ఆంధ్రప్రదేశ్ లోని పోలీసులకు ఇప్పుడు కొత్తగా ఓ కొత్త బెడద వచ్చి పడింది.
ఏబీ వేంకటేశ్వర రావు ఒక పదవీ విరమణ చేసిన డీజీపీ ర్యాంక్ అధికారి. రాష్ట్రం లో ఇప్పుడు ఉద్యోగం లో ఉన్న ప్రతి ఐపీఎస్ అధికారీ ఆయనకు జూనియరే. ఆయన 1989 బ్యాచ్ అధికారి. కొంతమంది ఐతే సబ్ జూనియర్లు కూడా.
పోలీసు విధుల్లో ప్రస్తుతం ఉన్న ప్రతి ఐపీఎస్ అధికారీ 1989 తరువాతి బ్యాచ్ లకు చెందిన వారే, ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్త కూడా 1992 బ్యాచ్ కు చెందిన వారే. అంటే ; ఏబీవీ కంటే ఆయన మూడేళ్లు జూనియర్.
అయితే, ఏబీవీ లో మాత్రం చూట్టానికి ” పోలీస్ లక్షణాలు ” కనిపించవు.
మొన్న మొన్నటి దాకా, అచ్చమైన రైతు బిడ్డలాగా లాల్చీ, పంచె కట్టు, భుజం మీద కండువా తో కనిపించేవారు.
ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న వీడియోలు చూస్తుంటే, ఈ మధ్య ఆహార్యం మారినట్టు కనబడుతున్నది. ఖద్దరు చొక్కా, ప్యాంటు ధరిస్తున్నారు.
ఈ విషయాన్నే ఈ మధ్య ” విజిల్ ” అనే పాపులర్ యూ ట్యూబ్ ఛానల్ ఎడిటర్ సుభాకర్ ఆయనను ఒక ఇంటర్వ్యూ లో అడిగితే, ” అవును. సంప్రదాయాన్ని, ఆధునికతను ఇది ప్రతిబింబిస్తున్నది అనుకుంటున్నాను ” అని ఏబీ వేంకటేశ్వర రావు సమాధానం ఇచ్చారు.
(ఆయన ఇటీవలి అమెరికా పర్యటన సందర్భంగా మాట్లాడిన అన్ని ఎన్ఆర్ ఐ సభల్లో కూడా ఇదే ఆహార్యం తో వీడియోల్లో కనిపించారు. )
అంత పధ్ధతి గా, సంసార పక్షంగా, సంప్రదాయ రీతిలో కనిపించే ఏబీ వేంకటేశ్వర రావు…. ఏపీ పోలీసులకు మాత్రం ఓ కొత్త బెడద గా తయారైనట్టున్నారు.
వైకాపాసురుల చేతుల్లోంచి రాష్ట్రం విముక్తి చెందిన తరువాత కూడా, పోలీసులను చాలా చోట్ల ” ఇంగువ వాసన” వదలడం లేదు. ‘పాలకులు మారారు ‘ అనే స్పృహ కూడా వారిలో కొరవైనట్టు కనబడుతున్నది.
దానితో, “అప్పటి ” బాధితులకు ఇప్పటికీ మోక్షం ఉండడం లేదు.
దీనికి తోడు, వైకాపాసురులలో కొందరు ఒళ్ళంతా పసుపు పెయింట్ వేసుకుని, తమ అకృత్యాలను సాగిస్తూనే ఉన్నారు మహాప్రభో అని బాధితులు చేసే అర్తనాదాలు…. అభివృద్ధి హోరు లో పడి ఎటో కొట్టుకుపోతున్న పాలక పెద్దల చెవి దాకా చేరడం లేదన్న భావం, ఏబీవీలో బలం గా గూడు కట్టుకున్నట్టు కనబడుతున్నది.
స్వయంగా ఆయనే బాధితుడు కదా! . మామూలు బాధితుడు కాదు.బాధిత రత్న.
అఖిల భారత సర్వీస్ అధికారులలో ఆయనను మించిన బాధితుడు….
వైకాపాసురుల పాలన లో మరొకరు లేరు. గతం లో లేరు, భవిష్యత్ లోనూ ఉండబోరు.
అందుకే, రంగం లోకి దిగారు.
పై పెచ్చు, ఈ మట్టిలోనే పుట్టి…, ఈ మట్టిలోనే పెరిగిన మట్టి మనిషి ఏబీ వేంకటేశ్వర రావు. అందుకే, ఆ మట్టి వాసనలను ప్రతిబింబించే ఆహార్యం తో సహజీవనం ప్రారంభించారు.
తన తోటి బాధితులకు ఏదో ఒకమేరకు… ఎంతో కొంత న్యాయం లభించాలనే పట్టుదలతో, అడుగులు వేస్తున్నారు.
కోడి కత్తి కేసులో ఐదేళ్లు జైలు లో మగ్గిన శ్రీనివాస్ కేసు న్యాయస్థానం లో ఉన్నందున, పోలీసులను కలవాల్సిన పని ఆయనకు పడలేదు.
కాకినాడ – గొల్లల మామిడాడ దళితుడు సుబ్రహ్మణ్యం మర్డర్ & డోర్ డెలివరీ కేస్ లో, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల్ని వెంటబెట్టుకుని వెళ్లి, కాకినాడ ఎస్ పీ బిందు మాధవ్ ను కలిసి న్యాయం చేయండి అని అడిగారు( ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు పాతికేళ్ళ క్రితమే ఆయన ఎస్ పీ గా పనిచేశారు ) బిందు మాధవ్ క్షణాలలో స్పందించారు. ఆ నిరుపేద దళిత కుటుంబానికి తక్షణ ఉపశమనం లభించింది.
విజయవాడ ” గులక రాయి ఫేమ్ ” బాధిత యువకుడిని వెంటబెట్టుకు వెళ్లి, విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలిసి, ఈ బాధితుడి కి న్యాయం చేస్తారా… లేదా అని అడిగారు ( ఏబీవీ… ఆ విజయవాడ కమిషనర్ గా రెండు పర్యాయాలు పనిచేశారు ).
మొన్నటికి మొన్న నూజివీడు నియోజక వర్గం ముక్కొల్లుపాడు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తెలుగుదేశం ముసుగు వేసుకున్న వైకాపాసురులు మహిళల పై పాల్పడుతున్న ఆగడాలను పట్టించుకోరా అని ప్రశ్నించారు. ముక్కొల్లుపాడు అంటే – “ఏబీవీ కుప్పం” నియోజకవర్గం.
ఈ రకం గా, రాష్ట్ర ఇంటలిజెన్స్ బాస్ గా పని చేసిన డీజీపీ ర్యాంక్ అధికారి పోలీస్ స్టేషన్లకు, ఎస్ పీ ల ఆఫీస్ లకు వెళ్లి ; సందర్శకుల్లాగా కూర్చుని… ఆ అధికారులను కలవడం ( ఉమ్మడి )రాష్ట్ర చరిత్రలో గతం లో ఎన్నడూ చూడని దృశ్యం.
ప్రజా బాహుళ్యం లో దీని ఇంపాక్ట్ ను, ఆయన స్థాయిని, హుందా గా ఆయన అడ్రస్ చేసే అంశాల లోని సీరియస్ నెస్ ని ప్రభుత్వం పరిగణన లోకి తీసుకుంటుందేమో చూడాలి.
లేకపోతే, ఇప్పటికీ, ఇంగువ వాసనను వదిలిపెట్టలేని పోలీసులకు, ఆ పోలీస్ లకు దన్నుగా నిలబడే రాజకీయాసురులకు ఆయన ఒక బెడద గా తయారవుతున్నారనే భావం ప్రజల్లోకి బలం గా వెళ్లే ప్రమాదం లేకపోలేదు.
ఇటువంటి ప్రమాదాల వల్ల, పాలకుల వ్యవహార శైలి పై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతాయి. దానివల్ల పాలకుల పై ” పబ్లిక్ పర్సెప్షన్ ” కు చిల్లులు పడతాయి, ఓజోన్ పొర కు చిల్లులు పడినట్టు.
2004 కు ముందు గానీ , 2019 కు ముందుగానీ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్…. డెవలప్మెంట్ అంటూ రక్తం ధారపోసి మరీ పని చేశారు. కానీ ప్రజలు మెచ్చలేదు. వారికి కావలసింది…. మబ్బుల్లో ఉన్న నీళ్లు కాదు. ముంతలో ఎదురుగా ఉన్న ముంతడు నీళ్ళే.
అది గమనిస్తే, ఏబీ వేంకటేశ్వర రావు కు పోలీస్ స్టేషన్ లు చుట్టూ తిరిగే పని ఉండదు. లేకపోతే, ఆయనకు ఇక ఖాళీ ఉండదు.
– భోగాది వేంకట రాయుడు