ఆ కన్నీటికి 45 ఏళ్ళు!… నేటి తరానికి తెలియని విషాద గాధ

– ఆర్‌ఎస్‌ఎస్‌ విశిష్ట సేవలు
-దివిసీమ ఉప్పెన ఓ ఘోరకళి
-చలించిన ‘ఆర్‌ఎస్‌ఎస్‌’ హృదయం…
-ములపాలెం గ్రామాన్ని పునర్నిర్మాణం కోసం దత్తత
-110 ఇళ్ళను రికార్డు సమయంలో నిర్మాణం
-ఆ ములపాలమే నేటి దీనదయాళ్‌పురం
-50 మందిని కాపాడిన ఆదిశేషారావు!

1977 నవంబర్ 19 శనివారం…
తుపాను… భారీ వర్షం కురుస్తుంది… ఎప్పటిలాగే తీరం దాటుతుందని దివిసీమ ప్రజలు అనుకున్నారు…
కానీ… వారి అంచనా తల్లకిందులయింది. ఇదే తమకు చివరి రాత్రి అని తెలియలేకపోయింది. మీటర్ల కొద్దీ ఎత్తులో ఎత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు కరకట్టలు దాటి ఊళ్ళు మీద విరుచుకుపడ్డాయి. సముద్రుడు ఉగ్రరూపం దాల్చి ఆ ప్రాంత పల్లెలను తనలో కలుపుకొన్నాడు…. గ్రామాలకు గ్రామాలు ఆనవాళ్ళు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి.

ఉప్పెన దాటికి పొంగిన అలలు… సుమారు 83 గ్రామాలను జలసమాధి చేశాయి. ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా శవాలే… కూలిపోయిన ఇళ్ళు… కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి,divi ఉల్లిపాలెం, ఇరాలి, గొల్లపాలెం, బసవనిపాలెం, ఊటగుండం… నాగాయలంక మండలంలోని ఏటిమోగ, సోర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఎలిచెట్లదిబ్బ తదితర మత్సకార ప్రాంతాల్లో వేలాదిమంది అందని లోకాలకు వెళ్ళిపోయారు.

సుమారు 40 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. పది వేల మంది మృత్యువాత పడ్డారని అధికారులు అంచనా వేశారు. కానీ, లెక్కకు తెలీకుండా కొట్టుకుపోయిన శవాలు ఎన్ని వేలో తెలీదు. నాగాయలంక మండలంలోని సోర్లగొంది గ్రామంలో 714 మంది, కోడూరు మండలం పాలకాయతిప్పలో 460 మంది, మూలపాలెం లో 161 మంది మరణించినట్టు అధికారుల రికార్డులు చెబుతున్నాయి.ఆనాటి రోజుల లెక్కల ప్రకారం 172 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. గుప్పెట్లో ప్రాణం పెట్టుకుని ఆలయాలను ఆశ్రయించిన వారు, ఇతర చోట్ల బతికి బట్టకట్టిన లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

ఈ ఉప్పెన కృష్ణాజిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాకింది. రేపల్లె, నిజాంపట్నం తదితర గ్రామాలు కూడా ఈ ఉప్పెన దాటికి దెబ్బతిన్నాయి. నేటికి కూడా నవంబరు వచ్చిందంటే దివిసీమ ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం లేదా తుపాను పుడితే ఆయా ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారు.

400మందిని రక్షించిన దేవాలయం
హంసలదీవిలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నాటి ప్రళయం దాటి నుండి 400 మందిని రక్షించిందని చెబుతారు. ఆనాటి మధ్యాహ్నమే ఆకాశంలో వచ్చిన మార్పులకు అక్కడి ప్రజలు దేవాలయంలో ఆశ్రయం పొందారు. సముద్రంలో ఉప్పొంగిన అలలతో ఊళ్ళు మనుషులు కొట్టుకుపోయినా ఈ దేవాలయంలోకి చుక్క నీరు కూడా చేరలేదని పెద్దలు చెబుతున్నారు.

ఆ నెల 14 నుండి 22 వరకూ చలి గాలులతో కూడిన వర్షం ఆంధ్ర దేశం మొత్తాన్ని గజగజలాడించింది. పశువులు 2.5 లక్షలకు పైగా, కోళ్ళు నాలుగు లక్షలు, ఇళ్ళు 8,504, ఆస్తి 172 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. ఈ ఉపద్రవం యావత్ భారతదేశాన్ని కదిలించింది.

అసువులు బాసిన వారికి గుర్తుగా దివిసీమలో స్తూపాలు నిర్మించారు. నేటికీ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. దివిసీమలో ఎవరిని కదల్చినా ఆ విషాదచాయల గురించి కళ్ళకు కట్టినట్టు చెబుతారు. తుపాను కలిగించిన తీవ్ర నష్టం ఆంధ్ర ప్రదేశ్ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ చేయూత
అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి బాధితులను సాయం చేశాయి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌), దేశంలోని ఇతర ప్రాంతాల సేవా సంస్థలు, సినీ పరిశ్రమకుdivi1చెందిన వారు, రామ‌కృష్ణ మ‌ఠం తదితర సంస్థలు సాయం అందించారు. సొర్లగొంది గ్రామాన్ని పోలీసు డిపార్ట్‌మెంట్‌ దత్తత తీసుకుని గృహాలు నిర్మించింది. ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన ఆర్‌ఎస్‌ఎస్ ములపాలెం గ్రామాన్ని పునర్నిర్మాణం కోసం దత్తత తీసుకుంది. 110 ఇళ్ళను రికార్డు సమయంలో నిర్మించింది. ఆ మూలపాలమే నేటి దీనదయాళ్‌పురం.

50 మందిని కాపాడిన ఆదిశేషారావు!
నాగాయలంక మండలం, సోర్లగొంది గ్రామంలో 50 మంది గ్రామస్తులను పోలాటి ఆదిశేషారావు అనే వ్యక్తి కాపాడారు. 220 కిలోమీటర్ల వేగంతో గాలులు, హోరున వర్షంలో ఆయన అత్యంత ధైర్యసాహసాలుdivi2 ప్రదర్శించారు. అప్పటికే ఊర్లోకి వచ్చిన సముద్రం అలల్లో ఈదుకుంటూ ఆ 50 మందిని గ్రామంలో ఉన్న రామాలయం, పంచాయతీ కార్యాలయంలోకి చేర్చిన మానవతా మూర్తి. ఒక్క సోర్లగొంది గ్రామంలోనే 714 మంది తుపాను ఉప్పెనలో అశువులు బాశారు.

– జికె మూర్తి
( vskandhra.org)

Leave a Reply