— స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తామని, రాబోయే ఐదేళ్లలో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నిలబెడతామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద రూ. 82 లక్షలతో కొనుగోలు చేసిన ఆధునిక చెత్త వాహనం, ట్రాక్టర్లను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం మున్సిపాలిటీ 65 వేల జనాభాతో రెండో స్థానంలో ఉందని చెప్పారు. పంచాయతీ నుంచి మున్సిపాల్టీగా మారినప్పటికీ చెత్త నిర్మూలనకు అవసరమైన సదుపాయాలు అప్పటివరకు అందుబాటులోకి రాలేదని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో నిధులను అనవసర పనులకు వాడుతూ, అవినీతికి పాల్పడిన విషయాలను స్పీకర్ వివరించారు. తహశీల్దారు కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు చేపట్టిన కాలువ పనుల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ కోరగా, కోటి రూపాయల అవినీతి బయటపడిందని, సంబంధిత కాంట్రాక్టర్ వద్ద నుంచి రికవరీ చేయాలని ఆదేశించగా ఇంకా పూర్తవలసి ఉందన్నారు.
ప్రస్తుతం పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన జంపా సురేంద్రను నర్సీపట్నానికి తీసుకువచ్చి ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఉత్తరవాహనిలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి చెత్తను తరలించే చర్యలు తీసుకున్నట్లు వివరించారు. జిందాల్ సంస్థకు ఇప్పటివరకు 400 టన్నుల చెత్తను తరలించామని, ఆ సంస్థ విద్యుత్ తయారీలో దీనిని వినియోగిస్తుందని తెలిపారు.
తాజాగా రూ. 52 లక్షలతో కొత్త చెత్త వాహనం, రూ. 30 లక్షలతో రెండు ట్రాక్టర్లు, రూ. 8 లక్షలతో తోపుడు బండ్లు, డస్ట్‌బిన్‌లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. కాలువల్లో చెత్త తొలగింపుకు జేసీబీ కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు.
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 60 శాతం వీధి లైట్లు పనిచేయని స్థితిలో ఉండగా, ఇప్పటి వరకు 1,750 వీధి లైట్లు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రస్తుతం డంపింగ్ యార్డులో ఉన్న 6,300 టన్నుల చెత్తను జిందాల్‌కు పంపించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
మంచినీటి సమస్యపై స్పందించిన స్పీకర్, గతంలో మంజూరు అయిన 142 కోట్ల ప్రాజెక్టు నిర్లక్ష్యం చెందిన నేపథ్యంలో, సీఎం చంద్రబాబు సహకారంతో రూ. 166 కోట్లతో ప్రాజెక్టును కొనసాగించేందుకు ప్రతిపాదనలు మంజూరు చేయించామని తెలిపారు. రెండు సంవత్సరాల్లో ఈ పనులు పూర్తిచేయనున్నట్టు చెప్పారు.
మినరల్ గ్రాంట్, 15వ ఆర్థిక సంఘ నిధులు, వుడా నిధులతో కలిపి ఏడాదిలోనే రూ. 14.11 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇదే సమయంలో గత వైసీపీ పాలకులు మున్సిపాలిటీకి ఎంత నిధులు తీసుకువచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని స్పష్టంచేశారు. విద్యుత్ లేని సమయంలో 20 సెంటర్లలో సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని, నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉన్న ఏడు శ్మశానాలను అభివృద్ధి చేశామని, మిగిలినవాటిని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మి, ఆర్డీవో వివి రమణ, ఎమ్మార్వో రామారావు, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, వార్డ్ కౌన్సిలర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.