-మూడున్నరేళ్లలో బీసీలకు గోచీ మిగిల్చిన వైసీపీకి జయహో బీసీ అనడానికి సిగ్గనిపించడంలేదా ?
-బీసీలకు ద్రోహం చేసింది వై.య.స్ కుటుంబమే
-పూటకో మాట మాట్లాడే తమ్మినేని సీతారాంని చూసి ఊసరవెళ్లి సైతం సిగ్గు పడుతోంది
– టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్
దేశంలో వెయ్యి రూపాయల నోటుకు, రాష్ట్రంలో స్పీకర్ తమ్మినేని మాటకు విలువలేదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే సీతారాంను చూసి ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది. జగన్ రెడ్డి బీసీలను ఉద్ధరించినట్లు సీతారాం మాట్లాడుతున్నారు.
కానీ సీతారాం చెడ్డీలు వేసుకుని తిరిగే రోజుల్లోనే సామాజిక న్యాయానికి నాంది పలికిన పార్టీ టీడీపీ. గతంలో “చంద్రబాబే పెద్దబీసీ.. వైఎస్ బీసీలకు చేసింది ఏం లేదు” అన్న సీతారాం నేడు పార్టీ మారగానే మర్చిపోయారా? రాజకీయాల్లో పార్టీలు మారినా వ్యక్తిత్వం మారకూడదు. కానీ ఇలా పూటకో మాట మాట్లాడే వ్యక్తి మన స్పీకర్ గా ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. బీసీలకు మోసం, ద్రోహం, దగ, అన్యాయం చేసింది వైఎస్ కుటుంబమే. రాజారెడ్డి నుంచి నేటి జగన్ రెడ్డి వరకు బీసీల శవాల మీద రాజకీయ పునాదులు ఏర్పాటు చేసుకున్నారు.
జగన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా అణగతొక్కుతున్నాడు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లలో కోత కోసి 16,800 మందిని స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులు కాకుండా అడ్డుకున్నది ఎవరు? 8,000 ఎకరాల బీసీల భూములను బలవంతంగా లాక్కుంది ఎవరు? 50 మంది ముఖ్యమంత్రి సలహాదారుల్లో బీసీలెంత మంది? 34వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించి ద్రోహం చేసింది జగన్ రెడ్డి కాదా? 26 మంది బీసీలను పొట్టన పెట్టుకున్న మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా?
56 కార్పోరేషన్లను ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప వాటికి కనీసం రూ. 56 అయినా ఖర్చు చేశారా? చంద్రబాబు టీటీడీ ఛైర్మన్ పదవిని బీసీకి ఇస్తే.. జగన్ రెడ్డి మాత్రం తన సొంత బాబాయికి కట్టబెట్టాడు. మీ దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఇదేనా..? రాష్ట్రంలో వైసీపీ నేతల మాటలను బీసీలు నమ్మే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇకనైనా వైసీపీ నేతలు రంకెలు వేయడం మాని చర్చకు వస్తే బీసీలకు ఎవరేం చేసారో అంకెలతో సహా వివరించడానికి సిద్ధంగా ఉన్నాం.