధిక ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా, మల బురదను వ్యవసాయ వినియోగ సంపదగా మార్చుతుందని గంధం చంద్రుడు వివరించారు.

ఇప్పటికే కేరళలో ఈ యంత్రం మంచి పనితీరును కనబరుస్తుందన్న సమాచారం ఉందని, అన్నివిషయాలను లోతుగా పరిశీలిస్తామని తెలిపారు. స్వచ్చ నగరాలు, స్వచ్చ ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల మద్దతు కోరుతున్నామన్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడమే లక్ష్యంగా స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ అడుగులు వేస్తుందన్నారు.

స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలను సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ పురోగమిస్తున్న తరుణంలో మొబైల్ సెప్టిక్ ట్రీట్‌మెంట్ ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాలు శాశ్వతమైన మార్పును తీసుకు వచ్చే అవకాశం ఉందని గంధం చంద్రుడు వివరించారు.

LEAVE A RESPONSE