Suryaa.co.in

Andhra Pradesh

అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు కొత్త చట్టం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు

ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకుని వస్తామని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి స్పష్టం చేశారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో చిలకలూరిపేట 10వ క్లస్టర్‌ పరిధిలోని సుబ్బయ్యతోటలో బుధవారం జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఉప ప్రణాళిక ద్వారా వారి నిధులు వారికే అందజేసి బీసీల రక్షణ కు నిబద్ధతతో పనిచేస్తామని తెలిపారు.

తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో బీసీ ఉప ప్రణాళిక ద్వారా రూ.50 వేల కోట్లను బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ద్వారా రాయితీ రుణాలుగా అందించామన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ వారిని వంచించిన ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికీ కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పైగా 74 మందికి పైగా బీసీ నాయకులను క్రూరంగా నరికి చంపిన జగన్‌ ముఠా మాయమాటలు నమ్మే పరిస్థితిలో జనం లేరన్నారు. ఈ విషయాలతో పాటు జగన్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలంతా ఇంటింటికీ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రత్తిపాటి సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

LEAVE A RESPONSE