రవి అస్తమించని సామ్రాజ్యవాద దేశంగా బ్రిటన్ చరిత్ర పుటల్లో లిఖించబడ్డది. శ్వేత జాతి దురహంకారాన్ని అంతర్జాతీయ సమాజం చవిచూసింది. ప్రపంచీకరణ పర్యవసానంగా సామాజిక – ఆర్థిక – రాజకీయ రంగాలలో సంభవిస్తున్న సానుకూల – ప్రతికూల పరిణామాలను గమనిస్తున్నాం, అనుభవిస్తున్నాం. సామాజిక, ఆర్థిక, దౌత్య సంబంధాలలో సంభవించిన, సంభవిస్తున్న పరిణామాల ముచ్చట కాసేపు అలా ఉంచితే రాజకీయ రంగంపై ప్రభావానికి బ్రిటన్ తాజా పరిణామాలు ఒక ప్రబల నిదర్శనం.
శ్వేత జాతికి చెందని వ్యక్తి, భారతీయ మూలాలున్న రిషీ సునాక్ బ్రిటన్ నూతన ప్రధాన మంత్రి కావడం ఒక సానుకూల పరిణామం. అదే సందర్భంలో వర్గ దృక్పథంతో పరిశీలిస్తే, సంపన్న దేశానికి సంపన్నుడే ప్రధాన మంత్రి అయ్యారని అనవచ్చు. అందులో ఆశ్చర్యం లేదు. సామాన్యుడు సామ్రాజ్యవాద దేశానికి ప్రధాన మంత్రి అయితే నిజంగా ఆశ్చర్యపడాలి.
బ్రిటిష్ సామ్రాజ్యవాద దేశం. కానీ, ఆ దేశానికి ఒక ప్రజాస్వామ్య లక్షణం శతాబ్దాలుగా ఉన్నది. పెట్టుబడిదారీ వ్యవస్థకు సమాధి కట్టాలన్న తాత్విక చింతనతో మార్క్సిస్టు సిద్ధాంతం ఆవిష్కరణకు, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం – విప్లవోద్యమాల నిర్మాణానికి అంకితమైన కారల్ మార్క్స్, ఫెడిరిక్ ఏంగిల్స్, వి.ఐ.లెనిన్ లు నాడు లండన్ ను కార్యస్థానంగా చేసుకొన్నారు. వారికి ఆ అవకాశం ఆ దేశంలో లభించిందన్నది ఒక చారిత్రక వాస్తవం.
నేడు యునైటెడ్ కింగ్డమ్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని స్వయంగా ఆ దేశ నూతన ప్రధాన మంత్రి వెల్లడించారు. రెండు నెలల కాలంలో మూడో వ్యక్తి ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టడం గమనిస్తే ఆ దేశ ఆర్థిక సంక్షోభం రాజకీయ అస్థిరతకు ఎలా దారి తీసిందో బోధపడుతుంది.